Share News

మద్యం అమ్మకాలపై ‘ఏఐ’ నిఘా!

ABN , Publish Date - Sep 09 , 2026 | 05:34 AM

మద్యం అమ్మకాల విషయంలో కృత్రిమ మేధ (ఏఐ)ను విస్తృతంగా వినియోగించే దిశగా ఎక్సైజ్‌ శాఖ చర్యలు చేపడుతోంది. మద్యం దుకాణాల్లోని సీసీ కెమెరాలకు ఏఐతో అనుసంధానం చేయనుంది. షాపుల పనివేళలు, అమ్మకాలపై నిఘా పెట్టనుంది.

 మద్యం అమ్మకాలపై ‘ఏఐ’ నిఘా!

  • షాపుల్లోని సీసీ కెమెరాలతో అనుసంధానం

  • పనివేళలు, సీసాల స్కానింగ్‌పై పరిశీలన

  • ఉల్లంఘనలపై అధికారులకు సమాచారం

  • వచ్చే నెల నుంచి కొత్త పాలసీ అమలు

అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): మద్యం అమ్మకాల విషయంలో కృత్రిమ మేధ (ఏఐ)ను విస్తృతంగా వినియోగించే దిశగా ఎక్సైజ్‌ శాఖ చర్యలు చేపడుతోంది. మద్యం దుకాణాల్లోని సీసీ కెమెరాలకు ఏఐతో అనుసంధానం చేయనుంది. షాపుల పనివేళలు, అమ్మకాలపై నిఘా పెట్టనుంది. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త మద్యం పాలసీలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రతి మద్యం షాపులోనూ సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిని ఎక్సైజ్‌ కార్యాలయంలో ర్యాండమ్‌గా పరిశీలిస్తుంటారు. ఒకేసారి అన్ని కెమెరాలను పరిశీలించడం సాధ్యం కానందున, కొన్నిసార్లు షాపుల్లో తప్పులు జరిగినా అవి అధికారులకు తెలియట్లేదు. కొత్తగా సీసీ కెమెరాలకు ఏఐని అనుసంధానం చేయడం వల్ల ఎక్కడైనా తప్పులు చేస్తే.. ఏఐ వాటిని వెంటనే గుర్తించి, ఆ సమాచారాన్ని అధికారులకు పంపుతుంది. ఉదాహరణకు నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా షాపులు మూయకపోయినా, ముందే తెరిచినా ఏఐ అధికారులకు తెలుపుతుంది. అలాగే మద్యం సీసాలను స్కాన్‌ చేయడాన్ని వచ్చే పాలసీ నుంచి తప్పనిసరి చేస్తున్నారు. కొత్త పాలసీ ప్రకారం.. సీసాలను స్కాన్‌ చేస్తున్నారా? లేదా? అనేది కూడా ఏఐ గుర్తిస్తుంది. ఎక్కడైనా షాపులో ఉల్లంఘన జరిగితే అధికారులకు సమాచారం పంపుతుంది. మద్యం షాపుల్లో జరిగే అన్ని రకాల ఉల్లంఘనలనూ ఏఐ ద్వారా గుర్తించేలా టెక్నాలజీ రూపొందిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి...

బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..

‘అభివృద్ధికి అక్షరాస్యత దోహదం’

Updated Date - Sep 09 , 2026 | 05:57 AM