సర్ కోసం స్థానికం ఆపలేం!
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:39 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసి.. కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఓటర్ల జాబితా ప్రచురించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను ఆపలేమని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టంచేసింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుని అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని..
హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదన
ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియ
సర్ కారణంగా ఎన్నికల వాయిదా కుదరదు
అందుబాటులో ఉన్న జాబితాతో జరపొచ్చు
రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది: ఏజీ
‘స్థానిక’ పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వు
అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసి.. కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఓటర్ల జాబితా ప్రచురించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను ఆపలేమని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టంచేసింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుని అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని.. నోటిఫికేషన్ జారీచేసే తేదీ వరకు ఆ జాబితాలో జరిగే అన్ని మార్పులు, చేర్పులనూ అనుమతిస్తామని హైకోర్టుకు తెలిపింది. అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతో స్థానిక ఎన్నికలు జరపొచ్చని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా స్పష్టం చేసిందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. వాదనలు ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ఇప్పటికే తీర్పును రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేశ్.. సర్ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించాకే వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి.. బీసీ జనగణన చేపట్టడంతో పాటు తదనుగుణంగా రిజర్వేషన్ ఖరారు చేశాకే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
అప్పిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ‘సర్ ప్రక్రియను ముగించి అక్టోబరు 3న కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత ఎన్నికలు నిర్వహించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలి’ అని కోరారు. అయితే సర్ ప్రక్రియ జరుగుతోందని పాత ఓటర్ల జాబితా చెల్లకుండా పోదని ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వినీకుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 243(కే) అధికరణ ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీపై పర్యవేక్షణ, నియంత్రణపై విచక్షణాధికారం ఎస్‌ఈసీకి ఉందని గుర్తుచేశారు. సర్ ప్రక్రియ ముగిసి ఓటర్ల జాబితా ప్రచురించే వరకు స్థానిక ఎన్నికలను ఆపలేమన్నారు. పిటిషనర్ అభ్యర్థనను అంగీకరిస్తే ఇప్పటివరకు పూర్తిచేసిన ఎన్నికల సన్నాహక చర్యలన్నీ వృథా అవుతాయని.. స్థానిక ఎన్నికలు మరింత జాప్యమవుతాయని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ, సమగ్ర సవరణ నిరంతర ప్రక్రియని.. సర్ ప్రక్రియ జరుగుతుందనే కారణంతో ఎన్నికలు వాయిదా వేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఏజీ తెలిపారు. అందుబాటులోని ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని పేర్కొందన్నారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ తేదీ వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులను వీలు కల్పించాలని పంచాయతీరాజ్ చట్ట నిబంధనలు చెబుతున్నాయని గుర్తుచేశారు.
సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటవలేదు..!
శంకరరావు తరఫున సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. వెనుకబడిన తరగతుల ఫైనాన్స్ కమిషన్ 1986లో సేకరించిన గణాంకాల ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేస్తూ వస్తున్నారని.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బీసీ గణన జరిపి, రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలన్నారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్.. ఏపీ బీసీ కమిషన్ చట్టనిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదన్నారు. అయితే ప్రస్తుత పిల్‌లో కమిషన్ నియామకాన్ని సవాల్ చేయలేదని ఏజీ గుర్తుచేశారు. వ్యాజ్యంలో ప్రస్తావించని అంశాలను కోర్టు ముందు వాదించడం సరికాదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే, ఏకసభ్య కమిషన్ గణాంకాలు ఆధారంగా బీసీ రిజర్వేషన్ ఖరారు చేశామని.. జీవోలను పిటిషనర్ సవాల్ చేయలేదని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్ ఖరారు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకున్నామని, పిల్‌ను కొట్టివేయాలని కోరారు.
చట్ట నిబంధనల్లేకుండా బీసీల ఉపవర్గీకరణ కోరలేరు..
బీసీలను ఉపవర్గీకరించి సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ పిల్ వేశారు. ఆయన తరఫున న్యాయవాది నారాయణరావు వాదనలు వినిపిస్తూ.. బీసీలను ఉపవర్గీకరించి రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. అయితే చట్టబద్ధమైన నిబంధనలు లేకుండా బీసీల ఉపవర్గీకరణ చేసి రిజర్వేషన్ ఖరారు చేయాలని పిటిషనర్ కోరలేరని ఏజీ పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే, ఏకసభ్య కమిషన్ గణాంకాల ఆధారంగా ప్రభుత్వం బీసీలందరికీ కలిపి 34 శాతం రిజర్వేషన్ కల్పించిందన్నారు. వ్యాజ్యాలపై అన్ని పక్షాల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ వార్తలనూ చదవండి...