Share News

కూటమికి రెబల్స్‌ బెడద!

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:34 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు రెబల్స్‌ బెడద తగ్గలేదు. కొన్ని కొన్ని చోట్ల బరిలో నిలిచిన అభ్యర్థులు వెనక్కి తగ్గినా.. కొన్ని చోట్ల మాత్రం పట్టువీడటం లేదు.

కూటమికి రెబల్స్‌ బెడద!

  • కొన్నిచోట్ల వెనక్కితగ్గిన అభ్యర్థులు.. మరికొన్ని చోట్ల పట్టు వీడని వైనం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు రెబల్స్‌ బెడద తగ్గలేదు. కొన్ని కొన్ని చోట్ల బరిలో నిలిచిన అభ్యర్థులు వెనక్కి తగ్గినా.. కొన్ని చోట్ల మాత్రం పట్టువీడటం లేదు. ఈ క్రమంలో మాట వినని నాయకులపై టీడీపీ సస్పెన్షన్‌ కొరడా ఝళిపించింది. మరికొన్ని చోట్ల బుజ్జగింపుల పర్వం కొనసాగింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో కూటమి పార్టీలకు చెందిన ఆరుగురు రెబల్స్‌ చైర్‌పర్సన్‌ రేసులో ఉన్నారు. సాలూరు పురపాలక సంఘాన్ని జనసేనకు కేటాయించారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఆ పార్టీకి చెందిన గొర్లె విజయకుమారి నామినేషన్‌ వేశారు.

టీడీపీ నుంచి ఐదుగురు నామినేషన్లు వేయగా.. వీరిలో ముగ్గురే ఉపసంహరించుకున్నారు. మిగిలిన ఇద్దరిలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది చిట్టి సతీమణి శ్యామలతోపాటు గుల్ల మంజీరా స్వతంత్య్ర అభ్యర్థులుగా రేసులో ఉన్నారు. కాగా, సాలూరు చైర్‌పర్సన్‌ సీటు బీసీ మహిళకు రిజర్వ్‌ అయితే ఆ స్థానానికి పోటీ చేయొచ్చని భావించి టీడీపీ యువత నేత వైకుంఠపు హర్షవర్ధన్‌ మంజీరాతో పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. అయితే, ఆ స్థానం జనసేనకు కేటాయించడంతో ఆయన 21వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆయన భార్య మంజీర స్వతంత్ర అభ్యర్థిగా చైర్‌పర్సన్‌ సీటు కోసం నామినేషన్‌ వేశారు.


మరిన్ని చోట్ల..

  • శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో కొన్నిచోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ నుంచి రెబల్స్‌ బరిలో నిలిచారు. బుజ్జగింపుల కారణంగా ఎక్కువశాతం రెబెల్స్‌ ఉపసంహరించుకున్నారు. హిందూపురంలో 40, 1 వార్డుల్లో టీడీపీలో రెబెల్‌ అభ్యర్థులు వెనక్కి తగ్గలేదు.

  • కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాల్టీలో టీడీపీ 1వ వార్డు రెబల్‌ అభ్యర్థిగా నిలబడిన నందిక లోవరాజును పార్టీ సస్పెండ్‌ చేసింది. కాగా, తుని మున్సిపాల్టీ పరిధిలో జనసేన ఛైర్‌పర్సన్‌ అభ్యర్థికి పోటీగా టీడీపీ నుంచి నామినేషన్లు వేసిన కర్రి శ్రీదేవి, సూరంపూడి నళిని నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. అంతకుముందు రెబల్స్‌ను ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే దొరబాబు బుజ్జగించారు.

  • పిఠాపురం మున్సిపాల్టీలో పది వార్డుల్లో జనసేనకు 11 మంది రెబల్స్‌ తేలారు. టీడీపీకి 11వార్డుల్లో 14 మంది, బీజేపీకి ఇద్దరు, వైసీపీకి నాలుగు వార్డుల్లోను రెబల్స్‌ తప్పుకోకుండా పోటీకే మొగ్గు చూపారు. గొల్లప్రోలు మున్సిపాల్టీ పరిధిలో ఏడు వార్డుల్లో జనసేనకు రెబల్‌ అభ్యర్థుల తలనొప్పి ఏర్పడింది. టీడీపీకి ఒక వార్డులో రెబల్‌ నిలిచారు.

  • తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మాజీ మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ పేరూరి సాయిబాబా టీడీపీ రెబల్‌గా కౌన్సిలర్‌ స్థానానికి నామినేషన్‌ వేశారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా టీడీపీ మరో నాయకుడు, వార్డు ఇంచార్జి సతీశ్‌ కుమార్‌ తదితరులు మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే అక్కడున్న సాయిబాబా, సతీశ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. అలాగే మాజీ కౌన్సిలర్‌ షేక్‌ రెహానా తన భర్త షేక్‌ బహదూర్‌తో కలిసి వైసీపీలో చేరారు. ఆయన టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

  • ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట, తిరువూరు మునిసిపాలిటీలలో రెబల్స్‌ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెనుబల్లి శ్రావణి అనే మహిళతో టీడీపీ తరఫున రెబల్‌గా నామినేషన్‌ వేయించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనూరాధ జోక్యం చేసుకోవటంతో శ్రావణి తన నామినేసన్‌ను ఉపసంహరించుకున్నారు.


వైసీపీ బీఫారం వద్దు బాబోయ్‌...

గతంలో పాలకొండ నగర పంచాయతీ కో-ఆప్షన్‌ మెంబర్‌గా కాంచనమాల సాహు ఉండేవారు. అయితే ఆమె 19వ వార్డు నుంచి కౌన్సిలర్‌ స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. వైసీపీ బీఫారం ఇచ్చి పోటీ చేయమంటే.. తనకొద్దు అంటూ నామినేషన్‌ను బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో జనసేన నుంచి పోటీ చేస్తున్న కె. సరోజని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 04:34 AM