తాడిపత్రి రణరంగం
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:43 AM
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ కేంద్రం రణరంగంగా మారింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లుగా జరుగుతున్న ఇరువర్గాల ఘర్షణలు గురువారం రాత్రి నుంచి ...
జేసీ, పెద్దారెడ్డి వర్గీయుల ఘర్షణ
గురువారం రాత్రి వైసీపీ నేత కార్లకు నిప్పుపెట్టిన దుండగులు
ఈ ఘటనపై పెద్దారెడ్డి నిరసన
టీడీపీ వర్గీయుల ఆగ్రహం
పరస్పరం పెట్రోల్ బాంబులతో దాడులు
పదుల సంఖ్యలో వాహనాలకు నిప్పు
టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు
తాడిపత్రి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ కేంద్రం రణరంగంగా మారింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లుగా జరుగుతున్న ఇరువర్గాల ఘర్షణలు గురువారం రాత్రి నుంచి తీవ్రమయ్యాయి. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలపై రాళ్లదాడి జరిగింది. దీంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో వైసీపీ నేత రాజు ఇంటి వద్ద ఒక కారుకు, ఇగుడూరులో మరో నేత రంగారెడ్డి ఇంటివద్ద ఒక కారుకు గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
దీంతో శుక్రవారం ఉదయం రెండు గ్రామాలకు వెళ్లి పెద్దారెడ్డి పరామర్శించారు. అక్కడి నుంచి తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐ నారాయణరెడ్డితో మాట్లాడారు. వాహనాలను తగులబెట్టింది టీడీపీ వర్గీయులేనని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు నిరసనగా పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమై.. పెద్దారెడ్డిని, ఆయన అనుచరులను పంపేశారు. కాసేపటికి పోలీస్ స్టేషన్కు బయలుదేరిన టీడీపీ వర్గీయులు, పెద్దారెడ్డి అక్కడ లేడని తెలుసుకుని, ఆ మార్గంలో ఉన్న ఇద్దరు వైసీపీ నాయకుల ఇళ్లపై రాళ్లదాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లారు.
పెద్దారెడ్డి ఇంటివద్ద ఘర్షణ
తాడిపత్రిలో ప్రశాంత వాతావరణాన్ని పెద్దారెడ్డి చెడగొడుతున్నారని టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జేసీ ఇంటి నుంచి పెద్దారెడ్డి ఇంటి సమీపంలోని మైదానానికి చేరుకున్నారు. అప్పటికే పెద్దారెడ్డి ఇంటిపై సిద్ధంగా ఉన్న వైసీపీ వర్గీయులు రాళ్లదాడికి దిగారు. దీంతో పెద్దారెడ్డి ఇంటి సమీపంలోని వాహనాలకు కొందరు నిప్పు పెట్టారు. పరస్పరం రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడిచేసుకోవడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పెద్దారెడ్డి ఇంటి సమీపంలోని 4 స్కార్పియో వాహనాలు, 15కు పైగా దిచక్ర వాహనాలు కాలిపోయాయి. ఇరువర్గాల దాడుల్లో టీడీపీ వర్గీయులు కొంతమంది గాయాలపాలయ్యారు. వెంటనే వారిని చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. జిల్లా ఎస్పీ జగదీశ్ విషయం తెలుసుకొని తాడిపత్రికి చేరుకున్నారు. పెద్దఎత్తున పోలీసు బలగాలను వెంట తీసుకురావడంతో ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఘర్షణలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశామని తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు ఎస్పీ జగదీశ్.. డీఎస్పీ కార్యాలయంలోనే ఈ ఘర్షణలపై సమాచారం సేకరించారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. దాడుల్లో పాల్గొన్నవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి