Share News

తండ్రి శవం పక్కన ఉండగానే రాజకీయాలు.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం

ABN , Publish Date - May 22 , 2026 | 01:07 PM

వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. తనదైన శైలిలో జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

తండ్రి శవం పక్కన ఉండగానే రాజకీయాలు.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం
YS Jagan Mohan Reddy

అమరావతి, మే 22: వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆయన కామెంట్స్‌కు అచ్చెన్న తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తమ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ టీడీపీ, చంద్రబాబు నాయుడి హయాంలోనే జరిగాయంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే ‘అపరిచితుడు’ సినిమా పాత్ర గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు.


వైఎస్ జగన్ తాత వైఎస్ రాజారెడ్డిని ఎందుకు హత్య చేశారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైఎస్ కుటుంబం నడిపిన దమనకాండను, అరాచకాలను ఆనాటి బాధితుడు పార్థసారథిరెడ్డి స్వయంగా వివరించారని గుర్తుచేశారు. రాజారెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ కాలక్రమేణా తుదముట్టించారు. అయితే, రాజారెడ్డి హత్యకేసులో ఉన్న వ్యక్తి ఇవాళ వైసీపీలోనే కొనసాగుతుండటం.. జగన్ ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్ కుటుంబానికి ఉన్న క్రూరత్వం, అరాచకాల చరిత్ర ప్రస్తుత తరానికి పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన రెండు రోజులకే వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారంటూ జగన్ చేస్తున్న ప్రచారం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన మాటల అసలు సందర్భాన్ని వివరిస్తూ.. తిరుమల వేంకటేశ్వర స్వామికి ఎవరైనా కీడు తలపెడితే వారికి ఎప్పటికీ మంచి జరగదు అని మాత్రమే చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఆ మాటలను జగన్ ఇవాళ తన స్వార్థం కోసం వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.


గతంలో వైఎస్సార్ మరణం వెనుక 'రిలయన్స్' సంస్థ పాత్ర ఉందంటూ నానా హంగామా చేసి.. ఇప్పుడు చంద్రబాబును లాగడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికైనా జగన్ ఇలాంటి వక్రీకరణలు మానుకోవాలని హితవు పలికారు. జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఎలా చనిపోయారో, ఆ హత్య వెనుక ఎవరున్నారో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని అచ్చెన్నాయుడు అన్నారు. మొదట గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేసి, ఆపై గొడ్డలితో నరికి చంపిన చరిత్ర వారిదేనని, అందుకే వైసీపీని తాము ‘గొడ్డలి పార్టీ’ అని పిలుస్తున్నామని స్పష్టం చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా వివేకా హంతకులను ఎందుకు పట్టుకోలేకపోయారో జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు.


ఇవి కూడా చదవండి...

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు: కేటీఆర్

ట్రైన్‌లో ప్రయాణించి.. ఆపై సైకిల్ తొక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 22 , 2026 | 02:58 PM