Share News

Uttam: ఊళ్లు కొట్టుకుపోతే బాధ్యులెవరు?

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:19 AM

కన్నెపల్లి నుంచి నీళ్లను ఎందుకు ఎత్తిపోయడం లేదని బీఆర్‌ఎస్‌ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నారని.. ఇప్పటికే కుంగిపోయిన బ్యారేజీలు కూలిపోయి ఊళ్లు కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు.

Uttam: ఊళ్లు కొట్టుకుపోతే బాధ్యులెవరు?

  • ‘కాళేశ్వరం’ బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఎ్‌సఏ తేల్చింది

  • నీళ్లు నింపవద్దని హెచ్చరించింది

  • కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయడం లేదేమని బీఆర్‌ఎస్‌ నేతలడుగుతున్నారు

  • నీళ్లు నింపితే 44 గ్రామాలు, సమ్మక్క బ్యారేజీ కొట్టుకుపోతాయి

  • పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కన్నెపల్లి నుంచి నీళ్లను ఎందుకు ఎత్తిపోయడం లేదని బీఆర్‌ఎస్‌ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నారని.. ఇప్పటికే కుంగిపోయిన బ్యారేజీలు కూలిపోయి ఊళ్లు కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని.. వాటిలో నీళ్లు నింపవద్దని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎ్‌సఏ) హెచ్చరించిందని గుర్తు చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు నింపితే అవి కూలిపోయి నది వెంట ఉన్న 44 గ్రామాలతోపాటు సమ్మక్కసాగర్‌ బ్యారేజీ కొట్టుకుపోతుందని... భద్రాచలం ఆలయం, పట్టణం ప్రమాదంలో పడతాయని వివరించారు. ఏపీ కృష్ణా జలాల అక్రమ తరలింపు, కాళేశ్వరం బ్యారేజీల అంశంపై బుధవారం ప్రజాభవన్‌లో ఉత్తమ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రూ.38 వేల కోట్ల అంచనాలతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో పక్కనపెట్టి రూ.లక్షన్నర కోట్ల ఖర్చయ్యే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని ఉత్తమ్‌ ఆరోపించారు. డిజైన్‌, నిర్మాణం, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు వైఫల్యం చెందాయని ఆరోపించారు. ఈ బ్యారేజీల విషయంలో ఎన్డీడీఎ్‌సఏ నివేదిక ప్రకారమే ముందుకెళతామన్నారు. భారీగా వ్యయం చేసినందున ప్రాజెక్టును వినియోగించుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు.


కృష్ణా జలాల్లో అన్యాయం

ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే బీఆర్‌ఎస్‌ పాలనలోనే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి ఏపీ అక్రమ నీటి తరలింపు.. రోజుకు 47,850 క్యూసెక్కుల (4.1టీఎంసీలు) నుంచి 1,11,400 క్యూసెక్కుల (9.6 టీఎంసీలు)కు పెరిగిందని ఉత్తమ్‌ ఆరోపించారు. 2019 మే, 2020 జనవరి, జూన్‌లలో నాటి ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జరిపిన భేటీల ఫలితమే ఇదని పేర్కొన్నారు. 2004-14 మధ్య ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి బేసిన్‌ వెలుపలి ప్రాంతాలకు 727 టీఎంసీల కృష్ణా జలాలు తరలించుకుపోతే.. బీఆర్‌ఎస్‌ పాలనలో 2014-2023 మధ్య ఏకంగా 1,200 టీఎంసీలు తరలించుకుపోయారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక 2024-25లో అత్యధికంగా 286 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించామని, గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనతో పోల్చితే ఇదే అత్యధికమని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం 44వేల నుంచి 92,000 క్యూసెక్కులకు, మల్యాల లిఫ్టు సామర్థ్యం 3,850 నుంచి 6,000 క్యూసెక్కులకు, ముచ్చుమర్రి లిఫ్టు సామర్థ్యం 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెరిగాయని చెప్పారు. 811 టీఎంసీల్లో.. తెలంగాణకు 299 టీఎంసీలు (34శాతం) సరిపోతాయని.. ఏపీకి 512 టీఎంసీలు (66శాతం) ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు లిఖితపూర్వకంగా సమ్మతి తెలిపిందని ఉత్తమ్‌ గుర్తుచేశారు. శ్రీశైలం జలాశయంలో 797 అడుగుల లోతు నుంచీ నీళ్లను తరలించుకుపోవడానికి ఏపీ చేపట్టిన రాయలసీమ పథకాన్ని అడ్డుకోకుండా కేసీఆర్‌ సహకారం అందించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ తొలి విడత ప్రభుత్వంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు.


మసిపూసి మారేడు కాయ చేసే యత్నం: భట్టి

బీఆర్‌ఎస్‌ నేతలు గోదావరి, కృష్ణా జలాలపై అబద్ధాలు చెబుతూ మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. పాత ప్రాజెక్టులను పూర్తి చేయకుండా బీఆర్‌ఎస్‌ ద్రోహం చేసిందని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గోదావరిలో ప్రాజెక్టులన్నీ కట్టి ఉంటే బనకచర్ల వివాదం వచ్చేది కాదన్నారు. కాళేశ్వరంలో అవినీతి, కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులంతా బుక్‌లెట్‌ రూపంలో ప్రజలకు చేరవేయాలని సూచించారు.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 03:19 AM