Share News

High Court: వాట్సాప్‌ సందేశాల ఆధారంగా అట్రాసిటీ కేసు చెల్లదు

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:05 AM

వాట్సాప్‌, ఈ మెయిల్‌ వంటి ప్రైవేటు సందేశాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది..

High Court: వాట్సాప్‌ సందేశాల ఆధారంగా అట్రాసిటీ కేసు చెల్లదు

  • బహిరంగంగా దూషిస్తేనే కేసు: హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): వాట్సాప్‌, ఈ-మెయిల్‌ వంటి ప్రైవేటు సందేశాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. అవమానించే ఉద్దేశంతో అందరి ముందు బహిరంగంగా కులం పేరుతో దూషించినప్పుడు మాత్రమే ఆ కేసు వర్తిస్తుందని పేర్కొంది. కులాంతర వివాహం చేసుకున్న క్రాంతికిరణ్‌ (ఎస్సీ), నిరుపమ దాడి(ఓసీ) తర్వాత పొరపొచ్చాలు రావడంతో వైవాహిక బంధం నుంచి విడిపోయారు. విడాకులు కావాలని బెదిరించడంతోపాటు సందేశాల ద్వారా కులం పేరుతో దూషించారని క్రాంతికిరణ్‌ ఫిర్యాదు చేయడంతో నిరుపమ, వారి కుటుంబసభ్యులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టివేయాలని నిరుపమ కుటుంబ సభ్యులు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఇ.వి. వేణుగోపాల్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కుటుంబ వివాదంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు వర్తించవని పేర్కొన్నారు. ఫిర్యాదుదారు క్రాంతి తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎస్సీ పేరుతో ఎలా దూషించారు? ఎలా అవమానించారనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం... కులం పేరుతో దూషించడం బహిరంగంగా జరిగినట్లు ఆధారాలు లేవని, ఇది కుటుంబ వివాదం మాత్రమేనని అభిప్రాయపడింది. కుటుంబ వివాదంలో ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసును కొనసాగించడం చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయడం కిందకే వస్తుందని పేర్కొంటూ పిటిషనర్లపై కేసును కొట్టేసింది.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 03:05 AM