Share News

పంచాయతీ తొలి విడత పోరులో.. 758 సర్పంచ్‌లు ఏకగ్రీవం

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:55 AM

పంచాయతీ ఎన్నికల తొలి విడతలో 758 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

పంచాయతీ తొలి విడత పోరులో..  758 సర్పంచ్‌లు ఏకగ్రీవం
elections

  • 14,727 వార్డులకు కూడా.. మిగతా 3191 సర్పంచ్‌ స్థానాలకు 9052 మంది పోటీ

  • 25,061 వార్డులకు బరిలో 53,678 మంది

  • 26వ తేదీన వీటికి పోలింగ్‌

  • రెండో విడతలో 1.34 లక్షల నామినేషన్లు

  • 4975 సర్పంచ్‌ స్థానాలకు 25,413 మంది

  • 49,318 వార్డులకు 1,09,178 మంది

  • ఉపసంహరణకు రేపే తుది గడువు

అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల తొలి విడతలో 758 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 14,727 వార్డులకు కూడా పోటీలేకుండా ఎన్నికయ్యారు. దరిమిలా 3191 సర్పంచ్‌ స్థానాలకు 9052 మంది, 25,016 వార్డులకు 53,678 మంది పోటీలో నిలిచారు. 42 రెవెన్యూ డివిజన్లలోని 201 మండలాల్లో మొదటి విడతలో 3949 గ్రామాల సర్పంచ్‌లకు, 39,832 వార్డులకు ఈ నెల 26వ తేదీన ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీకి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 4975 పంచాయతీల్లో సర్పంచ్‌, 49,318 వార్డు సభ్యుల స్థానాలకు కలిపి 1,34,591 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. ఇందులో సర్పంచ్‌ స్థానాలకు 25,413 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1,09,178 మంది పోటీపడుతున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం (24వ తేదీ) వరకు గడువుంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 29వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. రెండో విడతలో మొత్తం 28 జిల్లాల పరిధిలోని 52 రెవెన్యూ డివిజన్లు, 246 మండలాల్లోని 4975 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.


మూడో విడతలో తొలిరోజు 13,615 నామినేషన్లు

మూడో విడతలో 46 రెవెన్యూ డివిజన్లు, 214 మండలాల పరిధిలోని 4244 పంచాయతీల ఎన్నికలకు ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు 13,615 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఏకగ్రీవమైన చోట పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ..

పంచాయతీల్లో అన్ని వార్డులకు ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తయి, కేవలం సర్పంచ్‌ పదవికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ/విలీనానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి మంజూరుచేసింది. పోలీసు, పోలింగ్‌ సిబ్బంది నియామకం, రవాణా, ఇతర నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో కొన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. విలీనం చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 650కి మించరాదు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పోలింగ్‌ సిబ్బందిని నియమించాలి. ఒకే ప్రాంగణం లేదా ఒకే ప్రాంతంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను మాత్రమే విలీనం చేయాలి. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలను విలీనం చేయరాదు. విలీనం చేసిన పోలింగ్‌ కేంద్రం వద్దకు ఓటర్లకు మార్గనిర్దేశం చేసేందుకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలి. పోలింగ్‌ కేంద్రాల విలీనంపై.. పోటీలో ఉన్న అభ్యర్థులకు సమాచారం అందించాలి. ఆయా ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలి. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు.

ఈ వార్తలూ చదవండి

పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!

Updated Date - Nov 23 , 2026 | 03:57 AM