Share News

రాణా, గున్నీపైసస్పెన్షన్‌ ఎత్తివేత

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:14 AM

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీలకు రెండేళ్ల తర్వాత ఊరట లభించింది. ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో 2024 సెప్టెంబరు 15న సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల్లో పీఎస్ఆర్‌ ఆంజనేయులు మూడు రోజుల క్రితమే రిటైరయ్యారు.

రాణా, గున్నీపైసస్పెన్షన్‌ ఎత్తివేత

  • డీజీపీకి రిపోర్టు చేయాలన్న ప్రభుత్వం

  • ముంబై నటి జెత్వానీ వ్యవహారంలో ఊరట

  • సీనియర్‌ ఐపీఎస్‌లకు త్వరలో పోస్టింగ్‌లు

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీలకు రెండేళ్ల తర్వాత ఊరట లభించింది. ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో 2024 సెప్టెంబరు 15న సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల్లో పీఎస్ఆర్‌ ఆంజనేయులు మూడు రోజుల క్రితమే రిటైరయ్యారు. ఇదే వ్యవహారంలో రాణా, గున్నీ సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరు సీనియర్‌ ఆగస్టు చివరి వారంలో సమర్పించిన వినతి పత్రంతో పాటు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం సస్పెన్షన్‌ ఎత్తివేయాలన్న నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఇద్దరిపై కొనసాగుతున్న శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్‌ కేసులు యథావిధిగా ఉంటాయని స్పష్టం చేసింది. డీజీపీ వద్ద రిపోర్టు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు సొంత డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చారు. త్వరలో వారికి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.


గత వైసీపీ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాల మేరకు జెత్వానీ, ఆమె తల్లిదండ్రుల్ని అరెస్టు చేసిన వ్యవహారం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాక ముందే అప్పటి పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా ఆదేశాల మేరకు అప్పటి డీసీపీ విశాల్‌ గున్నీ నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం ముంబైకి వెళ్లి జెత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి విజయవాడకు తరలించి జెత్వానీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలను రాణా, గున్నీ ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముంబై నటి విజయవాడకు వచ్చి హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. విచారించిన ప్రభుత్వం వీరిద్దరూ అధికార దుర్వినియోగంతో పాటు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చింది. వీరిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులును కూడా సస్పెండ్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ

పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి

Updated Date - Sep 04 , 2026 | 05:14 AM