Share News

కేంద్ర బలగాలను దించాలని ఆదేశించలేం

ABN , Publish Date - Oct 20 , 2026 | 03:30 AM

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాల మోహరింపునకు ఆదేశాలు ఇవ్వలేమని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

కేంద్ర బలగాలను దించాలని ఆదేశించలేం
AP HIGH COURT

  • కేంద్ర బలగాలను దించాలని ఆదేశించలేం

  • వైసీపీ అప్పీల్‌ను కొట్టివేసిన హైకోర్టు

  • ’స్థానికం‘గా ఆరేడు ఘటనల ఆధారంగా కేంద్ర బలగాలను కోరలేరు

  • సమస్యాత్మక ప్రాంతాల్లో 32.5 ప్లాటూన్ల అదనపు బలగాలు

  • అవసరాన్ని బట్టి మరిన్ని మోహరించే అధికారం ఎస్‌ఈసీకి ఉంది: ఏజీ

అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాల మోహరింపునకు ఆదేశాలు ఇవ్వలేమని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాష్ట్రంలో జరిగిన ఆరేడు ఘటనల ఆధారంగా కేంద్ర బలగాల మోహరింపును పిటిషనర్‌ కోరలేరన్న రాష్ట్రప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో కేంద్ర బలగాలు మోహరించాయని వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది వాదిస్తున్నారని.. ఆ రాష్ట్ర పరిస్థితులతో ఏపీ పరిస్థితులను పోల్చిచూడలేమని సింగిల్‌ జడ్జి స్పష్టంగా చెప్పారని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో అప్పీల్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి చేసిన అభ్యర్ధనను సింగిల్‌ జడ్జి తోసిపుచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులతో ఏపీలో పరిస్థితులను పోల్చలేమన్నారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని, పోలీసులను ఆదేశించారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అప్పిరెడ్డి దాఖలుచేసిన అప్పీల్‌ సోమవారం ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న ఆరేడు ఘటనల ఆధారంగా కేంద్ర బలగాలను మోహరించాలని కోరలేరన్నారు.


‘హింసాత్మక ఘటనలు ఎక్కువ ఉమ్మడి కడప జిల్లాలోనే జరిగాయి. మరికొన్ని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.

సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనంగా 32.5 ప్లాటూన్ల అదనపు బలగాలను మోహరిస్తున్నాం. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్‌ఈసీ అన్ని చర్యలూ తీసుకుంటోంది. అవసరాన్ని బట్టి మరిన్ని బలగాలను మోహరించాలని ఆదేశించే అధికారం దానికి ఉంది’ అని తెలిపారు. అప్పీల్‌ను కొట్టివేయాలని కోరారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని.. ఎంపీపై దాడులకు పాల్పడ్డారని.. అధికార పార్టీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని అప్పిరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల వివరాలతో అఫిడవిట్‌ వేశామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. సింగిల్‌ జడ్జి ముందు ఉంచని, అదనపు అఫిడవిట్‌తో జత చేసిన అంశాలను అప్పీల్‌ విచారణలో పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. అదనపు అఫిడవిట్‌తో జతచేసిన వివరాలను పరిశీలించేందుకు సింగిల్‌ జడ్జి వద్దకు పంపిస్తామని, అందుకు సమ్మతమేనా అని పొన్నవోలును ప్రశ్నించింది. ఆయన బదులిస్తూ.. తమకంత సమయం లేదని, తమ అప్పీల్‌పై ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీంతో సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరిస్తూ ధర్మాసనం అప్పీల్‌ను కొట్టివేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష

నేడు స్విమ్స్‌ ఓపీ, ఓటీలకు సెలవు

Updated Date - Oct 20 , 2026 | 03:32 AM