Hyderabad: వెల్జన్ ఇండస్ట్రీస్ అధినేత వీసీ జనార్దన్ రావు హత్య
ABN , Publish Date - Feb 10 , 2025 | 05:05 AM
వెల్జన్ గ్రూపు ఆఫ్ ఇండస్ర్టీస్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు(85) హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదంలో జరిగిన ఘర్షణలో ఆయన మనవడు కీర్తితేజ(29)నే ఆయనపై కత్తితో దాడి చేసి హతమార్చాడు.

ఆస్తి వివాదంలో మనవడి ఘాతుకం.. ఉన్మాదిలా మారి కత్తితో దాడి
70కి పైగా కత్తిపోట్లకు గురై జనార్దన్‌రావు మరణం
పోలీసుల అదుపులో నిందితుడు కీర్తితేజ
జనార్దన్ రావు రతన్‌టాటా సహాధ్యాయి
వ్యాపారవేత్త, వితరణశీలిగా ప్రఖ్యాతి
గుప్త దానాలు, సేవా కార్యక్రమాలు
పంజాగుట్ట, హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్, దెందులూరు, బాలానగర్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): వెల్జన్ గ్రూపు ఆఫ్ ఇండస్ర్టీస్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు(85) హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదంలో జరిగిన ఘర్షణలో ఆయన మనవడు కీర్తితేజ(29)నే ఆయనపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. గురువారం రాత్రి ఆయన నివాసంలోనే ఈ దారుణం జరిగింది. ఏపీలోని ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామానికి చెందిన జనార్దనరావు.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రముఖ పారిశ్రామివేత్త రతన్‌టాటాకు సహాద్యాయి అయిన వీసీ జనార్దన్ రావు 1969లో హైదరాబాద్‌లోని బాలానగర్‌లో వెల్జన్ పరిశ్రమలను స్థాపించారు. వెల్జన్ గ్రూపులో మొత్తం 16 పరిశ్రమలు ఉండగా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. బేగంపేటలో నివాసముండే జనార్దన్‌రావుకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు వెలమాటి గంగాధర్ శ్రీనివాస్ జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. రెండో కూతురు సరోజిని దేవి భర్తతో విబేధాలు రావడంతో కొంతకాలంగా తండ్రితోనే ఉంటున్నారు.
సరోజిని దేవి కుమారుడు కిలారు కీర్తి తేజ విదేశాల్లో ఉన్నత విద్య అనంతరం 2018 నుంచి మణికొండలో నివాసముంటున్నాడు. ఆస్తి, హోదా, వ్యాపారాల్లో గుర్తింపు విషయాల్లో కీర్తితేజ కొంతకాలంగా తాత, తల్లితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీ రాత్రి జనార్దన్ రావు ఇంటికి వచ్చిన కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో జనార్దన్‌రావును ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. జనార్దన్ రావు మెడపైనే 16 సార్లు వరకు పొడిచిన కీర్తితేజ.. మొత్తం 70కి పైగా కత్తిపోట్లు పొడిచాడు. దాడిని అడ్డుకోబోయిన తల్లి సరోజిని దేవిని దాదాపు 10 సార్లు పొడిచాడు. జనార్దన్‌రావు అక్కడికక్కడే మరణించగా సరోజిని దేవి ఆస్పత్రిపాలయ్యారు. కీర్తితేజను పోలీసులు ఎనిమిదో తేదీన అరెస్టు చేశారు. కీర్తితేజ మానసిక ఆరోగ్యంపై అనుమానాలు ఉండడంతో పోలీసులు మానసిక వైద్యుల అభిప్రాయం తీసుకుంటున్నారు. అలాగే మాదకద్రవ్యాలకు బానిస.. అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కీర్తితేజ గత ఏడాది జూన్‌లో సోమాజీగూడ పార్క్ హోటల్‌లో పిటా కేసులో పోలీసులకు దొరికాడు. కాగా, వీసీ జనార్దన్ రావు అంత్యక్రియలు పంజాగుట్ట మహాప్రస్థానంలో ఆదివారం పూర్తయ్యాయి. పలువురు పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ఆయనకు నివాళులర్పించారు.
గుప్త దాత, వితరణశీలి, ఆదర్శప్రాయుడు
రతన్‌టాటా సహాధ్యాయి అయిన వీసీ జనార్దన్ రావు.. సేవ కార్యక్రమాల్లోనూ రతన్‌టాటాను మరిపించారు. కోట్ల రూపాయాలను సేవా కార్యక్రమాలకు వెచ్చించారు. కానీ, తాను చేసిన సాయం రెండో కంటికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి పలు దఫాలుగా నగదు అందించారు. భక్తుల భోజన వసతుల అభివృద్ధికి టీటీడీకి రూ.50 కోట్లు, స్వగ్రామం కొవ్వలిలోని జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి రూ.5 కోట్లు అందించారు. అంతేకాక కొవ్వలిలో పశువుల ఆసుపత్రి, బీసీ హాస్టల్ అభివృద్ధితో పాటు ఆలయాన్ని కూడా నిర్మించారు. ఏపీ, తెలంగాణలోని పలు దేవాలయాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు రూ.8కోట్లు వరకు విరాళాలు ఇచ్చారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి, గతేడాది విజయవాడకు వరదలు వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వానికి విరాళాలు అందజేశారు. వైజాగ్, విజయవాడలోని అనాఽథ ఆశ్రమాల్లో అన్నదానానికి ఏటా రూ.30 లక్షలు ఇస్తున్నారు. తన సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికుల పిల్లల చదువులకు అవసరమైన ఆర్థిక సాయం చేసేవారు. ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లో తన తల్లి పేరిట ఓ బ్లాక్ ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..