Ananthapur News: ఆ ఊరు..కన్నీరు పెడుతోంది..
ABN , Publish Date - Jan 17 , 2026 | 01:31 PM
స్వాతంత్య్ర సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ పల్లెలు వెనుకబడే ఉన్నాయి. ప్రజల కనీస అవసరాలైన రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు వంటివి కూడా నోచుకోని గ్రామాలు ఉండటం దారుణమైన విషయంగానే చెప్పవచ్చు. అనంతపురం జిల్లాలో ఓ గ్రామాని నేటికీ కనీసం మట్టిరోడ్డు కూడా లేదు.
- నేటికీ దారిలేని కొత్తపల్లి
- గ్రామం వీడుతున్న జనం
- పండుగకు కూడా రాని దుస్థితి
- బీళ్లుగా భూములు
కొండలు, పచ్చని చెట్ల మధ్య అందమైన ఊరు.. ఒక్కొక్కరుగా ఖాళీ చేస్తున్నారు. ఒక్కో కుటుంబంగా పొలిమేర దాటుతున్నారు. ఇలా.. సగానికిపైగా వెళ్లిపోయారు. కూలిన ఇళ్లు, పాడుబడిన గుడిసెలే మిగిలాయి. పచ్చని పంటలు పండిన భూములన్నీ బీళ్లుగా మారాయి. వలసెళ్లిన ఊరిజనం పండుగకైనా రాకపోతారా.. అని ఆశగా చూసింది. ఏ ఒక్కరూ రాలేదు. ఇక రారని కన్నీరు పెట్టుకుంటోంది ఆ పల్లె. అదే తనకల్లు మండలం కొర్తికోట పంచాయతీలోని కొత్తపల్లి. ఊరికి రోడ్డు కూడా లేదు. కనీస సౌకర్యాల ఊసేలేదు. అందరి నిర్లక్ష్యం పుణ్యమా అని కొత్తపల్లి కనుమరుగవు తోంది. కాలగర్భంలో కలిసిపోతోంది.
తనకల్లు(అనంతపురం): మండలంలోని కోర్తికోట పంచాయతీలోని కొత్తపల్లిలో నేటికీ మట్టిరోడ్డు కూడా లేదు. కనీస సౌకర్యాలు అస్సలే లేవు. దీంతో జనం ఊరు వదిలి, వలసెళ్లి పోతున్నారు. అక్కడే ఉండిపోతున్నారు. కొత్తపల్లిలో 32 కుటుంబాలు ఉన్నాయి. 256 మంది జనాభాలో 122 మంది ఓటర్లు ఉన్నారు. ఏళ్లుగా గ్రామస్థులు వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోకి కొక్కంటి నుంచి వెళ్లాలన్నా, కొర్తికోట పంచాయతీలోని తుమ్మలవారిపల్లి నుంచి రావాలన్నా రోడ్డు సౌకర్యం లేదు. నేటికీ బండిబాటపైనే ఆధారపడ్డారు.
అవి కూడా తిమ్మనాయునిచెరువు నుంచి బండిబాట ఇరువైపులా పంటలు పెడితే నిత్యం బురదలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఈ గ్రామం నుంచి ముగ్గురు చిన్నారులు తుమ్మలవారిపల్లిలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు. మరో ఇద్దరు కొక్కంటిలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. మరో విద్యార్థి తనకల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. గ్రామానికి రోడ్డు కూడా లేకపోవడంతో ఇప్పటికే 18 కుటుంబాలు ఖాళీ చేశారు. కనీస సౌకర్యాలు కూడా లేని గ్రామంలో ఉండలేక మదనపల్లి, బెంగళూరు నగరాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం గ్రామంలో 14 కుటుంబాలు మాత్రమే మిగిలాయి.
ఎన్నికల సమయంలో ఓట్లు వేయడానికి మాత్రమే గ్రామానికి వస్తున్నారు. గతంలో ప్రతి పండుగకు గ్రామానికి వచ్చేవారు. మట్టిరోడ్డు కూడా లేకపోవడంతో వలస వెళ్లినవారు పండుగ సమయంలో కూడా రావడంలేదని గ్రామంలో నివాసాలున్నవారు ఆవేదన చెందుతున్నారు. గ్రామానికి ఒక్క పక్కాగృహం కూడా మంజూరుకాలేదు. కనీసం స్నానపు గదులు, మరుగుదొడ్లకు కూడా నోచుకోలేదని ఆవేదన చెందారు. గ్రామంలోని కొన్ని వీఽధులు బండల పరుపు, మరికొన్ని మట్టితోనే దర్శనమిస్తున్నాయి. రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కనీస సౌకర్యాలు లేకనే ఊరిని వీడుతున్నట్లు స్థానికంగా ఉంటున్నవారు ఆవేదన చెందుతున్నారు. ఉపాధి హామీ సిబ్బంది కూడా వచ్చిన పాపానపోలేదు. గ్రామంలో గర్భవతులకు, వృద్ధులు, చిన్నారులకు ఆరోగ్య సమస్యలు వస్తే ఆస్పత్రులకు తరలించేందుకు గ్రామస్థులు పడే బాధలు అన్నీఇన్నీకావు. 208 వాహనం కూడా గ్రామంలోకి వచ్చే అవకాశం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగిలిన కుటుంబాలు కూడా గ్రామాన్ని ఖాళీ చేయక తప్పదేమోన్న అనుమానం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కనీసం 108 వాహనం వెళ్లడానికైనా మట్టిరోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
రోడ్డు వేస్తేనే, ఊరు బతుకుతుంది
తరాలుగా తాము గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతున్నాం. వినతిపత్రాలు కూడా ఇస్తున్నాం. ఎవరూ పట్టించుకోవట్లేదు. రోడ్డు సౌకర్యం కల్పించకపోతే ఉన్న 14 కుటుంబాలు కూడా ఖాళీచేయక తప్పదు. కనీసం మట్టిరోడ్డైనా వేయాలి.
- వెంకటరమణ, కొత్తపల్లి
పక్కూరికి వెళ్లాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిందే
మా ఊరి నుంచి ఎక్కడికెళ్లాలన్నా బురదలో సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. పండించిన పంటలను మార్కెట్లకు తరలించాలంటే తొలుత మోసుకుంటూ రోడ్డులోకి చేర్చుకోవాల్సిందే. బండిబాటకు ఇరువైపులా వరి మడులు సాగు చేస్తుండడంతో అది కూడా బురదమయం అవుతోంది. దీంతో తాము పడే బాధలు అన్నీఇన్నీకావు. అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతుంటే, మా ఊరు మాత్రం ఖాళీ అవుతోంది.
- కుళ్లాయమ్మ, కొత్తపల్లి
ఈ వార్తలు కూడా చదవండి.
అవును.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది
Read Latest Telangana News and National News