Share News

కొత్తవలసలో భారీ అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:55 PM

కొత్తవలస పంచాయతీ అడ్డూరువానిపాలెం సమీపంలో ఉన్న ఎస్‌ఎల్‌జీ కార్‌ కేర్‌( ఏ టూ జెడ్‌ వర్కుషాపు)లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

కొత్తవలసలో భారీ అగ్ని ప్రమాదం

  • వర్కుషాపులో మూడు కార్లు దగ్ధం

  • సుమారు రూ.10లక్షల ఆస్తి నష్టం

కొత్తవలస, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): కొత్తవలస పంచాయతీ అడ్డూరువానిపాలెం సమీపంలో ఉన్న ఎస్‌ఎల్‌జీ కార్‌ కేర్‌( ఏ టూ జెడ్‌ వర్కుషాపు)లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దగ్ధం కాగా, వర్కుషాపులోని సామగ్రి కాలిపోయింది. ఇందుకు సంబంధించి అగ్నిమాపక అధికారి వై.అశోక్‌కుమార్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస-ఎస్‌.కోట రోడ్డులోని అడ్డూరువానిపాలెం గ్రామ సమీపంలో రోడ్డు పక్కనే కె.గౌరీపతి అనేవ్యక్తికి కార్‌ రిపేర్లు, పెయింటింగ్‌లకు సంబంధించిన వర్కుషాపు ఉంది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ వర్కుషాపులో నుంచి మంటలు వచ్చాయి. అందిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఈ వర్కుషాపునకు మరమ్మతుల కోసం వచ్చిన రెండు కార్లతోపాటు స్ర్కాప్‌ కోసం వచ్చిన మరో కారు పూర్తిగా తగలబడిపోయాయి. వర్కుషాపులో ఉన్న వివిధ సామాన్లు కూడా మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.5లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే సుమారు రూ.10లక్షల నష్టం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వర్కుషాపు పక్కనే మరో 16 కార్లు ఉన్నాయి. వీటికి మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు. వర్కుషాపులో ఉన్న ఆయిల్‌ గుడ్డలకు నిప్పంటుకోవడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని సిబ్బంది భావిస్తున్నారు.

Updated Date - Sep 08 , 2026 | 11:55 PM