Share News

పుర పోరు.. ఏకగ్రీవాల జోరు!

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:22 AM

స్థానిక ఎన్నికల పోరులో కూటమి జోరు చూపిస్తోంది. 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు.. మొత్తం 100 పట్టణ స్థానిక స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 16 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పుర పోరు.. ఏకగ్రీవాల జోరు!

  • 16 మున్సిపల్‌ చైర్‌పర్సన్లు ఏకగ్రీవం

  • వీరిలో 14 మంది టీడీపీ.. జనసేన, బీజేపీ నుంచి చెరొకరు

  • అత్యధికంగా సీమలో 11.. పల్నాడులో 3.. ఉమ్మడి ప్రకాశంలో 2 ఏకగ్రీవం

  • వైసీపీ ఖాతాలో 10 వార్డులు, 7 ఎంపీటీసీలు

  • సొంత జిల్లాలో జగన్‌కు మైండ్‌ బ్లాంక్‌

  • ఇక్కడ కూటమికి 6 మున్సిపల్‌ చైర్మన్లు ఏకగ్రీవం

  • పులివెందులలోని 20 వార్డులు కూడా..

  • రాష్ట్రంలో 639 వార్డులు, 4 జడ్పీటీసీలు

  • 32 ఎంపీటీసీల్లోనూ కూటమి ఏకగ్రీవం

(అమరావతి/ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): స్థానిక ఎన్నికల పోరులో కూటమి జోరు చూపిస్తోంది. 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు.. మొత్తం 100 పట్టణ స్థానిక స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 16 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో 14 మంది టీడీపీకి చెందినవారు కాగా.. జనసేన, బీజేపీ నుంచి చెరొకరు ఎన్నికయ్యారు. 639 వార్డులు/డివిజన్లనూ కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.

అలాగే ఆదివారం నాటికి 4 జడ్పీటీసీలు, 32 ఎంపీటీసీ స్థానాలు కూడా కూటమి ఏకగ్రీవ ఖాతాలో పడ్డాయి. వైసీపీ సైతం 10 పట్టణ వార్డులు, 7 ఎంపీటీసీ స్థానాలను పోటీలేకుండా దక్కించుకుంది. పుంగనూరు, రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, కమలాపురం, ఆళ్లగడ్డ, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, ఆత్మకూరు, గుత్తి, కనిగిరి మున్సిపాలిటీలు టీడీపీకి దక్కగా.. దర్శిలో జనసేన, ఎర్రగుంట్లలో బీజేపీ చైర్మన్‌ అభ్యర్థులు ఎన్నికయ్యారు. రాయలసీమలో అత్యధికంగా 11 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. పల్నాడు జిల్లాలో 3, ఉమ్మడి ప్రకాశంలో రెండు ఏకగ్రీవమయ్యాయి.


జగన్‌ అడ్డాలో.. నిన్నటి వరకు కడప జిల్లాను వైఎస్‌ కుటుంబానికి అడ్డాగా ప్రజలు భావించేవారు. అందుకు తగ్గట్లుగానే జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఉండేవి. ఈసారి స్థానిక ఎన్నికలు మాత్రం వైఎస్‌ కుమారుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గట్టి షాకిచ్చాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు.. రాజంపేట (టీడీపీ-దొంతు గాయత్రి), ప్రొద్దుటూరు(టీడీపీ-నంద్యాల రాఘవరెడ్డి), బద్వేలు (టీడీపీ-దివ్యతేజ), మైదుకూరు(టీడీపీ-ధనపాల జగన్‌మోహన్‌).. రెండు నగర పంచాయతీలు కమలాపురం (టీడీపీ-గొంగల్‌రెడ్డి స్వప్న), ఎర్రగుంట్ల (బీజేపీ-గొర్ల మధులత) చైర్‌పర్సన్‌ పదవులను కూటమి పార్టీలు ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి.

  • రాజంపేటలో 32 వార్డులుండగా 14 వార్డు లు టీడీపీకి, ఒకటి జనసేనకు ఏకగ్రీవమయ్యాయి. ప్రొద్దుటూరులో 52 వార్డులు ఉండగా టీడీపీ అభ్యర్థులు 51చోట్ల, బీజేపీ అభ్యర్థి ఒకచోట ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  • బద్వేలులో 40 వార్డులకు గాను టీడీపీ 35, జనసేన 2 ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా పోటీలేకుండా గెలిచారు. 1న 39వ వార్డులో మాత్రమే ఎన్నిక జరుగనుంది.

  • మైదుకూరులో 32 వార్డులకు 17 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 15 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

  • కమలాపురం నగర పంచాయతీలో 23 వార్డులు ఉండగా.. టీడీపీ 22 ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఒక వార్డులో బీజేపీ ఏకగ్రీవమైంది.

  • ఎర్రగుంట్ల నగర పంచాయతీలో 28 వార్డులు ఉండగా టీడీపీకి 17, బీజేపీకి 10 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 7వ వార్డుకే ఎన్నిక జరగనుంది.

  • పులివెందుల మున్సిపాలిటీలో 40వార్డులు ఉంటే 19 వార్డుల్లో టీడీపీ, ఒక వార్డులో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 20 వార్డులతో పాటు చైర్‌పర్సన్‌ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

  • కడప కార్పొరేషన్‌లో 66 డివిజన్లున్నాయి. ఇందులో టీడీపీ 47, బీజేపీ 2, జనసేన 1 వార్డుల్లో ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ మేయర్‌ స్థానంతో పాటు మిగతా 16 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

  • అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి నయీం తాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడి మొత్తం 36 వార్డులూ కూటమికి ఏకగ్రీవమయ్యాయి.

  • రాయచోటి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన బోనుమల ఖాదర్‌వల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ మొత్తం 44 వార్డులూ కూటమికి ఏకగ్రీవమయ్యాయు.


తిరుపతి జిల్లాలో..

  • తిరుపతి కార్పొరేషన్‌లో 66 డివిజన్లకుగాను 2 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  • సూళ్లూరుపేట మున్సిపాలిటీ(32)లో రెండు చోట్ల టీడీపీకి ఏకగ్రీవం. పుత్తూరు మున్సిపాలిటీ(36)లో ఒకటి టీడీపీకి ఏకగ్రీవం.

  • చిత్తూరు కార్పొరేషన్‌(60)లో 48 స్థానాల్లో టీడీపీ.. జనసేన, బీజేపీ, వైసీపీ తలోచోట ఏకగ్రీవం.

  • కుప్పం మున్సిపాలిటీ(32)లో 13 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం.

  • నగరి మున్సిపాలిటీ(40)లో 2 టీడీపీ, ఒకటి వైసీపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి ఏకగీవ్రం.

  • కర్నూలు జిల్లాలో.. కర్నూలు కార్పొరేషన్‌లో ఒక వార్డు టీడీపీకి ఏకగ్రీవం.

  • నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన షేక్‌ అనీషా ఏకగ్రీవ ఎన్నిక. ఇక్కడ మొత్తం 32 వార్డుల్లో కూటమి అభ్యర్థులు పోటీలేకుండా ఎన్నికయ్యారు.

  • ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన డాక్టర్‌ గోవిందరాజులు ఏకగ్రీవ ఎన్నిక. మొత్తం 32 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు 17 చోట్ల, జనసేన, బీజేపీ నుంచి చెరొకరు ఏకగీవ్ర ఎన్నిక.

  • శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ(52)లో 2, మడకశిర నగర పంచాయతీ(23)లో ఒకటి టీడీపీకి ఏకగ్రీవం.

  • అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా తమిళ సెల్వి (టీడీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడి 32 వార్డులకుగాను 27 ఏకగ్రీవమయ్యాయి.

  • తాడిపత్రి మున్సిపాలిటీలో 48 వార్డులకు 30 వార్డు ల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలేదు.

  • గుంతకల్లు మున్సిపాలిటీ(48)లో 1, కల్యాణదుర్గం మున్సిపాలిటీ(32)లోనూ ఒక చోట టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. జిల్లాలో 31 జడ్పీటీసీ స్థానాలకుగాను గుత్తి టీడీపీకి ఏకగ్రీవమైంది. జిల్లాలోని మొత్తం 450 ఎంపీటీసీలకు గాను 11 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.


ఉమ్మడి ప్రకాశంలో 2 ఏకగ్రీవం

  • ప్రకాశం జిల్లాలో.. దర్శి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా జనసేనకు చెందిన దారం సుబ్బారావు ఏకగ్రీవం ఎన్నికయ్యారు. కూటమి పార్టీల మధ్య అవగాహనలో భాగంగా దర్శి చైర్మన్‌ పదవి చివరి క్షణంలో జనసేనకు దక్కింది. అప్పటికే టీడీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సుబ్బారావు.. తర్వాత జనసేనలో చేరి టికెట్‌ పొందారు. మొత్తం 28 వార్డులకు గాను టీడీపీ నుంచి 25 మంది, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  • మార్కాపురం జిల్లా కనిగిరి చైర్‌పర్సన్‌గా అచ్చాల తిరుపతమ్మరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీ(32)లో మొత్తం 32 వార్డులు ఉండగా.. టీడీపీ నుంచి 27 మంది, బీజేపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఒకరు ఏకగ్రీవమయ్యారు. ఒక వార్డులో సీపీఎం, మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి పోటీ నుంచి వైదొలగకపోవడంతో ఆ రెండు వార్డులకు 1న ఎన్నిక జరుగనుంది.

  • ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 62 డివిజన్లకుగాను 3, అద్దంకి మున్సిపాలిటీ(32)లో 3 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

ఉత్తరాంధ్రలో..

  • ఉత్తరాంధ్రలో ఏకగ్రీవాల ఊసు పెద్దగా లేదు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ(28)లో ఒక వార్డు, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ(28) ఒక వార్డు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ(40)లో 2 వార్డులు కూటమి అభ్యర్థులకు ఏకగ్రీవమయ్యాయి. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఏకగ్రీవాలు జరగలేదు.

  • నెల్లూరు జిల్లాలో.. నెల్లూరు కార్పొరేషన్‌(72)లో 8, ఆత్మకూరు మున్సిపాలిటీ(28)లో ఒకటి.. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ(28)లో 5 వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.


ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో..

  • పల్నాడు జిల్లాలో.. పిడుగురాళ్ల మున్సిపాలిటీ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్‌ బాబావలీ ఏకగ్రీవమయ్యారు. ఇక్కడ మొత్తం 40 వార్డులనూ కూటమి అభ్యర్థులు దక్కించుకుంది. దాచేపల్లి నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి తంగెళ్ల శ్రీనివాసరావు ఏకగ్రీవమయ్యారు. ఇక్కడి 28 వార్డులూ కూటమిపరమయ్యాయి. గురజాల నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి నెలవల్లి బొల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడి మొత్తం 23 వార్డులనూ కూటమి పోటీలేకుండా దక్కించుకుంది.

  • సత్తెనపల్లి మున్సిపాలిటీ(36)లో ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ(48)లో 16 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు లేవు.

  • ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ(36)లో 12 వార్డులు, నందిగామ మున్సిపాలిటీ(32)లో ఒక వార్డు ఏకగ్రీవం కాగా, విజయవాడ కార్పొరేషన్‌(86)లో ఒక్క డివిజన్‌, ఏకగ్రీవమైంది. బాపట్ల జిల్లా.. రేపల్లె మున్సిపాలిటీ(36)లో ఒక వార్డు కూటమికి ఏకగ్రీవమయ్యాయి.

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో..

  • కాకినాడ జిల్లాలో.. పిఠాపురం మున్సిపాలిటీ(33)లో 3 వార్డులు, తుని(36)లో 1, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ(28)లో 4, కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ(36)లో 1, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ(28)లో 9 వార్డులు కూటమికి ఏకగ్రీవమయ్యాయి. కాకినాడ జిల్లాలో రెండు ఎంపీటీసీలు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి కూటమికి ఏకగ్రీవమయ్యాయి. పోలవరం, ఏలూరు జిల్లాలో ఏకగ్రీవాలు లేవు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 06:26 AM