దోస్త్ మేరా దోస్త్!
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:31 AM
మీ సతీమణి పోలీసు విచారణకు వస్తున్నారు కదా! మేం అడగబోయే ప్రశ్నలు ఇవే!.. ఒక గంటలో మిమ్మల్ని అరెస్టు చేసేందుకు మా టీమ్ వస్తోంది! జాగ్రత్త మరి!.. నిందితుడికి పోలీసులే ఇలా సమాచారం ఇచ్చేస్తున్నారు....
అనంతబాబు కేసులో పోలీసుల వింత వైఖరి
సన్నిహితుడికి సర్పవరం సీఐగా పోస్టింగ్
డ్రైవర్ హత్య కేసు నమోదైంది ఆ స్టేషన్‌లోనే
వైసీపీ హయాం నుంచే ఇద్దరి చెట్టపట్టాలు
వివాదాస్పదంగా పోలీసు అధికారుల తీరు
అనంతబాబు సతీమణిని అడిగే ప్రశ్నలు లీక్
అరెస్టు సమాచారం ఉప్పందించేలా చర్యలు
మొదలైన అనంతబాబు వేట
ఐదు పోలీసు బృందాల గాలింపు
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
మీ సతీమణి పోలీసు విచారణకు వస్తున్నారు కదా! మేం అడగబోయే ప్రశ్నలు ఇవే!.. ఒక గంటలో మిమ్మల్ని అరెస్టు చేసేందుకు మా టీమ్ వస్తోంది! జాగ్రత్త మరి!.. నిందితుడికి పోలీసులే ఇలా సమాచారం ఇచ్చేస్తున్నారు! అది కూడా... వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబుకు ఒకరిద్దరు పోలీసు అధికారులు సంపూర్ణంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ హత్యపై సర్పవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పుడు ఆ పోలీసు స్టేషన్ బాధ్యతలను అనంతబాబుకు బాగా సన్నిహితుడనే పేరున్న సీఐ రవికుమార్‌కు అప్పగించారు. నిజానికి... ఆయన కాకినాడ ‘దిశ’ మహిళా పోలీసుస్టేషన్ సీఐగా ఉన్నారు. ఇటీవల సర్పవరం స్టేషన్ సీఐ పెద్దిరాజును వీఆర్‌కు పంపి... సోమవారం ఆయన స్థానంలో రవికుమార్‌ను నియమించారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు దర్యాప్తు, విచారణ, కోర్టుకు సాక్ష్యాలు అందించడం... ఇవన్నీ సీఐ రవికుమార్ పర్యవేక్షణలోనే జరుగుతాయన్న మాట!
విచారణలో అడిగే ప్రశ్నలు ముందే లీక్
సాక్షులను బెదిరించి, ప్రలోభపెట్టిన కేసులో అనంతబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆయన నివాసానికి వెళ్లారు. అంతకు గంటముందే బైక్‌పై ఆయన జారుకున్నారు. ముందస్తు సమాచారం వల్లే అనంతబాబు తప్పించుకున్నట్లు అనుమానాలున్నాయి. రవికుమార్ మూడునెలల కిందట కాకినాడలో దిశ స్టేషన్ సీఐగా బదిలీపై వచ్చారు. ఈ సమయంలోనే డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు భార్యను పోలీసులు ఏ2గా చేర్చారు. దీనిపై ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయ గా, న్యాయస్థానం షరతులతో అనుమతించింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఆమె మార్చి 16న కాకినాడలో సిట్ విచారణ అధికారి ఎదుట హాజరయ్యారు. అప్పట్లో దిశలో ఉన్న రవికుమార్ నుంచి మొత్తం సమాచారం అనంతబాబుకు లీకయ్యేదని తెలుస్తోంది. విచారణలో అడగబోయే ప్రశ్నలన్నీ ఆమెకు లీకయ్యేవని చెబుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు అనంతబాబు భార్యను అరెస్ట్ చేయడానికి కొన్నినెలల కిందట ప్రయత్నించారు. అట్రాసిటీ కేసు కాబట్టి నిందితురాలి కుల ధృవీకరణ పత్రం న్యాయస్థానానికి అందించాల్సి ఉంది. ఇదంతా రహస్యంగా జరిగిపోవాలి. కానీ... సమాచారం లీకు చేసేందుకు ఆమె కులధ్రువీకరణ పత్రం కావాలంటూ అడ్డతీగల తహశీల్దార్ కార్యాలయానికి కొందరు పోలీసులు లేఖ రాశారని తెలిసింది. ఫలితంగా గంటల వ్యవధిలో తన భార్యకు ముందస్తు బెయిల్ కోసం అనంతబాబు ప్రయత్నించారు. ఈలోపు ఆమె అరెస్ట్ అవకుండా రహస్య ప్రాంతానికి తరలించేశారు.
వైసీపీ హయాంలో చెట్టాపట్టాల్..
సీఐ రవికుమార్ వైసీపీ ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయారు. వైసీపీ అధినేత జగన్ అంటే వల్లమాలిన అభిమానం చూపించే ఆయన, ఆ పార్టీకి సహకరించడమే ధ్యేయంగా పనిచేశారు. ఆయన తల్లి వైసీపీ తరపున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం. 2019లో వైసీపీ అధికారంలోకి రాకముందు రవికుమార్ ఎటపాకలో సీఐగా పనిచేశారు. అప్పట్లో అవినీతి ఆరోపణలు తీవ్రంగా రావడం, టీడీపీ నేతలతో దురుసుగా ప్రవర్తించడంతో వీఆర్‌లోకి పంపారు. వైసీపీ అధికారంలోకి రాగానే అనంతబాబు సాయంతో రవికుమార్ అడ్డతీగల సీఐగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. టీడీపీ నేతలపై అనేక అక్రమ కేసులు పెట్టించారు. ఆ తర్వాత రంపచోడవరం సీఐగా వెళ్లారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య అనుంబంధం మరింత బల పడింది. ఇద్దరూ రాత్రయ్యేసరికి చెట్టాపట్టా లేసుకు తిరిగేవారు. వైసీపీ హయాంలో మచిలీపట్నంలో పనిచేసేటప్పుడు అప్పటి మంత్రి పేర్ని నాని చెప్పినట్టల్లా రవికుమార్ నడుచుకున్నారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్రను ఇబ్బందులు పెట్టారు. సీఐ రవి కుమార్‌కు వైసీపీ నేతలతో అనుబంధం, అనంతబాబుతో ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసీ... ఆయనను సర్పవరం స్టేషన్ బాధ్యతలు అప్పగించిన ఎస్పీ బిందుమాధవ్‌పైనా విమర్శలు వస్తున్నాయి.