అమరావతిలో విద్యా విప్లవానికి శ్రీకారం.. రూ.25 కోట్లతో ఆధునిక పాఠశాల నిర్మాణం
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:18 PM
అమరావతి రాజధాని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. అబ్బురాజుపాలెంలోని E3–N14 జంక్షన్ వద్ద మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న అమరావతి ఎడ్యుకేషనల్ & కల్చరల్ అకాడమీకి శంకుస్థాపన జరిగింది..
అమరావతి, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని అబ్బురాజుపాలెంలో అమరావతి ఎడ్యుకేషనల్ & కల్చరల్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. E3–N14 జంక్షన్ వద్ద మూడు ఎకరాల విస్తీర్ణంలో డి.ఏ.వి. అమరావతి రైతు విద్యాలయ వేదాంతం గ్రూప్ ఆధ్వర్యంలో ఈ విద్యాసంస్థను నిర్మించనున్నారు. ప్రస్తుతం నర్సరీ నుంచి 5వ తరగతి వరకు తరగతులు కొనసాగుతుండగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు సెక్షన్లతో విద్యార్థుల సంఖ్యను పెంచే ప్రణాళిక ఉంది. భవిష్యత్‌లో 12వ తరగతి వరకు విద్యాబోధన అందించేలా అకాడమీని అభివృద్ధి చేయనున్నారు.
పూర్తిస్థాయిలో 2,500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా.. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో పాఠశాల భవనాన్ని నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి సుమారు రూ.25 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. రైతులు, దాతల విరాళాలతో నిర్మాణ ఖర్చులను సమీకరించనున్నారు. ప్రతి రూపాయి ఖర్చుకూ పూర్తి లెక్కలు నిర్వహిస్తామని స్కూల్ సెక్రెటరీ అనుముల బాల మురళీకృష్ణ తెలిపారు. తక్కువ ఫీజులతో నాణ్యమైన, ఉన్నత విద్య అందించడం ప్రధాన లక్ష్యమని.. రెండేళ్లలో రాష్ట్రంలోని టాప్-10 విద్యాసంస్థల్లో అకాడమీని నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఏపీ సీఆర్డీఏ, ముఖ్యమంత్రి సహాయ సహకారాలు అందిస్తున్నారని, వేదాంతం గ్రూప్‌తో చెన్నై ద్వారా ఒప్పందం కుదుర్చుకుని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
నేల తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్
ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..