200 ప్రశ్నలు.. 10 జవాబులు!
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:26 AM
కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక నిందితుడు షేక్ సాదిక్‌ఖాన్ మూడు రోజుల పోలీసు కస్టడీ గురువారంతో ముగిసింది.
విచారణకు సహకరించని సాదిక్
ముగిసిన మూడు రోజుల కస్టడీ
కాకినాడ, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక నిందితుడు షేక్ సాదిక్‌ఖాన్ మూడు రోజుల పోలీసు కస్టడీ గురువారంతో ముగిసింది. మొదటి రెండు రోజులూ తనకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరించిన సాదిక్.. మూడో రోజూ అదే ధోరణితో పోలీసుల సహనానికి పరీక్ష పెట్టాడని తెలుస్తోంది.
సుమారు 200 ప్రశ్నల వరకు పోలీసులు అడగ్గా... కేవలం 10 ప్రశ్నలకే సమాధానం చెప్పినట్టుగా తెలిసింది. మిగిలిన వాటికి మౌనంగా ఉండటమో లేకపోతే పొంతన లేకుండా జవాబులు ఇచ్చినట్టు సమాచారం. దీంతో పోలీసులు మరోసారి అతడిని కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించనున్నారు. మూడు రోజుల కస్టడీలో సాదిక్‌ను ఏది ప్రశ్నించినా.. ముందు తనకేమీ తెలియదని చెప్పడం.. తర్వాత ఆధారాలు చూపితే అవునని ఒప్పుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. గట్టిగా ప్రశ్నిస్తే.. ‘నన్ను ఎన్‌కౌంటర్ చేస్తారా?’ అని సాదిక్ ఎదురు ప్రశ్న వేసినట్టు తెలిసింది.
గురువారం సాదిక్‌ను కాకినాడ గొడారిగుంటలో ఉన్న ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీ వద్దకు తీసుకువెళ్లి సుమారు 2 గంటల పాటు విచారించారు. అక్కడికి ఎవరెవరు వచ్చేవారు? నూకరాజు కుమార్తె సౌజన్య వచ్చేవారా? అని ఆరా తీశారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. అలాగే అకాడమీలో ఉన్న సాదిక్ ల్యాప్‌టా్‌పను పరిశీలించారు. అందులో సౌజన్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ ల్యాప్‌టా్‌పను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అకాడమీలో పనిచేసే ఇద్దరిని కూడా పోలీసులు ప్రశ్నించినట్టు తెలిసింది.
మూడోరోజు విచారణలో హైదరాబాద్‌కు చెందిన అత్తరు విక్రయ వ్యాపారుల నుంచి సైనేడ్ కొనుగోలు చేశానని సాదిక్ అంగీకరించినట్లు సమాచారం. దీంతో జగదీశ్వరెడ్డి మరణంలో సాదిక్ పాత్ర ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు సాదిక్ ఖాన్‌కు సైనేడ్‌ను విక్రయించినట్టు అంగీకరించిన అత్తరు వ్యాపారులు రెహ్మాన్, ఖాదీర్, ఇబ్రహీం అప్రూవర్లుగా మారారని పోలీసులు తెలిపారు. సైనేడ్ కొనుగోలు తర్వాత సాదిక్ తమకు ఫోన్ పే చేసిన రూ.30వేలు, రూ.40వేలకు సబంధించిన ఆధారాలను చూపించినట్టు తెలిసింది. మూడు రోజుల విచారణ పూర్తవడంతో సాదిక్‌కు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచి, అనంతరం రాజమండ్రి జైలుకు తరలించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెగిన రోప్.. దిగిపోయిన 9వ గేటు
మరో ట్రావెల్స్ బస్సు దగ్ధం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News