అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలనకు ప్రత్యేక కేంద్రాలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:21 AM
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీఐడీ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గుంటూరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీఐడీ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రుల బృందం నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్డ్ బాండ్లు, సంబంధిత పత్రాల పరిశీలన, నమోదు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు. డిపాజిటర్ స్వయంగా హాజరైతే ఒరిజినల్ బాండ్ లేదా నగదు రశీదు చూపించాలి. అయితే ఒరిజినల్ బాండ్ ఇవ్వక్కర్లేదు. సంతకం చేసిన కలర్ జిరాక్స్ సమర్పించాలి. ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, డిపాజిటర్ మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాలి. డిపాజిటర్ చనిపోయి, నామినీ జీవించి ఉంటే ఒరిజినల్ బాండ్‌ను పరిశీలన కోసం చూపాలి. నామినీ సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్‌తోపాటు డిపాజిటర్ మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. డిపాజిటర్, నామినీ ఇద్దరూ మరణిస్తే చట్టబద్థ వారసుడు లేదా కుటుంబ సభ్యుడు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఏజెంట్లు ఒరిజినల్ బాండ్‌ను చూపించి, కలర్ జిరాక్స్ ఇవ్వాలి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల జిల్లా పోలీస్ కార్యాలయాల్లో ప్రత్యేక అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరిశీలన ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!