విధ్వంసం.. అరాచకం
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:10 AM
పరిషత్ నామినేషన్ల ఘట్టం వరుసగా రెండోరోజు కూడా ఉద్రిక్తంగా ముగిసింది. కర్నూలు జిల్లాలో అత్యంత సున్నితమైన క్రిష్ణగిరి మండలంలో వైసీపీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి.
రెండో రోజూ ఉద్రిక్తంగా పరిషత్ నామినేషన్ల పర్వం
కర్నూలు జిల్లా క్రిష్ణగిరిలో టీడీపీ లక్ష్యంగా వైసీపీ దాడులు
అడ్డుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా కనిగిరిలో వైసీపీ వీరంగం
రూల్స్ బ్రేక్ చేసి పోలీసులతో బాహాబాహీ
హెచ్‌ఎంపాడులో నామినేషన్ కేంద్రంలోకి చొరబాటు
అక్కడ ఉన్న మహిళలపై పిడిగుద్దులు
అన్నమయ్యలో వైసీపీ బరితెగింపు.. ట్రాక్టర్‌కు నిప్పు
(ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్): పరిషత్ నామినేషన్ల ఘట్టం వరుసగా రెండోరోజు కూడా ఉద్రిక్తంగా ముగిసింది. కర్నూలు జిల్లాలో అత్యంత సున్నితమైన క్రిష్ణగిరి మండలంలో వైసీపీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఎంపీటీసీ నామినేషన్ దాఖలు సందర్భంగా, వైసీపీ నాయకులు రాళ్లతో తెగబడ్డారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ తల పగిలింది. గురువారం ఉదయం టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు మూకుమ్మడిగా వచ్చారు. సమీపంలో ఉన్న టీడీపీ శ్రేణులపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు.
టీడీపీకి చెందిన 20 మందికి పైగా గాయపడ్డారు. రాళ్ల దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ రాఘవేంద్ర ప్రసాద్ గాయపడ్డారు. అరగంట సేపు రాళ్ల వర్షం కొనసాగింది. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో పలువురు వైసీపీ నాయకులు పెద్దసంఖ్యలో నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకోవటంతో గందరగోళం నెలకొంది. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున గుంపులుగా రావడం నిబంధనలకు విరుద్ధమని సీఐ, ఎస్‌ఐలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది.
హనుమంతునిపాడులో వైసీపీ ఇన్‌చార్జి దద్దాల నారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నామినేషన్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. అక్కడున్న టీడీపీ నేతలు, తెలుగు మహిళలపై దాడిచేశారు. తనను చుట్టుముట్టి కాళ్లతో తన్నడంతోపాటు ముఖంపై, చాతీపై కొట్టారని బాధిత టీడీపీ మహిళ లక్ష్మి వాపోయారు. పొత్తికడుపులో ఆమెకు అంతర్గత గాయాలు, రక్తస్రావమైనట్లు తెలిసింది. ఈ దాడిలో జనసేన నాయకుడు ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డారు.
దాడులు.. విధ్వంసం..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ నామినేషన్ కేంద్రం వద్దకు వైసీపీ మాజీ సింగిల్‌విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి నామినేషన్ వేయడానికి రాగా ఆయనపై దాడి జరిగింది. పోలీసుల జోక్యంతో ఆయన నామినేషన్ వేసినా వెలుపలికి వచ్చాక మళ్లీ దాడి యత్నం జరిగింది. తిరుపతి రూరల్‌లో వైసీపీ ఎంపీపీ అభ్యర్థి నాగలక్ష్మి వెంట నామినేషన్ వేసేందుకు వెళ్ళిన భర్త చిన్నీ యాదవ్‌పై టీడీపీ శ్రేణులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి పాలెంకోట చంద్రయ్య నామినేషన్ వేసేందుకు రాగా, జనసేన వర్గీయులు దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కుని చించివేశారు. తొట్టంబేడు మండలం కాసరం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి సురేష్‌రెడ్డి పై దాడి చేసి పత్రాలు లాక్కున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన తనయులు మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.
వైసీపీ వీరంగం
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. జనసేన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ నేత ట్రాక్టర్‌కు నిప్పుపెట్టారు. పెద్దతిప్పసముద్రం మండలంలో వైసీపీ రాళ్ల దాడిలో పోతుపేట టీడీపీ గ్రామ అధ్యక్షుడు నారాయణరెడ్డి, టీడీపీ నేత ఆనంద్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ములకలచెరువు, పెద్దమండ్యం మండలాల్లోనూ వైసీపీ మూకలు టీడీపీ మద్దతుదారులపై దాడులకు తెగబడ్డాయి.
టీడీపీ శ్రేణులపై విరిగిన లాఠీ
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి, బత్తలపల్లిలో గురువారం టీడీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. లాఠీలతో కొట్టడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. చెన్నేకొత్తపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్దకు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఉద యం చేరుకున్నారు. వారిని కాసేపు ఆగాలంటూ పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ అభ్యర్థులను మాత్రం లోపలికి పంపి, తమను అడ్డుకుంటున్నారంటూ రామగిరి సీఐ ఇస్మాయిల్, చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ సత్యనారాయణతో వాగ్వాదానికి దిగారు.
దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజుకు చెప్పారు. సీఐ, ఎస్‌ఐ తీరు గురించి వారు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ధర్మవరం డీఎస్పీ బీవీ జగన్నాథరాజు ఎమ్మెల్యేలతో చర్చించారు. సీఐ, ఎస్‌ఐపై విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. బత్తలపల్లిలో సీఐ ప్రభాకర్ తన వాహనంలో వైసీపీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రానికి వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు సీఐ జీపు వద్దకెళ్లారు. వారిని స్పెషల్ పార్టీ పోలీసులు లాఠీలతో చితకబాదారు. దీంతో 10 మంది టీడీపీ కార్యకర్తలు, ఓ బీజేపీ నేతకు గాయాలయ్యాయి.
నందలూరులో పేలిన తుపాకీ
టీడీపీలోని రెండు వర్గాల బాహాబాహీ
ఎంపీపీ స్థానంకోసం టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు రగలడంతో కడప జిల్లాలోని నందలూరు రణరంగంగా మారింది. నందలూరు ఎంపీపీ స్థానాన్ని రిజర్వేషన్లలో భాగంగా జనరల్ మహిళకు కేటాయించారు. నందలూరు-1 ఎంపీటీసీగా టీడీపీ నేత ఎద్దుల విజయసాగర్ భార్య ప్రమీల నామినేషన్ వేశారు. ఆయన కూడా నందలూరు-2 ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేశారు. లేబాక గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆవుల లక్ష్మీనరసమ్మ ఆడపూరు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు గురువారం మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయానికి కుమారుడు ఆవుల బాలసుబ్రహ్మణ్యంతోకలిసి బయలుదేరారు.
వీరిని విజయసాగర్, ఆయన వర్గీయులు నందలూరులోని జాతీయరహదారిపై అడ్డుకున్నారు. ఎస్‌ఐ మహేశ్‌నాయుడు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఇరువర్గాలు రాళ్లు, సోడాబాటిళ్లతో దాడులకు తెగబడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక కారు మంటల్లో చిక్కుకుంది. ఆవుల బాలసుబ్రహ్మణ్యం తుపాకీతో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇరువర్గాల దాడిలో ఏఆర్ కానిస్టేబుల్ గురవయ్యతో పాటు పలువురికి గాయాలయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి: