Share News

The year 2025: ఈ ఏడాదిలో ఎన్నో విజయాలు... మరెన్నో వివాదాలు...

ABN , Publish Date - Dec 28 , 2025 | 10:12 AM

ఎప్పటిలాగే ఈ ఏడాదీ ఎన్నో సంఘటనలకు సాక్షీభూతంగా నిలిచింది. కొంతమందిని వార్తల్లో వ్యక్తులను చేసింది. రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద, సామాజిక రంగాల్లో ఎంతోమంది తమదైన ముద్ర వేశారు. కొందరు వివాదాస్పదులయ్యారు. అందుకే ప్రపంచం వారివైపు చూసింది. ఈ ఏడాది ఆ విధంగా వార్తల్లో నిలిచిన కొందరి జ్ఞాపకాలు క్లుప్తంగా...

The year 2025: ఈ ఏడాదిలో ఎన్నో విజయాలు... మరెన్నో వివాదాలు...

ఒక్క నిర్ణయంతో తారుమారు

ఒక్క నిర్ణయం దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చేస్తుంది. ఒక్క నిర్ణయం వ్యక్తికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తుంది. దీనికి ఒక ఉదాహరణ బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, 78 ఏళ్ల షేక్‌ హసీనా జీవితం. ఉక్కుమహిళగా గుర్తింపు పొందిన ఆమె భారత్‌లో ఆశ్రయం పొందే పరిస్థితి రావడానికి ఒక్క నిర్ణయమే కారణం. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను కేటాయిస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆమె పాలిట శాపంగా మారింది. నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దేశం మొత్తం అట్టుడికిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక అల్లర్ల సమయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కోర్టు మరణశిక్ష విధించింది. షేక్‌ హసీనా తండ్రి షేక్‌ ముజిబిర్‌ రెహమాన్‌ బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించి ‘జాతిపిత’గా నిలిచిపోయారు.


book4.2.jpg

ఆయన కూతురుగా షేక్‌ హసీనా సైతం బంగ్లాదేశ్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. అయితే ఆమె ప్రశంసలతో పాటు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతిపక్షాలను అణిచి వేశారని, మీడియాపై ఆంక్షలు విధించారని విమర్శలు వ్యక్తమయ్యాయి. బంగ్లాదేశ్‌ను ఎక్కువ కాలం పాలించిన మహిళా నేతల్లో ఒకరిగా హసీనా చరిత్ర సృష్టించారు. చివరకు ఆమె తన దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. నిరసనల సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలపై బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్‌లో విచారణ జరిగింది. చివరకు కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని హసీనా ఆరోపించారు. ఒకదేశ ప్రధాని దేశం విడిచిపారిపోవాల్సి రావడం ద్వారా ఆమె ఈ ఏడాది వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.


వివాదాస్పద నిర్ణయాలతో...

టారిఫ్‌... కొంతకాలం క్రితం వరకు సామాన్యులకు పెద్దగా తెలియని పదం ఇది. కానీ ఇప్పుడు టారిఫ్‌ గురించి అందరు చర్చించుకుంటున్నారు. ఇదంతా ట్రంప్‌ పుణ్యమే. ‘భారత్‌-పాక్‌ మధ్య యుద్ధాన్ని నిలువరించింది నేనే . నాకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే’... బాగా వైరల్‌ అయిన ఈ మాటలు కూడా ఆయన నోటి నుంచి వచ్చినవే. పూటకో అబద్దంతో మీడియా ముందుకొస్తారు. టారిఫ్‌లతో దేశాలను తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎప్పుడూ లేని విధంగా 50, 70, 100 శాతం టారిఫ్‌లంటూ రోజుకో నిర్ణయంతో ప్రపంచదేశాలను భయపెట్టాలని చూశారు.


book4.3.jpg

నాకిష్టమైన పదం ‘టారిఫ్‌’ అంటారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తన నిర్ణయాలతో రోజూ వార్తల్లో నిలుస్తున్నారు 78 ఏళ్ల డొనాల్డ్‌ ట్రంప్‌. రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేయడం ఆపాలని భారత్‌కు సైతం హుకుం జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను ఆపానని చెప్పుకున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం వచ్చే వారిపై కఠిన ఆంక్షలు విధించారు. హెచ్‌1బి వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచి మోనార్క్‌ని అనిపించుకున్నారు. ఏకంగా కొన్ని దేశాలపై నిషేధం విధించారు. ఆ నిషేధంతో ఆయా దేశాల ప్రజల్ని అమెరికాలో అడుగుపెట్టకుండా చేశారు. గతంలో పనిచేసిన అధ్యక్షులకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్న గడసరి ట్రంప్‌గా వార్తల్లోకెక్కారు.


మస్క్‌... మామూలోడు కాదు

book4.4.jpg

స్వయంకృషితో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదగడం సామాన్య విషయం కాదు. అవరోధాలను అవకాశాలుగా మలుచుకుని అడుగుపెట్టిన రంగంలో అగ్రస్థానంలో నిలిచారు. 677 బిలియన్‌ డాలర్ల సంపదతో, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందారు ఎలాన్‌ మస్క్‌. ప్రపంచ కుబేరుల్లో నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతున్న మస్క్‌ రాజకీయ వ్యాఖ్యలతో ఈ ఏడాది వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఆ తరువాత కొద్దికాలం పాటు ట్రంప్‌, మస్క్‌ల మధ్య విడదీయలేని స్నేహం కొనసాగింది. ట్రంప్‌ తీసుకునే ప్రతీ నిర్ణయం వెనక మస్క్‌ ఉండేవారు. ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌లో కొత్త విభాగమైన డోజెను లీడ్‌ చేశారు మస్క్‌. కానీ వారి మధ్య స్నేహం కొద్ది కాలమే కొనసాగింది. విభేదాల నేపథ్యంలో డోజె నుంచి బయటకు వచ్చేశారు మస్క్‌. తరువాత ఇద్దరూ బద్దశత్రువుల్లా ఒకరిపై మరొకరు విమర్శలతో విరుచుకుపడ్డారు. టెస్లాను ఎలాగైనా భారత విపణిలోకి దింపాలన్న తన కోరికను ఇటీవలే నెరవేర్చుకున్నారు. స్పేస్‌ ఎక్స్‌, టెస్లా, ఎక్స్‌ ఏఐ, స్టార్‌లింక్‌ వంటి దిగ్గజ కంపెనీలతో మస్క్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.


ఊహించని బహుమతి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను నోబెల్‌ శాంతి బహుమతి వరిస్తుందని అందరూ ఊహిస్తున్న సమయంలో, వెనెజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో ప్రతిష్టాత్మక నోబెల్‌ గెలుచుకోవడం అందర్నీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఈ ప్రకటన తరువాత ప్రజలు నెట్‌లో ఆమె వివరాల కోసం తెగ వెదికారు. దీంతో ఆమె ఈ ఏడాది వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వెనెజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆమె చేస్తున్న సేవలకు గాను నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు అక్రమ మార్గాల్లో అధికారాన్ని చేపట్టారన్న ఆరోపణలతో ఆమె నిషేధానికి గురయ్యారు. నిషేధాన్ని ఎదుర్కొంటున్న మరియా... తను బయటకు వస్తే అరెస్ట్‌ చేస్తారనే ఉద్దేశంతో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. నోబెల్‌ బహుమతి అందుకునేందుకు నార్వే బయలుదేరిన ఆమె సకాలంలో చేరుకోలేకపోయారు. దాంతో ఆమె కుమార్తె నోబెల్‌ బహుమతిని అందుకున్నారు.


వీర నారీమణులు

book4.5.jpg

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సేదతీరుతున్న పర్యాటకులపై తీవ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. పహల్గాంలో జరిగిన ఈ ఘటన యావద్భారతాన్ని కుదిపేసింది. విహారయాత్రకు వెళ్లిన వారిని అత్యంత దారుణంగా హతమార్చడంపై దేశం భగ్గుమంది. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో పాకిస్థాన్‌ భూభాగంలో ఉన్న తీవ్రవాద శిబిరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. తీవ్రవాదులు తలదాచుకుంటున్న నిర్మాణాలను నేలమట్టం చేసింది. ‘ఆపరేషన్‌ సింధూర్‌’కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించింది. అర్ధరాత్రి జరిగిన ఈ సైనిక దాడిని వివరించేందుకు మిలటరీ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.


ఎవ్వరి ఊహలకు అందకుండా ఈ సమావేశంలో ఇద్దరు మహిళా అధికారులు వచ్చి ఆపరేషన్‌ సిందూర్‌ గురించి బ్రీఫింగ్‌ ఇవ్వడం అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వీర మహిళలు కల్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికాసింగ్‌లు. ‘భార్య కళ్ల ముందు భర్తను చంపినందుకు ప్రతీకారంగా, మహిళల చేత నీకు బుద్ధి చెప్పాం’ అని తెలియజేసేందుకు ఈ నిర్ణయం తీసుకోవడంపై భారతీయ ప్రజానీకం హర్షం వ్యక్తం చేసింది. వింగ్‌ కమాండర్‌ వ్యోమికాసింగ్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో హెలికాప్టర్‌ పైలెట్‌గా పనిచేస్తుండగా, కల్నల్‌ సోఫియా ఖురేషీ ఇండియన్‌ ఆర్మీలో కల్నల్‌ ర్యాంకుతో సీనియర్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ తరువాత పాకిస్థాన్‌పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ప్రపంచదేశాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మా జోలికి వస్తే ఎవ్వరినీ వదిలిపెట్టం అనే సందేశాన్ని భారత ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విజయం సాధించింది.


రోదసీలోకి మనవాడు

book4.6.jpg

‘ఇస్రో’ ఎన్ని విజయాలు సాధిస్తున్నా... అంతరిక్షంలోకి భారతీయుడ్ని పంపాలన్న కల మాత్రం ఊరిస్తూనే ఉంది. రాకేష్‌ శర్మ తరువాత మరో వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లిందే లేదు. 40 ఏళ్లు గడిచినా అది కలగానే ఉండిపోయింది. ఇటీవల ఆ కలను సాకారం చేస్తూ 18 రోజుల పాటు అంతరిక్షయాత్ర చేసి వచ్చారు భారత వ్యోమగామి శుభాంషు శుక్లా. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పైలెట్‌గా పనిచేస్తున్న శుక్లాని గగన్‌యాన్‌ ప్రాజెక్టు కోసం వ్యోమగామిగా ఇస్రో ఎంపిక చేసింది. అంతరిక్షయానం చేసిన రెండో భారతీయునిగా గుర్తింపు పొందారాయన. అమెరికా ప్రైవేట్‌ సంస్థ ‘యాక్సియమ్‌ మిషన్‌ 4’ పేరుతో నిర్వహించిన ఈ స్పేస్‌టూర్‌కు శుక్లా గ్రూప్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆరోగ్యం, బయాలజీ వంటి అంశాలపై రకరకాల ప్రయోగాలు నిర్వహించారు. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌కు శుక్లా చేసిన అంతరిక్ష పర్యటన ఎంతో ఉపయోగపడనుంది. అంతరిక్షయాత్ర కోసం ఏడాదిపాటు అమెరికాలో శిక్షణ తీసుకున్నారు శుక్లా. ఐఎస్‌ఎస్‌ టూర్‌ తర్వాత ఈ ఏడాది భారతదేశంలో మెగా న్యూస్‌మేకర్‌గా నిలిచారు.


సంప్రదాయానికి బ్రేక్‌

జపాన్‌ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా 64 ఏళ్ల సనే తకాయిచీ ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు జపాన్‌కు 103 మంది ప్రధానమంత్రులుగా పనిచేశారు. అందులో ఒక్క మహిళ కూడా లేరు. ఆ సంప్రదాయాన్ని బ్రేక్‌ చేస్తూ తకాయిచీ 104వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ద్వారా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. డ్రమ్స్‌ వాయించడంలో ఆమె దిట్ట. హెవీ మెటల్‌ మ్యూజిక్‌ బ్యాండ్స్‌ని ఆమె బాగా ఇష్టపడతారు. కొంతకాలం టీవీ కామెంటేటర్‌గా పనిచేశారు. తకాయిచీ కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారామె.


రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందు కొంతకాలం అమెరికాలో ఉన్నారు. జపాన్‌కు తిరిగొచ్చాక టెలివిజన్‌ రంగంలోకి వెళ్లారు. ప్రజల్లో గుర్తింపు పొందడానికి ఇది సరైన మార్గంగా ఆమె భావించారు. మొదటి మహిళా ప్రధానమంత్రిగా గుర్తింపు పొందినప్పటికీ స్త్రీవాద ఎజెండాకు దూరంగా ఉంటారు. ఆమె మంత్రివర్గంలో ఇద్దరు మహిళలను మాత్రమే మంత్రులుగా తీసుకున్నారు. ‘మార్గరేట్‌ థాచర్‌ నాకు స్ఫూర్తి’ అనే చెప్పే తకాయిచీ 32 ఏళ్ల వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టారు. జపాన్‌ ఉక్కుమహిళగా పేరుగాంచిన తకాయిచీ జపాన్‌ను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్నారు.


అమెరికా నుంచి ఎట్టకేలకు...

book4.7.jpg

అగ్రరాజ్యం అమెరికా అన్నింటా తన ఆధిపత్యం కొనసాగాలని కోరుకుంటుంది. కానీ కొన్ని మాత్రం శతాబ్దాల పాటు అందకుండా ఊరిస్తుంటాయి. అలాంటి వాటిలో వాటికన్‌ సిటీలోని రోమ్‌ క్యాథలిక్‌ చర్చ్‌ అధిపతిగా అమెరికా వ్యక్తి ఎన్నిక కావడం. 2 వేల ఏళ్లు గడిచినా అమెరికాకు చెందిన వ్యక్తి ఆ పీఠంపై కూర్చోలేదు. ఈ ఏడాది పోప్‌ ఫ్రాన్సిస్‌ మరణంతో రాబర్ట్‌ ప్రీవోస్ట్‌ రూపంలో అమెరికాకు మొదటిసారి ఆ అవకాశం దక్కింది. రోమన్‌ క్యాథలిక్‌ చర్చ్‌ అధిపతిగా అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్‌ ప్రీవోస్ట్‌ ఎన్నికయ్యారు. ఆయనను పోప్‌ లియో 14 అని, బిషప్‌ ఆఫ్‌ రోమ్‌ అని పిలవనున్నారు. 133 మంది కార్డినల్‌ ఎలక్టర్లు రాబర్ట్‌ ప్రీవోస్ట్‌ను ఎన్నుకున్నారు. 1955లో చికాగోలో జన్మించిన ప్రీవోస్ట్‌ పోప్‌గా 267వ వ్యక్తి కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాథలిక్‌ చర్చ్‌కి 300 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. వాటికన్‌ సిటీకి ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశంగా గుర్తింపు ఉంది.


డామిట్‌... కామెడీ అడ్డం తిరిగింది...

ఈ మధ్యకాలంలో ఏ షో చూసినా అడల్ట్‌ కామెడీయే కనిపిస్తోంది. ఆరోగ్యకరమైన కామెడీ మచ్చుకైనా కనిపించదు. బూతుల్లోనే హాస్యం వెతుక్కోవాల్సి వస్తోంది. యూట్యూబ్‌ చానెళ్లలో వచ్చే షోలలో కామెడీ మరింత దిగజారిపోయింది. స్టాండప్‌ కమెడియన్‌, యూట్యూబర్‌ సమయ్‌ రైనా నిర్వహిస్తున్న ఒక షోలో హోస్ట్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. పార్లమెంటులో సైతం చర్చ జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. ‘వాక్‌ స్వేచ్ఛ ఉండాల్సిందే. కానీ పరిమితి దాటకూడదు. ముఖ్యంగా యూట్యూబ్‌ చానెళ్లతో పాటు ఆన్‌లైన్‌ కంటెంట్‌ను నియంత్రించే వ్యవస్థ ఉండాల’న్న అభిప్రాయం అంతటా వ్యక్తమైంది.


అడల్ట్‌ జోకులతో ఫేమస్‌ అయిన సమయ్‌ రైనా ‘ఇండియా గాట్‌ లాటెంట్‌’ పేరుతో కామెడీ టాలెంట్‌ షోని నిర్వహిస్తున్నారు. ఈ షోలో హోస్ట్‌గా వ్యవహరించిన రణ్‌వీర్‌ అల్లాబాడియా కంటెస్టెంట్‌ని అడిగిన అశ్లీల ప్రశ్న పెద్ద దుమారాన్నే రేపింది. లైవ్‌ షోలో చేసిన వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దేశవ్యాప్తంగా ముంబయి, గౌహతితో పాటు అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర సైబర్‌ సెల్‌ పోలీసులు సమన్లు జారీ చేసి విచారించారు. సుప్రీంకోర్టు సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశాలిచ్చింది.


ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తులందరూ ఆన్‌లైన్‌లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. దాంతో క్షమాపణలు చెప్పిన సమయ్‌ రైనా, రణ్‌వీర్‌ ‘ఇండియా గాట్‌ లాటెంట్‌’ కామెడీ షోకు సంబంధించిన అన్ని ఎపిసోడ్‌ల వీడియోలను యూట్యూబ్‌ నుంచి తొలగించారు. విచారణ సందర్భంగా అధికారులకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పుకొచ్చారు. ఈ కాంట్రవర్సీని హ్యాండిల్‌ చేయడం కష్టమైందని వాపోయారు. తన అడల్ట్‌ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చను లేవదీసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు సమయ్‌ రైనా.


ఈ వార్తలు కూడా చదవండి..

బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!

ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 28 , 2025 | 10:18 AM