కూటమికే పట్టం కట్టండి
ABN , Publish Date - Oct 28 , 2026 | 04:26 AM
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. ‘కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ కూటమిని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ స్పీడ్‌తో అభివృద్థి చేస్తాం.
జగన్‌ది హిట్ అండ్ రన్ రాజకీయం
బెంగళూరు నుంచి వచ్చి ఫేక్ ప్రచారం చేసి తిరిగి వెళ్తున్నారు
ఒక వ్యక్తి వల్ల రాష్ట్రం నష్టపోవాలా?
ఎన్నికలు గొడ్డలి పార్టీకి ఇష్టం లేదు
ఆ పార్టీ నేతలు హింసను వీడాలి
జనజీవన స్రవంతిలో కలవాలి
జగన్ ఆలోచన ప్యాలెస్‌ల కోసం..
మా ఆలోచన ప్రజల కోసం
మేం పెత్తందార్లం కాదు.. సేవకులం
కూటమి గెలుపుతో ట్రిపుల్ ఇంజన్ స్పీడ్‌తో అభివృద్ధి
డిప్యూటీ సీఎం పవన్, మాధవ్తోకలిసి సీఎం మీడియా సమావేశం
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. ‘కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ కూటమిని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ స్పీడ్‌తో అభివృద్థి చేస్తాం. ఈ ఎన్నికల్లో కూటమికి మద్దతు పలికి ప్రజలు ట్రెండ్ సెట్ చేయాలి’ అని పిలుపిచ్చారు. ఒక వ్యక్తి వైఖరితో రాష్ట్రం ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. రప్పారప్పా రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెడతారా అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను నిలదీశారు.
మంగళవారం సీఎం ఉండవల్లి నివాసంలో కూటమి అగ్రనేతలు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చి హిట్ అండ్ రన్ తరహాలో వ్యవహరిస్తున్నారని.. రాష్ట్రంలో ఫేక్ ప్రచారం చేసి తిరిగి బెంగళూరు వెళ్లిపోతారని విమర్శించారు. గొడ్డలి పార్టీ నేతలు హింసా విధానాన్ని విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు. స్థానిక ఎన్నికలు జరగడం గొడ్డలి పార్టీకి ఇష్టం లేదని.. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరగనివ్వకూడదనేది దాని ఆలోచనగా పేర్కొన్నారు. ఎన్నికలు ఆపడానికి కోర్టుల్లో 62 పిటిషన్లు దాఖలు చేశారని గుర్తుచేశారు. ‘సర్పైనా, డీలిమిటేషన్, బీసీ రిజర్వేషన్లపైనా కోర్టులకెక్కారు. ఇప్పుడు ఎన్నికలు జరక్కపోతే ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయి.
స్థానిక సంస్థలు అభివృద్థి కావడం ఆ పార్టీకి ఇష్టం లేదు. నామినేషన్లు వేయడానికి ముందుకు రాకుండా హింసాత్మక ఘటనలు సృష్టించారు’ అని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ సహనాన్ని, సంయమనాన్ని కూడా గొడ్డలి పార్టీ దుర్వినియోగం చేస్తోందన్నారు. ప్రజలు కూడా మంచి చెడులను విశ్లేషించాలని కోరారు. 2024లో చరిత్రాత్మక మద్దతు ఇచ్చినట్లు గానే.. మా రెండున్నరేళ్ల కష్టాన్ని గుర్తించి ఆశీర్వదించాలని కోరుతున్నామన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
బీ-ఫాం ఇచ్చిన అభ్యర్థులనే గెలిపించాలి
స్థానిక సంస్థల్లో ప్రతి అంశాన్నీ బేరీజు వేసుకుని.. కూటమి సంకీర్ణ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకునే సీట్లు ఇచ్చాం. బీఫాం ఇచ్చిన అభ్యర్థులకే కూటమి నేతలు సహకరించాలి. వారినే గెలిపించాలి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించొద్దు. మూడు పార్టీలూ సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఇది. సీట్ల సర్దుబాటుపై తాను, పవన్ కల్యాణ్ ఎన్నడూ చేయనంత కసరత్తు చేశాం. ఎంపీటీసీల స్థాయిలో సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాం. రాష్ర్టాభివృద్థి కోసం కూటమిగా పని చేయడానికి ప్రాధాన్యమిస్తున్నాం. స్థానిక సంస్థల్లో సీట్లు ఇవ్వలేని వాళ్లకు న్యాయం చేస్తాం. కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించేందుకు మూడు పార్టీల కార్యకర్తలు కృషి చేయాలి.
రౌడీ రాజకీయం..
గొడ్డలి పార్టీ సిద్ధాంతం.. క్రిమినలైజేషన్, లిటిగేషన్, ఫేక్ ప్రాపగాండా. మా సిద్థాంతం.. సంక్షేమం, అభివృద్థి, సుపరిపాలన, సేవా భావం. గతంలో రాజకీయాల్లోకి రౌడీలు వస్తే ప్రజలు గమనించేవారు. ఇప్పుడు రౌడీలే రాజకీయం చేస్తున్నారు. గతంలో గుంతలు పెట్టిన రోడ్లను మరమ్మతు చేశాం. కొత్తవి వేస్తున్నాం. గతంలో నిలిచిపోయిన సమస్యలకు పరిష్కారం చూపుతున్నాం. స్ర్తీశక్తి ద్వారా ఉచిత ప్రయాణాలతో మహిళలకు ఆర్థిక సాధికారత కలిగింది. ప్రజలు, రాష్ర్టాభివృద్థి పట్ల మాది భయం కాదు.. బాధ్యత. మేం పెత్తందార్లం కాదు ప్రజలకు సేవకులం. జవాబుదారీతనంతో ఉన్నాం.
తల్లి, చెల్లెలికి మోసం..
రాష్ట్రంలోనే కాదు.. జగన్ వాళ్ల కుటుంబంలోనూ సంక్షోభాన్ని సృష్టించుకున్నారు. ఆస్తుల కోసం సొంత చెల్లెలిని, తల్లిని మోసం చేస్తున్నారు. అతడి ఆలోచన ప్యాలస్‌ల కోసం. మా ఆలోచన, మా తపన ప్రజలు, పేదల కోసం.
జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారం
జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారం దక్కాలన్నది మా అభిమతం. అందుకు అనుగుణంగానే కూటమి పార్టీల అభ్యర్థులకు సీట్లు కేటాయించాం. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, మా అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను. మేం సంక్షేమం అందించాం.. అభివృద్ధీ చేస్తున్నాం... రోడ్లు వేసి చూపించాం. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ర్టానికి ప్రధాని మోదీ అండగా నిలిచారు.. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున అభివృద్ధి చేపట్టాం. ఈ ఏడాది సూపర్ ఎల్‌నినోతో తీవ్ర కరువు వచ్చింది. 53 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అయినా సమర్థ నీటి నిర్వహణతో డెల్టా ప్రాంతంలో నీరివ్వగలిగాం. కేంద్ర సహకారం, పవన్ కల్యాణ్‌తో సమన్వయంగా కలిసి పని చేయడం వల్లే ఇది సాధ్యమైంది.
గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్టు.. ఓడినప్పుడు కాదా?
ఎన్నికల కమిషన్‌కు సంబంధించి.. గతంలో ఎలాంటి వ్యవస్థ ఉందో ఇప్పుడూ అదే ఉంది. సీఈసీ విషయంలో కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నాయి. సర్‌పై ఒకచోట ఒక వైఖరి, మరోచోట మరోవైఖరి అవలంబిస్తారా..? కేంద్రంపైనా, రాష్ర్టాలపైనా బురదజల్లే ప్రయత్నం చేస్తారా..? ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న పార్టీలు.. ఇదే ఈవీఎంలతో గెలిచాయి. యూపీఏ గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్టు.. ఓడినప్పుడు రాంగ్ అనడం సరైనదేనా..? జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నట్టే.. గొడ్డలి పార్టీ నేత తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోంది. ఓ రాజకీయ పార్టీలా వైసీపీ వ్యవహరించడం లేదు. మంచిని చూడలేకపోతోంది. అభివృద్థిని సహించలేకపోతోంది.
గతంలో నక్సల్స్‌ను జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపిచ్చాను. అప్పుడు తెలంగాణ మంత్రి సీతక్క జనశక్తి నుంచి వచ్చి జనజీవన స్రవంతిలో కలిశారు. గొడ్డలి పార్టీ నేతలు కూడా హింసను విడనాడి అలా కలవాలని కోరుతున్నాను.
- సీఎం చంద్రబాబు
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు