Share News

సచివాలయం తొలి అంకం పూర్తి!

ABN , Publish Date - Aug 29 , 2026 | 06:03 AM

రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐకానిక్‌(శాశ్వత) సచివాలయ నిర్మాణంలో తొలి అంకం పూర్తయింది.

సచివాలయం తొలి అంకం పూర్తి!

  • పూర్తి కావస్తున్న తొలి దశ డయాగ్రిడ్‌

  • కోర్‌వాల్‌-డయాగ్రిడ్‌ కలుపుతూ బీములు

  • స్లాబులు వేసే పనులు కూడా ప్రారంభం

  • నిర్మాణాల చుట్టూ రిటైనింగ్‌ వాల్‌ పూర్తి

  • ఐదు భవనాలతోపాటు 9 ఎమినిటీ బ్లాకులు

  • 2028 దసరా నాటికి పూర్తిచేయాలి: సీఎం

గుంటూరు(రాజధాని), ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐకానిక్‌(శాశ్వత) సచివాలయ నిర్మాణంలో తొలి అంకం పూర్తయింది. అనుకున్న సమయానికి.. అనుకున్నట్లుగా ఈ భవనాల నిర్మాణం జరుగుతోంది. ముందుగా నిర్ణయించినట్టు ఈ ఆగస్టు నాటికి ఐకానిక్‌ సచివాలయ సముదాయంలో ఐదు భవనాల్లో 6 అంతస్తుల వరకు నిర్మాణం పూర్తయింది. ఈ నిర్మాణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా దృష్టి సారించడంతో పనుల్లో వేగం పెరిగింది. 2028 దసరా నాటికి శాశ్వత సచివాలయ భవనాల నిర్మాణాలు పూర్తిచేయాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలో పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది. ప్రస్తుతం ఐకానిక్‌ సెక్రటేరియట్‌ సముదాయంలో మెజారిటీ భవనాల్లో ఈ తొలి డైమండ్‌ పనులు చివరి దశకు వచ్చాయి. దీంతో రెండు, మూడు దశల్లో డయాగ్రిడ్‌ కాలమ్స్‌కు నోడ్‌లు బిగించే పనులు ప్రారంభమయ్యాయి.


46 అంతస్తుల ప్రధాన నిర్మాణం

ఐకానిక్‌ సెక్రటేరియట్‌ టవర్ల నిర్మాణంలో కీలకమైన కోర్‌వాల్‌ నిర్మాణం ఆరు అంతస్తుల వరకు పూర్తయింది. హెచ్‌ఓడీ టవర్లను 39 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఎస్‌ ప్లస్‌, జీ ప్లస్‌, ఎం ప్లస్‌ 36 అంతస్తులతో నిర్మించే ఈ భవనంలో ఆరున్నర డైమండ్లు వస్తాయి. సిల్ట్‌ ఫ్లోర్‌(పార్కింగ్‌), గ్రౌండ్‌ ఫ్లోర్‌, మజ్జినైన్‌(మచ్చు బల్ల) ఫ్లోర్‌లకు కలిపి సగం డైమండ్‌ వస్తే అక్కడి నుంచి 36 అంతస్తులకు 6 డైమండ్స్‌ వస్తాయి. ప్రస్తుతం సిల్ట్‌, గ్రౌండ్‌, మజ్జినైన్‌ ఫ్లోర్లు పూర్తయి.. ప్రధాన నిర్మాణంలో 7 అంతస్తుల వరకు కోర్‌వాల్‌ నిర్మాణం జరిగింది. కాగా, 49 అంతస్తులతో నిర్మిస్తున్న జీఏడీ టవర్‌లో కూడా సిల్ట్‌, గ్రౌండ్‌, మజ్జినైన్‌ ఫ్లోర్ల పనులు పూర్తయి 46 అంతస్తుల ప్రధాన నిర్మాణంలో కూడా 6 అంతస్తుల వరకు పూర్తయింది.

భవనాల వారీగా పురోగతి!

  • అన్నింటికంటే ముందు వరసలో హెచ్‌ఓడీ టవర్లలోని టవర్‌-2 నిలుస్తోంది. ఈ భవనానికి సంబంధించి డయాగ్రిడ్‌ డైమండ్స్‌ దాదాపు పూర్తయ్యాయి. నిర్మాణం చుట్టూ 8 డైమండ్స్‌ పూర్తయ్యాయి. అంటే జీ ప్లస్‌, ఎస్‌ ప్లస్‌; ఎమ్‌ ప్లస్‌ 6 అంతస్తులు వరకు డయాగ్రిడ్‌ డైమండ్స్‌ పూర్తయాయి. దీంతో మూడో దశలో డయాగ్రిడ్‌ బీములు బిగించే పనులు మొదలయ్యాయి.

  • కోర్‌వాల్‌ నిర్మాణంలో హెచ్‌ఓడీ టవర్‌-3 అన్నింటికంటే ముందు వరుసలో ఉంది. ఈ భవనం చుట్టూ డైమండ్ల నిర్మాణం రెండో దశలోనే ఉన్నప్పటికీ కోర్‌ వాల్‌ నిర్మాణం మాత్రం అన్నింటికంటే ఎత్తుగా నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనంలో 3 డయాగ్రిడ్‌ డైమండ్స్‌ పూర్తయ్యాయి. జంపింగ్‌ టెక్నాలజీ, ప్లైఉడ్‌ షట్టరింగ్‌ విధానం కావడంతో కోర్‌వాల్‌ నిర్మాణం వేగంగా జరుగుతోంది.


  • హెచ్‌వోడీ టవర్లలో టవర్‌-4 వద్ద డయాగ్రిడ్‌ బీములను ఏర్పాటు చేసే పనులు రెండో దశకు చేరాయి. డయాగ్రిడ్‌ కాలమ్స్‌ను కోర్‌వాల్‌తో కలుపుతూ బీములను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బీములపై స్లాబ్‌ వేసి రెండింటినీ కలుపుతారు. ఈ స్లాబ్‌ నిర్మాణం పూర్తికావాల్సి ఉంది.

  • జీఏడీ టవర్‌ వద్ద డయాగ్రిడ్‌ డైమండ్స్‌ పనులు మూడో దశకు చేరాయి. ఇప్పటి వరకు 4 డైమండ్స్‌ పనులు పూర్తయ్యాయి. మరో 4 డైమండ్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక, ఈ డయాగ్రిడ్‌ డైమండ్స్‌ను కోర్‌వాల్‌కు కలుపుతూ నిర్మించే తొలి అంతస్తు స్లాబ్‌ నిర్మాణం పూర్తయింది.

  • హెచ్‌ఓడీ టవర్‌-1 నిర్మాణంలో కోర్‌ వాల్‌ 6 అంతస్తుల వరకు పూర్తయింది. ఇక్కడ డయాగ్రిడ్‌ డైమండ్స్‌ 4 పూర్తయ్యాయి. డయాగ్రిడ్‌-కోర్‌వాల్‌ను కలుపుతూ తొలి అంతస్తు స్లాబు కూడా నిర్మించారు. ఇక్కడ డయాగ్రిడ్‌ డైమండ్ల నిర్మాణ పనులు రెండు, మూడు దశల్లో ఉన్నాయి.

9 ఎమినిటీ బ్లాకులు

ఐకానిక్‌ సెక్రటేరియట్‌ నిర్మాణంతోపాటు 9 ఎమినిటీ బ్లాకులను నిర్మిస్తున్నారు. వీటిని జీ ప్లస్‌ 3 అంతస్తులు ఉండేలా నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి సంబంధించి పునాదుల పనులు పూర్తవడంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు భవనాల చుట్టూ ప్రహరీ నిర్మాణం కూడా పూర్తయింది. తొలి దశ పనులు పూర్తి కావడంతో గుంతలను పూడ్చి చదును చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే వర్షాలు, వరదలు వచ్చినా పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణపై వివాదం..

ఢిల్లీ-బిలాస్‌పూర్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

Updated Date - Aug 29 , 2026 | 06:25 AM