Share News

సాదా బైనామాలకు రైట్‌ రైట్‌..

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:40 AM

సాదా బైనామాలకు అడ్డంకులు తొలిగాయి. ఐదున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీవో స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతో పాటు ప్రభుత్వం సాదా బైనామాల పరిష్కారంపై విధివిదానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్‌ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

సాదా బైనామాలకు రైట్‌  రైట్‌..

  • ఐదున్నరేళ్ల రైతుల ఎదురుచూపులకు తెర

  • హైకోర్టు తీర్పుతో క్రమబద్ధీకరణకు మార్గం సుగమం

  • గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020లో తెచ్చిన జీవో 112పై హైకోర్టులో కేసు

  • పాత చట్టం స్థానంలో కొత్తగా భూ భారతిచట్టం రావటంతో తొలిగిన అడ్డంకులు

  • క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం అర్హులకు పట్టాదార్‌ పాస్‌బుక్‌లు

  • భూ భారతి సదస్సుల్లో భారీగా దరఖాస్తులు

  • ఉమ్మడి జిల్లాలో 1,66,784 దరఖాస్తులకు కలగనున్న మోక్షం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ : సాదా బైనామాలకు అడ్డంకులు తొలిగాయి. ఐదున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీవో స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతో పాటు ప్రభుత్వం సాదా బైనామాల పరిష్కారంపై విధివిదానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్‌ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2020 నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 1,66,784దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, కొత్తగా ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లోనూ భారీగా సైదాబైనామా దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌తో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాదాబైనామాలకు మోక్షం కలుగుతుందనే ఆనందంలో అన్నదాతలు ఉన్నారు.

కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది సాదాబైనామాలు. దీంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాదాబైనామాల సమస్య పరిష్కరించేందుకు 2016లో జీవో నెం.153ను తీసుకవచ్చింది. 2014 జూన్‌ 2వ తేదీకి ముందుగా సాదాబైనామాలతో భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి చట్టబద్దత కల్పించాలని నిర్ణయించారు. 12 అక్టోబరు 2020లో కూడా జీవో నెంబరు 112ను జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిన సాదాబైనామాల ప్రక్రియ ముందుకు సాగలేదు. సాదాబైనామాల సమస్య పరిష్కారం కాకుండానే 29 అక్టోబరు 2020లో జీవో నెంబరు 112ద్వారా కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాల చట్టాన్ని తెచ్చింది. అయితే ఈ జీవోను సవాల్‌ చేస్తూ నిర్మల్‌కు చెందిన షిండే దేవిదాస్‌ హైకోర్టులో పిల్‌ దాఖాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జీవో అమలును నిలిపివేస్తూ 2020 నవంబరు 11న మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం సాదాబైనామాలకు చట్టబద్దత కల్పిస్తుందనే ఆశతో అప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 1,377 రెవెన్యూ గ్రామాల నుంచి 1,66,784మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో వరంగల్‌ జిల్లాలో 26,630 పెండింగ్‌ సాదాబైనామాలు ఉండగా, హనుమకొండ జిల్లాలో 27,057 దరఖాస్తులు, జనగామ జిల్లాలో 10,350 దరఖాస్తులు, మహబూబాబాద్‌ జిల్లాలో 31,250 దరఖాస్తులు, ములుగు జిల్లాలో 20,150 దరఖాస్తులు, భూపాలపల్లి జిల్లాలో 51,347 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు ఇటీవల నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో కూడా భారీగా సాదాబైనామా దరఖాస్తులు వచ్చాయి.

భూ భారతితో లైన్‌ క్లియర్‌

రైతాంగం భూ హక్కుల కోసం కార్యాలయాల చుట్టు తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావటం లేదు. 2020లో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు భూ హక్కులను కల్పించే పట్టాదారు పాసు పుస్తకాల చట్టం- 1971ని రద్దు చేసి కొత్తగా పాసుపుస్తకాల చట్టం-2020 ధరణిని తీసుకవచ్చింది. అయితే కొత్త చట్టం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించేందుకు గత ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించిన దాఖాలాలు లేవు. దీంతో సాదాబైనామాలతో పాటు అసైన్డ్‌ భూముల సమస్యల పరిష్కారానికి ధరణిలో ఏలాంటి మార్గాలను చూపించలేదు. దీంతో పాటు గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేయటంతో రైతుల కష్టాలు మరింతా పెరిగాయి.

రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒక్కటి సాదాబైనామా. గతంలో చాలమంది రైతులు తెల్లకాగితాలపై, రెవెన్యూ స్టాంపు పేపర్లుపై భూములు క్రయవిక్రయాలు చేశారు. ఇవీ అధికారికం కాకపోవటంతో వీటికి రిజిస్ర్టేషన్లు జరగలేదు. ఫలితంగా బ్యాంకుల్లో వీరికి రుణాలు కూడా అందటం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల సమస్యల పరిష్కారంపై ఫోకస్‌ చేసింది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో రెవెన్యూ గ్రామ సదస్సులను ప్రభుత్వం నిర్వహించింది. ఈ సదస్సుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే దరఖాస్తులు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు మరోసారి భూభారతి సదస్సులో దరఖాస్తులు చేశారు. దీంతో ప్రభుత్వం హైకోర్టును అశ్రయించి, సాదాబైనామాలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. దీంతో గత ప్రభుత్వం తీసుకవచ్చిన 112జీవో స్థానంలో కొత్తగా భూ భారతి చట్టం తీసుకవచ్చిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు కోర్టు విచారణ అనంతరం సాదాబైనామాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

క్షేత్రస్థాయిలో పరిశీలన తరవాతే..

కుప్పలు, తెప్పలుగా సాదాబైనామాల దరఖాస్తులు వస్తుండటంతో ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రకారం పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12ఏళ్ల పాటు భూమి స్వాధీనంలో ఉండి, ప్రభుత్వం నిర్ధేశించినట్టుగా రాతపూర్వకంగా ఒప్పందం ఉంటే సాదా బైనామాలు చెల్లుతాయని ప్రభుత్వం ఇటీవల కోర్టుకు విన్నవించింది. దీంతో పాటు గతంలో సాదా బైనామాల కోసం ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 1,66,784 దరఖాస్తుల్లో ఎన్ని అర్హతలను కలిగి ఉన్నాయో కూడా అధికారులు గుర్తించనున్నారు. రైతుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత కలిగిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలనతో పాటు పంచాయతీ కార్యాలయంలో నోటీస్‌ బోర్టులో వివరాలను అంటించి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అన్ని రకాల పరిశీలన తరువాతే అర్హులను గుర్తించి పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందించేందుకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - Aug 29 , 2025 | 12:40 AM