పల్లెల్లోనూ ప్రభంజనం
ABN , Publish Date - Nov 08 , 2026 | 02:44 AM
‘స్థానిక’ సమరంలో కూటమి జైత్రయాత్ర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న ‘పుర’ పోరులో గెలుపు హోరెత్తించిన కూటమి... పల్లెనాడిని పట్టే ‘పరిషత్’ ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించింది.
పరిషత్ పోరులో ‘అల్లూరి’ మినహా అన్ని జిల్లాల్లో కూటమి కేక
కనీస స్థానాలూ దక్కించుకోలేని వైసీపీ
పలు జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ కూడా గెలవని వైనం
మండల పరిషత్‌లలోనూ అధికార కూటమి హవా
‘పుర’ సమరాన్ని మించిభారీ విజయం నమోదు
సుమారు 580 జడ్పీటీసీ స్థానాలు కూటమి ఖాతాలో
7 వేలకుపైగా ఎంపీటీసీ స్థానాల్లో కూటమి జెండా
పలు జిల్లాల్లో జడ్పీటీసీలు క్లీన్ స్వీప్
61 జడ్పీటీసీ, 1600 ఎంపీటీసీలకే వైసీపీ పరిమితం
‘అల్లూరి’ జడ్పీ మాత్రమే ‘ఫ్యాన్’ పార్టీకి దక్కే అవకాశం
అనేక జిల్లాల్లో బోణీ కూడా కొట్టని వైనం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): ‘స్థానిక’ సమరంలో కూటమి జైత్రయాత్ర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న ‘పుర’ పోరులో గెలుపు హోరెత్తించిన కూటమి... పల్లెనాడిని పట్టే ‘పరిషత్’ ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించింది. రాష్ట్రంలో 28 జిల్లాలు ఉండగా... 27 జడ్పీ పీఠాలపై కూటమి జెండా ఎగరడం ఖాయమైంది. గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8 గంటలకు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్‌ల నుంచే కూటమి అభ్యర్థుల ప్రభంజనం కనపడింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా... ఒక్క అల్లూరి జిల్లా మినహా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. అల్లూరి జిల్లా జడ్పీ పీఠం మాత్రమే వైసీపీ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఇతర జిల్లాల్లో ఎక్కడా గౌరవనీయ స్థాయిలో జడ్పీటీసీ స్థానాలు దక్కించుకున్న దాఖలాలు లేవు. ఎంపీటీసీలదీ అదే పరిస్థితి. చివరికి... జగన్ సొంత గడ్డ పులివెందుల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లోనూ వైసీపీ గల్లంతైపోయింది. శనివారం అర్ధరాత్రి సమయానికి అందిన సమాచారం మేరకు... రాష్ట్రంలోని మొత్తం 659లలో ఏకగ్రీవాలతో కలిపి దాదాపు 580 స్థానాలు కూటమి పరమయ్యాయి. వైసీపీ 61 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక... 9821 ఎంపీటీసీ స్థానాలకుగాను 2051 స్థానాలు ఏకగ్రీవం కాగా... 7767 స్థానాల్లో పోలింగ్ జరిగింది. వీటిలో 7వేలకుపైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
దాదాపు 1600 స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. పలు స్థానాల్లో అర్ధరాత్రి తర్వాత కూడా కౌంటింగ్ కొనసాగుతోంది. 2021లో వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సమరంలో పల్నాడు జిల్లాలో టీడీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. ఇప్పుడు... ఆ జిల్లాలోని జడ్పీటీసీ స్థానాలన్నీ కూటమికే దక్కాయి. మార్కాపురం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ అదే సీన్! అక్కడా జడ్పీటీసీ పోరులో వైసీపీ బోణీ కొట్టలేకపోయింది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కూటమి క్లీన్‌స్వీప్ చేసేసింది. అక్కడ ‘పరిషత్’లో వైసీపీ ఉనికి శూన్యం! ‘పరిషత్’ పోరులో వైసీపీ కంచుకోటలను కూడా టీడీపీ బద్దలు కొట్టింది.
జగన్ సొంత జిల్లా కడపలో 39 జడ్పీటీసీ స్థానాలకుగాను 37స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. వీటిలో పోలింగ్‌కు ముం దే 23 ఏకగ్రీవం కాగా... ఎన్నికలు జరిగిన మరో 14 స్థానాలను కూటమి అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన పుంగనూరులోని చౌడేపల్లి, పులిచర్ల, రొంపిచర్ల, సోమల జడ్పీటీసీలను టీడీపీ కైవశం చేసుకుంది. సదుం జడ్పీటీసీ ఒక్కటి వైసీపీకి దక్కగా, పుంగనూరులో హోరాహోరీ పోరు నడుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో జగన్ మేనత్త గ్రామం గణపవరంలో 20 ఏళ్ల తర్వాత టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గెలిచారు.
ఒకరకంగా చెప్పాలంటే... సార్వత్రిక ఎన్నికలకు మించి, మొన్నటి పురపోరుకు మించిన పరాజయం, పరాభవం వైసీపీ మూటగట్టుకుంది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర... ఇలా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశంతోపాటు కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ అభ్యర్థుల ప్రభంజనం కనిపించింది. ఉమ్మడి కర్నూలు జిల్లా మాత్రమే వైసీపీకి అంతో ఇంతో ఊరటనిచ్చింది. జగన్‌తోపాటు వైసీపీ సీనియర్ నేతలు బలపరచిన వారు పరాజయాలను మూటకట్టుకున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి చెందారు. ఎన్నికల్లో గెలుపొందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలు జెడ్పీ చైర్మన్, ఎంపీపీలను ఎన్నుకుంటారు. దీనికి షెడ్యూలు వెలువడాలి.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..