పలాసలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 300 కుటుంబాలు..
ABN , Publish Date - Apr 26 , 2026 | 09:09 PM
శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం, ఏప్రిల్ 26: శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ చెందిన 300 కుటంబాలు టీడీపీలో చేరాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా, అప్పలరాజు సొంత గ్రామం నుంచే భారీగా వలసలు ప్రారంభమవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి అప్పలరాజు అనుసరిస్తున్న తీరుపై పలాస వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలను, స్థానిక నాయకులను సమన్వయం చేసుకోవడంలో ఆయన విఫలమయ్యారని, ఆయన వైఖరితో విసిగిపోయి పార్టీని వీడుతున్నామని కార్యకర్తలు పేర్కొంటున్నారు.
ఎమ్మెల్యే గౌతు శిరీష సమక్షంలో చేరికలు..
ఈ క్రమంలోనే అప్పలరాజు సొంత గ్రామానికి చెందిన సుమారు 300 కుటుంబాలు ఒకేసారి వైసీపీకి గుడ్-బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీలో చేరిన కార్యకర్తలకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సాదర స్వాగతం పలికారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ‘వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు, కార్యకర్తలు.. అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారు. పలాస నియోజకవర్గ అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి. చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది.’ అని అన్నారు. ఈ భారీ వలసలతో పలాసలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొనగా, వైసీపీ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు
రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా
For More AP News And Telugu News