Karimnagar: మద్యం తాగించి.. చెవుల్లో పురుగుల మందు పోయించి
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:04 AM
తన భర్త కనబడటం లేదంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఆపై.. ఆచూకీ కోసం వెతుకుతుండగా ఓ చోట అతడి మృతదేహం కనిపించిందంటూ పోలీసులకు చెప్పింది.
భర్తను చంపించిన భార్య
అక్రమ సంబంధమే కారణం
కరీంనగర్‌లో దారుణం
యూట్యూబ్‌లో చూసి పథకం
భార్య, ప్రియుడు, మరో వ్యక్తి అరెస్టు
కరీంనగర్ క్రైం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): తన భర్త కనబడటం లేదంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఆపై.. ఆచూకీ కోసం వెతుకుతుండగా ఓ చోట అతడి మృతదేహం కనిపించిందంటూ పోలీసులకు చెప్పింది. సహజంగానే అనుమానించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో తానే మరో ఇద్దరితో భర్తను చంపించినట్లు ఒప్పుకొంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం అని పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన ఐలవేని సంపత్ (45), రమాదేవి భార్యాభర్తలు. వీరికి ఇరవైఏళ్ల వయసు నిండిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంపత్ కరీంనగర్‌లోని గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. రమాదేవి సర్వపిండి విక్రయిస్తోంది. ఆమె వద్ద కరీంనగర్‌కే చెందిన కర్రె రాజయ్య (50) తరచూ సర్వపిండి కొనేవాడు. ఇద్దరి మధ్య ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే భర్త మద్యానికి పూర్తిగా బానిసై తనను శారీరకంగా హింసిస్తుండటం, మరో వ్యక్తితో తనకు అనుబంధం ఏర్పడటంతో సంపత్‌ను అడ్డు తొలగించుకోవాలని రమాదేవి పథకం వేసింది. ప్రియుడు రాజయ్య, తన దూరపు బంధువు కీసరి శ్రీనివాస్ (35)తో కలిసి భర్త హత్యకు పథకం వేసింది.
ఎవరి చెవుల్లోనైనా పురుగుల మందు పోస్తే ఆ వ్యక్తి చనిపోతాడనే విషయాన్ని గతంలో యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న రమాదేవి అదే పద్ధతిలో భర్తను చంపాలని రాజయ్య, శ్రీనివా్‌సకు చెప్పింది. ఆ ఇద్దరు కలిసి పార్టీ చేసుకుందాం అంటూ జూలై 29న సంపత్‌కు ఆఫర్ చేశారు. అదేరోజు బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రావాలని వారు చెప్పడంతో సంపత్ అక్కడికి వెళ్లాడు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం తాగారు. మత్తు ఎక్కువై సంపత్ తూలుతూ కింద పడిపోగానే.. రాజయ్య, శ్రీనివాస్ కలిసి అతడి చెవుల్లో అప్పటికే వెంటతెచ్చుకున్న గడ్డిమందును పోశారు. కొద్దిసేపటికి సంపత్ చనిపోయాడు. ఈ విషయాన్ని ఘటనాస్థలి నుంచే ఆ ఇద్దరు రమాదేవికి ఫోన్ చేసి చెప్పి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఆ మర్నాడు.. భర్త కనిపించడం లేదంటూ రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంపత్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ నటించారు. ఆగస్టు 1న మృతదేహాన్ని గుర్తించినట్లు వారే పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే.. భర్త మృతికి కారణం ఏమిటి? అని తెలుసుకునేందుకు ప్రయత్నించాల్సింది పోయి మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దంటూ ఆమె ప్రాథేయపడటంతో పోలీసులు అనుమానించారు. రమాదేవి కాల్‌డేటా, ఫోన్ లొకేషన్, సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి.. ఆమెను, రాజయ్య, శ్రీనివా్‌సను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో తామే హత్యచేసినట్లు అంగీకరించారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News