Local Body Elections: పంచాయతీ పరీక్ష
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:00 AM
జనగామ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు సవాలుగా మారాయి. ఎక్కువ స్థానాలు గెలుచుకుని తమ సత్తా చాటుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు శ్రమిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జిల వ్యూహాలతో ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది.
ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు తంటాలు ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాలని ఆరాటం
అధిక స్థానాలు గెలుపించుకుని పట్టు నిలుపుకోవాలని ఎత్తులు
అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వాలపై నిత్యం ఆరా..
'ఆర్థిక' సహకారానికి వెనుకాడని పరిస్థితి
సవాల్‌గా మారిన సర్పంచ్ ఎన్నికలు
జనగామ, డిసెంబరు 7 (ఆంద్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని తమ సత్తా ఏంటో చూపాలన్న ఆలోచనలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు. సర్పంచి అభ్యర్ధులను గెలిపించుకోవడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులకు సైతం తామేంటో చూపించాలన్న ఆలోచనలో ఉన్నారు. జిల్లాలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య 'పంచాయతీ' ఎన్నికలు మరింత హీటెక్కుస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంటుంది. వీటితో పాటు బీజేపీ, సీపీఎం, సీపీఐలు తమ ఉనికిని చాటాలని భావిస్తున్నాయి.
నేతలకు పెద్ద సవాలే..
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు పెద్ద సవాల్‌గా మారనున్నాయి. జిల్లాలో జనగామ, స్టేషన్ ఘన్‌పుర్, పాలకుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. జనగామ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జనగామలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్‌కు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంఛార్జిలుగా ఉన్నారు. అలాగే స్టేషన్‌ఘన్‌పుర్‌లో కాంగ్రెస్‌కు కడియం శ్రీహరి, బీఆర్ఎస్‌కు తాటికొండ రాజయ్య ఇంఛార్జిలుగా ఉన్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ వ్యవహారాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు ఆమె అత్త హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి చూస్తుండగా బీఆర్ఎస్ ఇంఛార్జిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూడు నియోజకవర్గాల్లో పంచాయతీ పోరు రసవత్తరంగా మారనుంది. ఎవరికి వారు ప్రత్యర్థులు బలమైన వారు కావడంతో ఎమ్మెల్యేలు, ఇంఛార్జిలకు పంచాయతీ ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి.
సత్తా చాటాలని ఆరాటం
పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ఎక్కువ స్థానాల్లో గెలిపించుకోవాలని ఆయా పార్టీల నేతలు ఆరాటపడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వంలోనూ అభ్యర్థికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ప్రత్యర్థి ఎత్తులు దానికి తగ్గ పై ఎత్తులపై మండల స్థాయి నేతల ద్వారా అభ్యర్ధులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలు గెలిచి తమ సత్తా చూపాలని ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి భావిస్తున్నారు. ఇటీవలే డీసీసీ మార్పు నేపథ్యంలో ఈ ఎన్నికలను కొమ్మూరి మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ వారం వివిధ కార్యక్రమాలు 8 12 2025
ఏడాదిలో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే