Share News

స్థానికానికి ‘సర్‌’ అడ్డుకాదు

ABN , Publish Date - Sep 02 , 2026 | 03:56 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియ ఎలాంటి ప్రభావం చూపదని అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ మంగళవారం హైకోర్టుకు నివేదించారు.

స్థానికానికి ‘సర్‌’ అడ్డుకాదు

  • స్థానికానికి ‘సర్‌’ అడ్డుకాదు

  • నోటిఫికేషన్‌ నాటికి అందుబాటులోని ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరపొచ్చు

  • జాబితా సవరణల కారణంగా ఎన్నికల వాయిదా వద్దని సుప్రీంకోర్టే తెలిపింది

  • వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌

  • స్థానికంతో ముడిపడ్డ పిల్‌లు సీజే వద్దకు

  • దీనినీ వాటితో కలపాలన్న వినతికి ఓకే

  • నోటిఫికేషన్‌ నాటికి అందుబాటులోని ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరపొచ్చు: ఏజీ

అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియ ఎలాంటి ప్రభావం చూపదని అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియ అని వివరించారు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. పంచాయతీలకు సంబంధించి వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ ఈ ఏడాది ఏప్రిల్‌ 15న పూర్తి అయిందని, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి సెప్టెంబరు 3న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురితం అవుతుందని కోర్టుకు తెలిపారు. ఈ దశలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ... సర్‌ ప్రక్రియ ముగియకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. దీనిపై ఏజీ బదులిస్తూ... ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చేనాటికి అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.


ఓటర్ల జాబితాలో సవరణలను కారణంగా చూపుతూ ఎన్నికలను వాయిదా వేయడానికి వీల్లేదని అదే తీర్పులో పేర్కొందన్నారు. అక్టోబరు మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు నామినేషన్‌ వేసే చివరి తేదీ వరకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందన్నారు. పిటిషనర్ల అభ్యర్థన ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని కోరడం తప్ప మరొకటి కాదని తెలిపారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలు సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నాయని, అవి ఈ నెల తొమ్మిదిన విచారణకు రానున్నాయని వివరించారు. ప్రస్తుత పిటిషన్‌నూ పిల్‌లతో జత చేయాలని కోరారు.

పిటిషనర్‌ అభ్యర్థనను అనుమతిస్తే ఎన్నికలు మరింత ఆలస్యం అవుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత ప్రస్తుత పిటిషన్‌ను స్థానిక ఎన్నికలతో ముడిపడిన ప్రజాహిత వ్యాజ్యాలతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. సర్‌ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సర్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకు స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలన్నారు. ఈ పిటిషన్‌ మంగళవారం విచారణకు రాగా, పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ‘సర్‌లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో మరణించిన, నకిలీ, వలస వెళ్లిన వారి పేర్లను లక్షల సంఖ్యలో తొలగించారు.


ఈ ఏడాది అక్టోబరు 3 నాటికి సర్‌ ప్రక్రియ ముగిసి తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. ఈ ఏడాది జనవరి 1 అర్హత తేదీగా అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా ఈ నెల 3లోగా వార్డులు వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సర్‌ ప్రక్రియను ముగించి అక్టోబరు 3న కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా ప్రచురించనుంది. ఆ ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి. నామినేషన్లు ముగింపు తేదీనాటికి ఓటర్ల జాబితాలో వచ్చే సవరణలు పరిగణనలోకి తీసుకొని అనుబంధ ఓటర్ల జాబితాను విడుదల చేసేలా ఎస్‌ఈసీని నిర్దేశించండి’’ అని వాదించారు.

ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 03:56 AM