Share News

అనంతపురంలో 'ఆపిల్' సిరి.. ఎడారి లాంటి నేలలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రైతు!

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:38 PM

వినూత్న పంటలను పండించడంలో తాము ఎవరికీ తీసిపోమని మరోసారి నిరూపించారు అనంతపురం జిల్లాకు చెందిన రైతు రమణారెడ్డి. మండుటెండలకు నిలయమైన అనంత నేలపై, చల్లని ప్రదేశాల్లో పెరిగే 'ఆపిల్' పంటను సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు.

అనంతపురంలో 'ఆపిల్' సిరి.. ఎడారి లాంటి నేలలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రైతు!
Anantapur Farmer Grows Apples

అనంతపురం, ఏప్రిల్ 10: ఉద్యాన పంటల సాగులో అనంతపురం జిల్లా రైతులది ప్రత్యేక శైలి. వినూత్న పంటలను పండించడంలో తాము ఎవరికీ తీసిపోమని మరోసారి నిరూపించారు జిల్లాలోని సిండికేట్‌నగర్‌కు చెందిన రైతు రమణారెడ్డి. మండుటెండలకు నిలయమైన అనంత నేలపై, చల్లని ప్రదేశాల్లో పెరిగే 'ఆపిల్' పంటను సాగు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మర్తాడు గ్రామంలోని తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో రమణారెడ్డి మూడేళ్ల కిందటే ఆపిల్ సాగుకు శ్రీకారం చుట్టారు. అయితే, మొదట్లో నాటిన మొక్కలు ఇక్కడి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక ఆశించిన దిగుబడిని ఇవ్వలేదు. చాలామంది రైతులు ఇక్కడితో ఆగిపోతారు, కానీ రమణారెడ్డి మాత్రం తన ప్రయత్నాన్ని ఆపలేదు.

ఇజ్రాయెల్‌లో ఉన్న తన స్నేహితుడి సలహా రమణారెడ్డి సాగు విధానాన్ని మార్చివేసింది. వేడి వాతావరణాన్ని తట్టుకునే కేఎల్‌డీ రకం ఆపిల్ మొక్కలను 2024 అక్టోబరులో తెప్పించారు. ఒక్కో మొక్కకు రూ. 650 చొప్పున ఖర్చు చేసి, మొత్తం 1,500 మొక్కలను నాటారు. అనంతపురంలో నమోదయ్యే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని ఈ మొక్కలు ఆరోగ్యంగా పెరగడం విశేషం.


రైతు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. పది రోజుల కిందట మొదటి విడతగా కోసిన టన్ను ఆపిల్ పండ్లను బెంగళూరులోని ఒక ప్రముఖ మార్ట్ రూ. 1.50 లక్షలకు కొనుగోలు చేసింది. సాధారణ పంటలతో పోలిస్తే ఇది అత్యంత లాభదాయకమైన దిగుబడి కావడంతో తోటి రైతులు రమణారెడ్డి కృషిని అభినందిస్తున్నారు.

అనంతపురం నేల ఆపిల్ సాగుకు పనికిరాదనే అపోహను రమణారెడ్డి పటాపంచలు చేశారు. సరైన రకాలను ఎంచుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తే కరువు నేలలోనూ సిరులు పండించవచ్చని ఆయన నిరూపించారు.


ఇవి కూడా చదవండి

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెతన్యాహుపై స్వదేశంలో విమర్శలు..

ఏబీఎన్‌ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు

Updated Date - Apr 10 , 2026 | 02:04 PM