యువతకు ‘వర్క్-విజ్‌డమ్-లెగసీ’ మార్గదర్శి
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:36 AM
అత్యంత క్లిష్టమైన సమస్యలను చాలా సులువుగా పరిష్కరించగలిగిన సామర్థ్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ వైవీ రెడ్డి సొంతమని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య కొనియాడారు.

కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య
కష్టించే తత్వమే నా జీవిత సూత్రం : వైవీ రెడ్డి
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): అత్యంత క్లిష్టమైన సమస్యలను చాలా సులువుగా పరిష్కరించగలిగిన సామర్థ్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ వైవీ రెడ్డి సొంతమని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య కొనియాడారు. వైవీ రెడ్డి సంపాదకత్వంలోని ‘వర్క్-విజ్‌డమ్-లెగసీ’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం ఖైరతాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మనాభయ్య మాట్లాడుతూ.. ఈ పుస్తకంలోని వ్యాసాలు నిన్నటి తరం వ్యక్తుల జీవితాల్లోని పని సంస్కృతి, నైతిక విలువలు, సమర్థనీయత, సమష్టితత్వం, పారదర్శకత వంటి గుణాలను ఈతరానికి పరిచయం చేస్తాయన్నారు. ఈ పుస్తకం యువతరానికి అక్కరకొచ్చే ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శినిగా ఆయన అభివర్ణించారు. వైవీ రెడ్డి కుమార్తె కవితా యాగా బుగ్గన మాట్లాడుతూ... ‘‘కాలంతోపాటు పని సంస్కృతిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. మా నాన్నలా పనిని దైవంగా భావించిన వారెంతోమంది కనిపిస్తారు.
సాంకేతికపరమైన వెసులుబాట్లు పెరిగాక, వర్క్‌ఫ్రమ్ హోం లాంటి కొత్త సంస్కృతి వచ్చాక పని సంస్కృతిలో మార్పులు సహజం. ఆ మార్పుతో కలిగే ప్రతికూలతలను దృష్టిలోకి పెట్టుకొని...ఈతరానికి పని విలువను తెలియజేయాలన్న సంకల్పంతో నాన్న ఈ పుస్తకాన్ని ప్రారంభించారు. బ్యాంకింగ్, విద్య, వ్యాపార, ప్రభుత్వ, రాజకీయ రంగాల్లోని భిన్న అనుభవాలు, విభిన్న దృక్పథాలు కలిగిన 31మందిని ఎంపిక చేశారు. దేశ పరిస్థితులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపిన వారు వ్యాసాలు అందించడం అసాధారణ విషయం. నాన్న ఆరోగ్యం సహకరించకపోవడంతో నేను, మిత్రులు రవి మేనన్, షాజీ విక్రమన్ సహాయ సంపాదకులుగా వ్యవహరించాం’’ అని కవిత వివరించారు. వైవీ రెడ్డి మాట్లాడుతూ... కష్టించే తత్వమే తన జీవిత సూత్రమని, అదే తనను జీవితంలో ఉన్నత స్థాయిలో నిలిపింది అని అన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎ్‌సలు కె.సుజాతారావు, షీలా, జర్నలిస్టు లతా వెంకటేశ్, పుస్తకాన్ని ప్రచురించిన ఓరియంట్ బ్లాక్ స్వాన్ చైర్‌పర్సన్ నందినీ రావు, వైవీ రెడ్డి అల్లుడు హరి బుగ్గన, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి
కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..
భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి