Share News

అమరావతికి జై

ABN , Publish Date - Apr 02 , 2026 | 05:20 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్‌ ఇక దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు .....

అమరావతికి జై

  • రాజధాని బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  • మూడు ముక్కలాటకు తెరదించేలా... అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించేలా కేంద్రం స్థాయిలో తొలి అడుగు పడింది. ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026కు బుధవారం లోక్‌సభలో ఆమోద ముద్ర పడింది. అధికార పక్షంతోపాటు ప్రతిపక్ష సభ్యులూ దీనిని స్వాగతించడం విశేషం. ఒక్క వైసీపీ మాత్రమే బిల్లును వ్యతిరేకించి.. వాకౌట్‌ చేసింది. ఇదే బిల్లును గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో తుది నోటిఫికేషన్‌ జారీ అవుతుంది.

  • లోక్‌సభలో దాదాపు 2 గంటలు చర్చ

  • 18 మంది ఎంపీల ప్రసంగం

  • జగన్‌ తీరును ఎండగట్టిన సభ్యులు

  • మూజువాణి ఓటుతో సభ ఆమోదం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ఐదేళ్ల పాలనలో అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్‌ ఇక దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 2024 జూన్‌ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టం ద్వారా గుర్తిస్తున్నట్లుగా ఈ బిల్లులో పేర్కొన్నారు. దానితోపాటు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) రాజధానిగా నోటిపై చేసిన ప్రాంతమంతా అమరావతి పరిధిలోకి వస్తుందని తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ బుధవారం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై దాదాపు రెండు గంటలపాటు చర్చ జరిగింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సహా 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు ఇందులో పాలుపంచుకున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఆ తర్వాత బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. గురువారం రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రానుంది. అక్కడ ఆమోదం పొందడం కూడా లాంఛనమే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించగానే చట్టరూపం దాలుస్తుంది. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తీవ్ర గందరగోళం, వాగ్యుద్ధాలు, ఎంపీల పరస్పర దాడులు, తోపులాటలు, పెప్పర్‌ స్ర్పే ప్రయోగాల మధ్య రాష్ట్ర పునర్విభజన బిల్లు-2014ను ఆమోదించిన నాటి దృశ్యాలకు భిన్నంగా.. సదరు చట్ట సవరణ బిల్లుపై బుధవారం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చ జరిగింది. ఆమోదమూ లభించింది. వైసీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి వ్యాఖ్యలను టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు.. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ను మిథున్‌రెడ్డి అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు తప్ప.. బిల్లుపై చర్చ, ఆమోదానికి ఎటువంటి అంతరాయం కలుగలేదు. కాంగ్రెస్‌, ఇతర ఇండీ కూటమి పార్టీలు, ఎన్‌డీఏ పార్టీలన్నీ ముక్తకంఠంతో అమరావతి రాజధానికి చట్టబద్ధతను స్వాగతించాయి. వైసీపీ ఒక్కటే వ్యతిరేకించింది. రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలకు బిల్లులో ప్రాధాన్యం లేదని మిథున్‌రెడ్డి అన్నారు. దానిని ఓటింగ్‌కు పెట్టినప్పుడు ఆయనతోపాటు మిగతా ముగ్గురు వైసీపీ ఎంపీలు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, తనూజారాణి, ఎం.గురుమూర్తి వాకౌట్‌ చేశారు.

1.jpg


జగన్‌ను ఎండగట్టిన కూటమి ఎంపీలు

చట్టబద్ధత చట్టసవరణ బిల్లును ఆమోదించే క్రమంలో జగన్‌ను తీవ్రంగా ఎండగట్టేందుకు వచ్చిన అవకాశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు పూర్తిగా వినియోగించుకున్నారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌.. తాను అమరావతి భూమిపుత్రుడిగా మాట్లాడుతున్నానన్నారు. మూడు రాజధానుల పేరుతో జగన్‌ వికృత క్రీడను తీవ్రంగా విమర్శించారు. అమరావతి రైతులపై ఆయన చేసిన దాడులు, ముఖ్యంగా మహిళా రైతులకు జరిగిన అవమానాలను కళ్లకు గట్టినట్లు వివరించారు. ఆడబిడ్డల కన్నీటి చుక్కలే జగన్‌ పతనానికి కారణమని టీడీపీ సభ్యుడు క లిశెట్టి అప్పలనాయుడు అన్నారు. చంద్రబాబు ప్రారంభించిన రాజధానిని.. జగన్‌ ప్రభుత్వం రహదారులు సహా విధ్వంసం చేసిన తీరును బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ వివరించారు. ఐదేళ్లపాటు జరిగిన దోపిడీ, దౌర్జన్యాలు, విధ్వంస కాండ, లిక్కర్‌ మాఫియా అకృత్యాలను సభ దృష్టికి తెచ్చారు. అమరావతిని ధ్వంసం చేసినందుకే ప్రజలు జగన్‌కు కేవలం 11 సీట్లు ఇచ్చి పక్కనపెట్టారని.. కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించారని జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఏపీకి ఎట్టకేలకు మంచి రాజధాని నిర్మించుకునే అవకాశ ం లభించిందని బీజేపీ ఎంపీ పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

సమాజ్‌వాదీ సంపూర్ణ సమర్థన

రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లును ఆకస్మికంగా ప్రవేశపెట్టడంపై సమాజ్‌వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే బిల్లును సమర్థిస్తున్నానని, ఆలస్యంగానైనా ఒక రాష్ట్రానికి స్థిరమైన రాజధాని అవసరమని చెప్పారు. అన్ని సౌకర్యాలూ ఉన్న విశాఖను కాకుండా రైతుల నుంచి పెద్దఎత్తున భూములను తీసుకుని అమరావతిని రాజధానిగా చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు భూసేకరణ చట్టం కింద తగిన నష్టపరిహారం ఇస్తున్నారా అని అడుగగా.. అంతకంటే ఎక్కువే చెల్లిస్తున్నామని శ్రీకృష్ణదేవరాయలు జవాబిచ్చారు. అలాగైతే బిల్లును ఆహ్వానిస్తానని ధర్మేంద్రయాదవ్‌ చెప్పారు. బజరంగ్‌ సోన్వానే (ఎన్‌సీపీ-శరద్‌ పవార్‌), హర్‌సిమ్రత్‌ కౌర్‌(అకాలీదళ్‌), శ్రీకాంత్‌ షిండే (శివసేన), అరవింద్‌ సావంత్‌ (ఉద్ధవ్‌ శివసేన), పప్పూయాదవ్‌ (బిహార్‌ స్వతంత్ర ఎంపీ) కూడా బిల్లుకు మద్దతిస్తూ ప్రసంగించారు.


రేవంత్‌ ఆర్‌ఆర్‌ టాక్స్‌: కిషన్‌రెడ్డి

అమరావతిని ఏపీ రాజధానిగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయితే తెలంగాణలో ఆర్‌ ఆర్‌ టాక్స్‌ పేరిట సీఎం రేవంత్‌ రెడ్డి పన్నులు వసూలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, రఘురామరెడ్డి విమర్శించారు.

బిల్లుకు వైసీపీ వ్యతిరేకం: మిథున్‌రెడ్డి

తాము అమరావతికి వ్యతిరేకం కాదని.. కానీ స్పష్టత లేని అమరావతి రాజధాని బిల్లుకు వ్యతిరేకమని మిథున్‌ రెడ్డి అన్నారు.అమరావతి రాష్ట్ర ప్రజల కోసం నిర్మిస్తున్న రాజధాని కాదని.. అది చంద్రబాబు, ఆయన బినామీలు కలిసి సాగిస్తున్న అడ్డగోలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమని ఆరోపించారు. ‘దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ దేశాల్లో 3రాజధా నులు, బహుళ రాజధానుల విధానం విజయ వంతంగా కొన సాగుతోంది. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేస్తూ, భూము లిచ్చిన రైతుల పొట్టగొడుతూ, బినామీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చే విధానాన్ని వ్యతిరేకిస్తు న్నాం. అందుకే బిల్లును ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం’ అంటూ సహచరు లతో కలిసి వాకౌట్‌ చేశారు.

Updated Date - Apr 02 , 2026 | 05:20 AM