బంగారం లాంటి అన్నం.. మనవాళ్లు మొదటగా రుచి చూసింది ఏంటంటే..
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:23 PM
పప్పుధాన్యాల్లో పెసరపప్పునే తెలుగువారు మొదటగా రుచి చూశారని చరిత్ర. పెసర చేనునే ‘పైరు’ అన్నారు ఆ తర్వాత అన్ని పంట చేలనూ పైరు అనటం మొదలు పెట్టారు. పైరగాలి అంటే సాయంకాల సమయంలో వీచే తూర్పు గాలి.
‘‘తండులా దాలిసంయుక్తా
లవణార్ద్రకహింగుభిః
యుక్తాశ్చ సలిలె సిద్థాః
కృశరా కథితా బుధైః’’
పప్పుధాన్యాల్లో పెసరపప్పునే తెలుగువారు మొదటగా రుచి చూశారని చరిత్ర. పెసర చేనునే ‘పైరు’ అన్నారు ఆ తర్వాత అన్ని పంట చేలనూ పైరు అనటం మొదలు పెట్టారు. పైరగాలి అంటే సాయంకాల సమయంలో వీచే తూర్పు గాలి. ఆడపశువు ఎదకొస్తే పైరయ్యిం దంటారు. ఇది ప్రాచీన పదం కావటాన అనేక కొత్త అర్థాల్లోకి ఈ ‘పైరు’ వ్యాపించింది.
పెసలు పండించాకే శాకాహార ప్రాధాన్యత పెరిగింది. పెళ్ళి విందుని తెలుగువారు పప్పన్నం అన్నది ఈ పెసరపప్పునే! కందిపప్పు మనకి క్రీ.శ. తొలిశతాబ్దాలలో పరిచయం అయినప్పటికీ పెసర పప్పుదే మన వంటింటి పెత్తనం! స్వాతంత్రోద్యమ కాలంలో మహారాష్ర్టులతో సాన్నిహిత్యం వలన కందిపప్పు, బెంగాలీలతో సాన్నిహిత్యం వలన శనగపప్పు మన వంటిళ్లను ఆక్రమించాయి!
ముద్దపప్పు, బియ్యం, పెసర పప్పు కలిపిన పులగం తెలుగు వారి తొలి పప్పన్నం! నానబెట్టి సాతాళించిన పెసర గుగ్గిళ్లు, నానబెట్టి ఆరనిచ్చి వేగించే మూంగ్ దాల్ అనే పెసర వేపుడు, ఆకుకూరలతో పెసరపప్పు కలిపి వండిన పొడికూర, పెసరకట్టు, పెసర గారెలు, పెసర పోలీలు, పెసర పచ్చడి ఇలా ఎన్నో ప్రాచీన వంటకాలున్నాయి. పెసర పచ్చడిని మందపు రొట్టెగా పెనం మీద కాల్చి నేతి అన్నంలో నంజుకుంటారు. ఈ రొట్టె ముక్కల్ని కలిపి పలావు వండేవాళ్లు. పెసరపప్పు ఉడికించి బెల్లం కలిపిన పూర్ణాన్ని గోధుమ పిండిలో పొదిగి బొబ్బట్లు వండేవారు. మైదాపిండి, శనగపిండి వచ్చాక మన వంటకాల స్వరూప స్వభావాలు మారిపోయాయి.
తెల్లని వరి అన్నంలో పచ్చని పెసర ముద్ద పప్పు కలుపుకుంటే తెలుపు, పసుపు కలిపి బంగారపు రంగు ఏర్పడుతుంది కాబట్టి, దీన్ని సంస్కృతంలో కృశర అన్నారు. కృశనం అంటే బంగారం. తెలుగు వాళ్లు దీన్ని ‘పులగం’ అన్నారు. ‘పుల’ అనే తెలుగు పదానికి బంగారపు రంగు అని అర్థం. పులఖండం అంటే బంగారపు రంగులో ఉండే ఖండశర్కర. సంస్కృతంలోనూ తెలుగులోనూ ఒకే అర్థంలో పేర్లు కనిపిస్తున్నాయి. వరితో వండే వంటకం కాబట్టి, ఇది దక్షిణభారతీయుల వంటకమే! పులగం అనగా బంగారం లాంటి అన్నం అనే తెలుగు పేరుని సంస్కృతీకరించి కృశర అన్నారని అర్థం అవుతోంది. సంస్కృతానికి తెలుగు భాష చాలా పదాలిచ్చింది. వాటిలో పులగం ఒకటి! తమిళులు తీపి లేకుండా వండింది కాబట్టి, కటు (కారపు) పొంగలి అన్నారు. ఇప్పుడు మన హోటళ్ళవాళ్లు ‘కట్ పొంగల్’ అంటూ విచిత్రంగా పలుకుతున్నారు. అదొక ఆత్మానందం! పులగంలో ఉన్న బంగారుతనం ఈ పిలుపులో ఉన్నదా?
‘భోజన కుతూహలం’ అనే పాకశాస్త్ర గ్రంథం ఈ కృశర ఉపయోగాలను ఇలా తెలియ జేసింది: తండులా దాలిసంయుక్తా = పెసర పప్పు, బియ్యం కలిపి వండినది; లవణార్ద్రక హింగుభిః = సైంధవలవణం, అల్లం, మిరియాలు, ఇంగువ వగైరా కలిపినది; సలిలె సిద్థాః కృశరా కథితా బుధైః = చాలినంత నెయ్యి వేసి వండితే, దాన్ని కృశరా అని మేథావులు పిలుస్తారు. శుక్రలా = పురుషుల్లో జీవకణాలను పెంచే సమర్థత దీనికి ఉంది. బల్యా గురు పిత్త కఫప్రదా = బలకరం, కడుపులో దండిగా ఉంటుంది. ఎసిడిటీని తగ్గి స్తుంది. కఫదోషాన్ని పోగొడ్తుంది. బహువిష్టంభ = నీళ్ళవిరేచనాలను, అతిమూత్రాన్ని ఆపుతుంది. మలమూత్రకరీ =మలమూత్రాలు ఫ్రీగా అయ్యేలా చేస్తుంది; బుద్ధివివర్ధక = జ్ఞాపకశక్తిని పెంచేదిగా ఉంటుంది.
పంచభక్ష్య పరమాన్నాలకు సమానమైనదని దేవుడికి మహానివేదన పెట్టడానికి ఈ పులగం వండుతారు. పాలు పోసి, కూరగాయల ముక్కలు కూడా కలిపి నేతితో వండిన పులగం ఒక్కటే సంపూర్ణ ఆహారం! మధ్యాహ్న భోజన పథకంలో బడిపిల్లలకు ఇలాంటి వంటకాలను చేర్చాలి! కందిపప్పు వేడి చేస్తుంది. పెసరపప్పు చలవచేస్తుంది! మాంసానికి అసలైన ప్రత్యామ్నాయం పెసరపప్పే!
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
జనరల్‌సావో క్యాలీఫ్లవర్
కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవర్-ఒకటి (మధ్యస్తంగా ఉన్నది), క్యాప్సికమ్ - ఒకటి, మొక్కజొన్న పిండి - కప్పు, బేకింగ్ పౌడర్ - అర స్పూను, మిరియాల పొడి - కొంచెం, ఆవాలు - కొంచెం, ఉల్లికాడలు - రెండు స్పూన్లు, అల్లం, వెల్లుల్లి ముక్కలు-స్పూను, చిల్లీ సాస్ - రెండు స్పూన్లు, సోయా సాస్-స్పూను, తేనె - స్పూను, ఉప్పు, నూనె-తగినంత.
తయారుచేసే విధానం: క్యాలీఫ్లవర్‌ని వలచి, ఓ మోస్తరుగా ఉడికించాలి. ఓ ప్యాన్‌లో కాస్త నూనె వేసి గోబీ పువ్వుల్ని వేయించాలి. ఇందులో కాస్త మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, మిురియాల పొడి వేసి కలపాలి. రెండు స్పూన్ల నూనెనూ చేర్చి కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అర కప్పు నీళ్లలో మిగిలిన మొక్కజొన్న పిండిని కలపాలి. మరో ప్యాన్‌లో కాస్త నూనె వేసి అల్లం, వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ దోరగా వేగాక మొక్కజొన్న మిశ్రమాన్ని మెల్లగా కలపాలి. వేయించిన గోబీ పువ్వులు, సాస్‌లను చేర్చి, పైన ఆవాలు, ఉల్లి కాడలను వేస్తే జనరల్ సావో క్యాలీఫ్లవర్ తయారు.

అరటి కాఫీ
కావలసిన పదార్థాలు: అరటిపండు - ఒకటి, చల్లని పాలు - కప్పు, ఇన్‌స్టంట్ కాఫీ - రెండు స్పూన్లు, తేనె - స్పూను, ఐస్ ముక్కలు - కొన్ని.
తయారుచేసే విధానం: అరటి పండు, పాలు, ఐస్ ముక్కలు, తేనె కలిపి మిక్సీలో వేసి స్మూతీలా చేసిపెట్టుకోవాలి. కాఫీని వేరుగా తయారుచేసుకోవాలి. ఓ పొడవాటి గాజు గ్లాసులోకి అరటి స్మూతీని వేయాలి. దాని మీద కాఫీని వేసి, కలిపిన అరటిపండు కాఫీ వెరైటీగా బాగుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..
విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు
Read Latest Telangana News and National News