Share News

జనం మెచ్చారు!

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:25 AM

మన పిల్లలకు పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూస్తాం. అదే విధంగా తాము ఎన్నుకోబోయే వ్యక్తి, పార్టీ గుణగణాలను విశ్లేషించుకుని ప్రజలు ఈ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించారు.

జనం మెచ్చారు!

  • మా కష్టాన్ని గుర్తించి ఆశీర్వదించారు: చంద్రబాబు

  • సుపరిపాలనకు ‘స్థానిక’ తీర్పే నిదర్శనం

  • ఈవీఎంలు, బ్యాలెట్‌, పోస్టల్‌ బ్యాలెట్లు.. ఏ విధంగానైనా జనం మద్దతు మాకే!

  • అన్ని ప్రాంతాలు, వర్గాలూ కూటమి వైపే

  • నమ్మకం లేని వాళ్లే కుట్రలు చేస్తారు

  • కుప్పంలో ఓ ఎంపీటీసీ ఓడినా.. ప్రజాతీర్పును గౌరవించాం

  • రౌడీ రాజకీయాలకు ఇది రాతియుగం కాదు

  • రక్తతర్పణాలు, రప్పారప్పాను జనం ఎప్పుడూ ఆమోదించరు

  • డబ్బు ప్రభావం కనిపించకూడదనే అతితక్కువ సమయంలో ఎన్నికలు

  • ఓడిన చోట సమీక్షించుకుంటాం

  • రెబల్స్‌ను పార్టీలోకి తిరిగి చేర్చుకోం: సీఎం

మన పిల్లలకు పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూస్తాం. అదే విధంగా తాము ఎన్నుకోబోయే వ్యక్తి, పార్టీ గుణగణాలను విశ్లేషించుకుని ప్రజలు ఈ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించారు.పూర్తిగా దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి సూపర్‌ బ్రాండ్‌గా తీర్చిదిద్దాం. ఒకసారి రాష్ట్రానికి మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ వస్తే.. పెట్టుబడులు వాటంతట అవే వస్తాయి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అద్భుతంగా స్పందించారని, విజ్ఞతతో ఆలోచించి ఓటు వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమ కోసం కష్టపడుతున్న ప్రభుత్వాన్ని గుర్తించి అండగా నిలిచారని చెప్పారు. స్థానిక ఎన్నికల ఫలితాలపై సోమవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండున్నరేళ్ల సుపరిపాలన, అభివృద్ధికి ప్రజలు ఆమోదం తెలిపారని అన్నారు.

ఈ ఎన్నికల్లో కూటమికి వారు అందించిన ఘనవిజయం ప్రభుత్వ పనితీరుకు లభించిన గుర్తింపుగా పేర్కొన్నారు. సత్పరిపాలన, మంచి రాజకీయాలకు దారి తీస్తుందన్నది తన నమ్మకమని.. సుపరిపాలన అందిస్తే ప్రజలు రాజకీయంగానూ ఆదరిస్తారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. పట్టణ స్థానిక సంస్థలు, పరిషత్‌ ఎన్నికలు.. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలూ కూటమి వైపే మొగ్గు చూపారని చెప్పారు.


ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగినా.. వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేసిందన్నారు. కుప్పంలో తామూ ఓ ఎంపీటీసీ స్థానాన్ని కోల్పోయామని, ఆ స్థానాన్ని బలవంతంగా కైవసం చేసుకునేందుకు తప్పుడు విధానాలను అవలంబించలేదని.. ప్రజాతీర్పును గౌరవించాలనే తమ విధానానికి ఇదే తార్కాణమని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేస్తేనే ప్రజాభిప్రాయం తెలుసుకోవచ్చనేది తమ నమ్మకమని చెప్పారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారి ఆలోచన ఇదే విధంగా ఉంటుందని.. నమ్మకం లేని వారే కుట్రలకు పాల్పడతారని వ్యాఖ్యానించారు.

‘రౌడీయిజంతో రాజకీయాలు చేయడానికి ఇదేమీ రాతియుగం కాదు. రక్తతర్పణాలు, రప్పరప్పా రాజకీయాలను ప్రజలెప్పుడూ ఆమోదించరు. రౌడీయిజం, డ్రామాలతో ప్రజాతీర్పును మార్చలేరు’ అని తేల్చిచెప్పారు. ప్రజలు ఉంచిన విశ్వాసానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

కఠినంగా వ్యవహరిస్తాం..

రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఘన విజయం సాధించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎదురైన ఓటములపై సమగ్రంగా సమీక్షించుకుంటాం. ఒకట్రెండు స్థానాల్లో ఎందుకు ఓడిపోయామో లోతుగా విశ్లేషించుకుని, అవసరమైతే కఠినంగా వ్యవహరిస్తాం. ఎక్కడ పొరపాట్లు జరిగినా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తాం. మాకు భేషజాలేం లేవు. అనంతపురంలో ఓడిపోయే అవకాశమే లేదు.

అయినా ఓటమి ఎదురైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఆశించిన ఫలితాలు రాలేదు. అరకు కాఫీ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్థంగా పనిచేశాం. అక్కడ ఫలితాలు ఎందుకు అనుకూలంగా రాలేదో విశ్లేషిస్తాం. కూటమి నిర్ణయాలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదు. రెబల్స్‌ను తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు.


మావిగన్‌కూ సమాధానం!

‘మావిగన్‌’ ప్రకటనకు కూడా ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం ఇచ్చారు. అలాగే ఈ ఎన్నికల్లో ఎక్కడా డబ్బు ప్రభావం కనిపించలేదు. ఈ మంచి ట్రెండ్‌ కొనసాగాలి. డబ్బు ప్రభావాన్ని తగ్గించేందుకే ఎన్నికలను అతి తక్కువ సమయంలో నిర్వహించాం.

అన్ని కులాలకూ రాజ్యాధికారంలో భాగం..

స్థానిక ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం వివిధ సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాం. అన్ని కులాలనూ రాజ్యాధికారంలో భాగస్వాములను చేసేలా అభ్యర్థుల ఎంపిక జరిగింది. 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కోసం విస్తృత కసరత్తు చేసి, సమన్వయంతో ముందుకెళ్లాం. రాజకీయ నేపథ్యం లేని సామాన్యులు కూడా విజయం సాధించారు. ఇది రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది. సీట్లు దక్కకపోయినా కూటమి ధర్మానికి కట్టుబడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు. త్యాగాలు చేసిన క్యాడర్‌ను, నేతలను గుర్తించి గౌరవిస్తాం.


ప్రతి పౌరుడికీ భద్రత.. భరోసా..

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి పునర్నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. ప్రతి పౌరుడికీ భద్రత, భరోసా కల్పిస్తూ సుపరిపాలన అందిస్తున్నాం. ఇంటి పట్టాలు అందించాం. పేదలకు ఇళ్లు నిర్మించాం. సాగునీటి ప్రాజెక్టులతో సీమ కరువుకు చెక్‌ పెట్టాం. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు కల్పించాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశాం. వెలిగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశాను. ఇప్పుడు తొలిదశను ప్రారంభించి నీరందించి ప్రజల కష్టాలు తీర్చాం. పోలవరం ఎడమ కాలు వ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి వరకు తీసుకెళ్లాం.

ఇవ న్నీ ప్రజలు గుర్తించారు. ఓట్లతో ఆశీర్వదించారు. మార్కాపురంలో 21కి 21 జడ్పీటీసీ స్థానాలను, అనకాపల్లిలో 24కి 24 సీట్లను గెలిపించారు. విశాఖ మేయర్‌ స్థానాన్ని 2.50 లక్షల ఓట్ల మెజారిటీతో కట్టబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని వివరించేందుకు శ్వేతపత్రాలు విడుదల చేశాం. వ్యవస్థలను గాడిలో పెట్టి ఇప్పుడు ప్రగతి నివేదికలు సమర్పిస్తు న్నాం. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నాం. వారిచ్చిన తీర్పు మా బాధ్యతను మరింత పెంచింది.

గొడ్డలి పార్టీ కుట్రలకు చెక్‌..

కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేసింది. బీసీ రిజర్వేషన్లు, సర్‌ ప్రక్రియ, డీలిమిటేషన్‌ వంటి అంశాలపై పిటిషన్లు వేసి స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుట్రలకు సుప్రీంకోర్టు చెక్‌ పెట్టింది. ఎన్నికలు ఆపాలన్న వైసీపీ ట్రాప్‌లో పడబోమని వ్యాఖ్యానించింది. గొడ్డలి పార్టీ హింసాత్మక రాజకీయాలను నమ్ముకుంది. తీవ్రవాదుల తరహాలో హిట్‌ అండ్‌ రన్‌ రాజకీయాలు చేస్తోంది. హింసా రాజకీయాలు ప్రజలకు ఆమోదయోగ్యం కాదు. రెండు తుఫాన్లతో రాష్ట్రం ఇబ్బందులు పడుతుంటే.. వైసీపీ కనీసం రాజకీయ పార్టీగా కూడా స్పందించలేదు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 03:54 AM