Share News

ఆ మేడం నోరు తెరిస్తే బూతులే!

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:46 AM

‘ప్రజలతో జాగ్రత్తగా మెలగాలి. తోటి అధికారులను గౌరవించాలి. అధికారులను దూషించి అవమానించొద్దు. అవసరం ఉంటే చాంబర్‌కు పిలిచి మాట్లాడాలి.

ఆ మేడం నోరు తెరిస్తే బూతులే!

  • ఓ జిల్లా కలెక్టర్‌ నోటి దురుసుతనం

  • పని తక్కువ, తిట్లదండకం ఎక్కువ

  • భరించలేక సెలవుపై డీఆర్‌ఓ

  • గతంలో మరో డీఆర్‌ఓ, జేసీ కూడా

  • పోస్టింగ్‌ ఇచ్చినా ఆమె తీరుతో జాయిన్‌ కాని మరో అధికారి

  • జేసీ నుంచి ఉద్యోగుల దాకా బాధితులే

  • మహిళా అధికారులకూ వేధింపులు

  • వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగి ఆత్మహత్య

  • తన చావుకు కలెక్టరే కారణమని లేఖ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘ప్రజలతో జాగ్రత్తగా మెలగాలి. తోటి అధికారులను గౌరవించాలి. అధికారులను దూషించి అవమానించొద్దు. అవసరం ఉంటే చాంబర్‌కు పిలిచి మాట్లాడాలి. తమను కలెక్టర్‌ అవమానిస్తున్నారనే భావనకు అధికారులు, ఉద్యోగులు వచ్చారంటే కలెక్టర్‌ తీరును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది’.. గత మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ హెచ్చరికతో చేసిన సూచనలివి. ఏ కలెక్టర్‌ను ఉద్దేశించి సీఎస్‌ అన్నారో అందరికీ తెలుసు. సీన్‌ కట్‌ చేస్తే.. మూడు రోజుల్లోనే ఆ కలెక్టర్‌ నోటికి పనిచెప్పారు. ఇటు ఎన్నికల కమిషన్‌ పని, అటు ప్రభుత్వ పనిని ఒంటి చేత్తో చేస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ)ని అందరిముందు 30 నిమిషాలు ఏకధాటిగా దుర్భాషలాడారు. మనస్తాపానికి గురైన డీఆర్‌ఓ అదే రోజు రాత్రి సెలవుపై వెళ్లిపోయారు. ఆ మహిళా అధికారిణి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుంచి గ్రామస్థాయి ఉద్యోగి వరకు కలెక్టర్‌ తిట్ల దండకానికి బాధపడ్డవారే. గతంలో ఆమె తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చినా ఓ మంత్రి అండతో విషయం బయటకురాకుండా చేసుకున్నారు.


దినచర్యగా దుర్భాషలు: ఆ అధికారిణి పలు శాఖల్లో పని చేసినపుడు ఉద్యోగులతో గొడవలు, తిట్లదండకం గురించి బహిరంగంగా తెలిసినా ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. అద్భుతంగా పనిచేస్తారని భావించి ఓ జిల్లాకు కలెక్టర్‌గా పంపింది. పనిలో ప్రతిభ చూపాల్సిన చోట తీవ్రమైన అభద్రతా భావంతో ఆమె తోటి అధికారులు, ఉద్యోగులపై విరుచుకుపడుతున్నారు. ఆమెకు పంపించిన ఫైలును చదవరు. అందులో ఏముందో చూడరు. కానీ టార్గెట్‌లు ఇచ్చి, అది పూర్తి చేయలేదనే పేరిట తిట్లదండక అందుకుంటారు. 22(ఏ) కేసులపై సమీక్ష చేస్తారు. కేసుల పరిష్కారం జరగడం లేదని జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, ఆర్డీఓలపై దుర్భాషలాడుతారు. పెండింగ్‌ ఫైళ్లన్నీ కలెక్టర్‌ లాగిన్‌లో ఉంటాయి. సంబంధిత ఫైలు మీ దగ్గరే పెండింగ్‌ ఉందని ఎవరైనా గుర్తు చేస్తే అంతే.. కనీసం అరగంట తిడతారు. అందరిముందే తిట్టడం ఆమెకు దినచర్యగా మారింది. నువ్వు కాపీ కొట్టి పాసయ్యావా? లేక లంచం ఇచ్చి ఈ పోస్టుల్లోకి వచ్చావా? అంటూ మొదలుపెడతారు. ఆ తర్వాత మాటలకు అంతూపొంతూ ఉండదు. తీవ్రమైన అభద్రతా భావంలో ఉండే ఆమె ప్రతీ ఫైలును అనుమానిస్తారు. ఏ ఫైలునూ పరిష్కరించరు. సహజంగా ప్రభుత్వం నుంచి రిమైండర్స్‌ వచ్చే దాకా ఫైలును పెండింగ్‌ పెట్టేస్తారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చాక తప్పంతా సంబంధిత అధికారిదేనంటూ అందరి సమక్షంలో మాటల దాడిని కొనసాగించడం సాధారణంగా మారిపోయిందని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రిమైండర్స్‌ ఉన్న ఫైలు సంతకం కోసం పెడితే.. ఎన్నిసార్లు పెడతారు? నేను సంతకం చేయను పో అంటూ అలిగిపోతారు. కొన్ని అత్యవసరమున్న ఫైళ్లను ఆమోదించకుండా డిస్కస్‌ అని రాస్తారు. ఆ డిస్కషన్‌కు టైమ్‌ ఇవ్వరు. ఈ లోగా పుణ్యకాలం గడిచిపోతుంది. ఇలా సకాలంలో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోకపోవడం, ఫైళ్లు పెండింగ్‌ పెట్టడం, దానివల్ల జరిగే పరిణామాలకు సంబంధిత అధికారులను టార్గెట్‌ చేసి అందరి ముందు తిట్టడం ఆమె దినచర్య. కలెక్టర్‌ తిట్లతో విసిగివేసారిన వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. తన చావుకు కలెక్టర్‌ తిట్టిన తిట్లే ప్రధాన కారణమని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ దారుణ ఉదంతం బయటకు రాకుండా తొక్కిపెట్టేశారు.


జేసీలూ బాధితులు

ఆమె కొందరినే తిడతారు, మరి కొందరిని మెచ్చుకుంటారన్న విధానం ఏమీలేదు. తన మీదకు వైఫల్యం అన్న ముద్ర వస్తుందనుకుంటే ఎవరినైనా మాటలతో గాయపరుస్తారు. ఈ కోవలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కూడా బాధితురాలే. సాటి మహిళా అధికారి అని కూడా చూడకుండా సమావేశాల్లో ఉద్యోగులు, అధికారుల ముందే జేసీని అవమానించడం, ఇష్టానుసారంగా తిట్టడం చేశారు. ఈ విషయాన్ని ఆ జేసీ పలుమార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. కానీ రెవెన్యూ శాఖలో కీలక హోదాలో ఉన్న ఓ అధికారిణి అండ ఉందన్న ధైర్యంతో ఆమె మరింతగా చెలరేగిపోయారు. తామిద్దరం ఒకే ప్రాంతం వారమని, ఫిర్యాదులు చేస్తే జిల్లా నుంచి పంపిచేస్తానని చెప్పడం రోటీన్‌గా జరిగిపోతోంది. దీంతో విసిగిపోయిన జేసీ మెటర్నిటీ సెలవుపై వెళ్లిపోయారు. ఆమె స్థానంలో కొత్త జేసీ వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. తిట్లు, అవమానాలు కామన్‌. ఇంకా పట్టరాని కోపం వస్తే జేసీ అయినా, జూనియర్‌ అసిస్టెంట్‌ అయినా సరే జిల్లా విడిచిపెట్టి పోవాలని, లేదంటే సరెండర్‌ చేస్తానని హెచ్చరించడం ఆమెకు అలవాటుగా మారింది. ఆ జిల్లా పరిధిలో సబ్‌ కలెక్టర్‌గా ఉన్న జూనియర్‌ ఐఏఎస్‌ పరిస్థితి మరీ దారుణం. ఆఫీసు సిబ్బంది, జూనియర్‌ అధికారుల ముందే ఆ సబ్‌ కలెక్టర్‌ పట్ల అనుచితంగా మాట్లాడటం డైలీ సీరియల్‌ను తలపిస్తోందని చెబుతున్నారు.


ఇక ఆర్‌డీఓ, తహశీల్దార్‌, ఎంపీడీఓ, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు, విద్య, వైద్యం, రవాణా, రోడ్లు భవనాల శాఖ అధికారుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్న ఫిర్యాదులున్నాయి. ఇటీవల ఓ డాక్టర్‌ను కలెక్టరేట్‌లో అందరి ముందు బూతులు తిట్టారు. అన్నమే తింటున్నావా.. అంటూ ఉచ్చరణకు వీలుకాని భాషను వాడారు. పరీక్షల్లో కాపీ కొట్టి ఉద్యోగంలోకి వచ్చావా? అంటూ మరో డాక్టర్‌పై ఫైల్‌ విసిరికొట్టారని తెలిసింది. ఈమె నోటితీరు గురించి ముందే తెలిసిన కొందరు అధికారులు జిల్లాలో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కలెక్టర్‌ మాటల దాడికి జాయింట్‌ కలెక్టర్‌ కంటే ముందు తొలుత 2024లో ఓ డీఆర్‌ఓ సెలవుపై వెళ్లిపోయారు. ప్రభుత్వం 2025లో మరో డీఆర్‌ఓను జిల్లాకు పంపించింది. కానీ పోస్టింగ్‌ పొందిన మహిళా డిప్యూటీ కలెక్టర్‌ డీఆర్‌ఓగా విధుల్లో చేరలేదు. ఇటీవలే ప్రభుత్వం కొత్తగా మరో డీఆర్‌ఓను పంపించింది. ఆ డీఆర్‌ఓ సీనియర్‌ అధికారి. బాగా పనిచేస్తారని జిల్లాకు పంపించారు. ఆమెకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఆ అధికారిణి ఎన్నికల కమిషన్‌ పని సహా ప్రభుత్వ పనులు చేస్తున్నారు. జిల్లాలో ఓట్ల రివిజన్‌ అద్భుతంగా జరుగుతోందని, అధికారులు బాగా పనిచేస్తున్నారని అమరావతి నుంచి వెళ్లిన ఎన్నికల కమిషన్‌ అధికారులు ప్రశంసించారు. కలెక్టర్‌కు అది నచ్చలేదు. ఏవో కారణాలతో డీఆర్‌ఓపై అందరి ముందు తిట్లదండకం చదివారు. అదే రోజు రాత్రి డీఆర్‌ఓ సెలవుపై వె ళ్లిపోయారు. సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ తర్వాత ఈ సంఘటన జరిగింది.


అంతా తన వద్దే పనిచేయాలి

సాధారణంగా ప్రజలున్న చోటే అధికారులు పనిచేయాలి. అందుకే గ్రామ, మండల, డివిజన్‌, జిల్లా ఆఫీసుల విధానం ఉంది. కానీ ఆమె అధికార కేంద్రీకరణకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పిటిషన్‌లు తీసుకునే పీజీఆర్‌ఎస్‌ను ప్రధానంగా కలెక్టరేట్‌ కేంద్రంగానే నిర్వహిస్తున్నారు. నెలలో రెండు సోమవారాలు విధిగా తహశీల్దార్‌, ఆర్‌డీఓ, ఎంపీడీఓ, ఇతర విభాగాల అధికారులు తాము పనిచేసే ప్రాంతాలను వదిలి జిల్లా కేంద్రంలో ఆమె సమక్షంలో పనిచేయాలి. నెలలో రెండు వారాలు రెవెన్యూ, మరో రెండు వారాలు ఇతర శాఖలు కలెక్టరేట్‌ కేంద్రంగా ఆమె సమక్షంలోనే పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్నారు. మరి గ్రామాలు, మండలాల్లో పరిస్థితి ఏంటి? ప్రజలంతా అధికారులున్న జిల్లా కేంద్రానికి వచ్చి పిటిషన్‌లు ఇవ్వాలని ఆమె కండీషన్‌ పెట్టారు. సాధారణంగా ప్రజలున్న చోటకే అధికారులు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి. వీలైన మేరకు అక్కడికక్కడే పరిష్కారం చూపాలి. కానీ ఆమె అందుకు విరుద్ధమైన విధానం అమలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఈ పద్ధతిని వ్యతిరేకిస్తున్నారు. చిన్న సమస్యకు కూడా జిల్లా కేంద్రానికి పిలిపించుకోవడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

విరగ్గాసిన స్టార్‌ ఫ్రూట్స్‌

వెంకటేశ్వరకాలనీలో కార్డన్‌సెర్చ్‌

Updated Date - Sep 07 , 2026 | 04:46 AM