Share News

ఉత్తమ్‌తో కృష్ణా బోర్డు చైర్మన్‌ సమావేశం

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:10 AM

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ గురువారం జలసౌధలో భేటీ అయ్యారు.

ఉత్తమ్‌తో కృష్ణా బోర్డు చైర్మన్‌ సమావేశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ గురువారం జలసౌధలో భేటీ అయ్యారు. జూలై దాకా తమకు సాగు, తాగు నీటి అవసరాలు ఉన్న దృష్ట్యా శ్రీశైలం, సాగర్‌ నుంచి జలాలను తరలించకుండా ఏపీని అడ్డుకోవాలని ఈ సందర్భంగా ఉత్తమ్‌ కోరారు. దాంతో ఈ అంశంపై చర్చించడానికి శుక్రవారం ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు అతుల్‌ జైన్‌ మంత్రికి తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో మిగిలి ఉన్న నీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాల అధికారులతో చర్చించడానికి కేఆర్‌ఎంబీ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహించనుంది.


ఇక కృష్ణా బేసిన్‌లో ప్రస్తుత నీటి సంవత్సరంలో 1,010.134 టీఎంసీల జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 639 టీఎంసీలను ఏపీ తరలించగా.. 211.691 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది. తాత్కాలిక నీటి సర్దుబాటు ప్రకారం ఏపీకి 666.68 టీఎంసీలు, తెలంగాణకు 343.44 టీఎంసీల వాటా ఉంటుందని బోర్డు గుర్తు చేసిన విషయం విదితమే. ఈ లెక్కన ఏపీ కోటాలో 27.03 టీఎంసీలు మిగిలి ఉన్నాయి. తెలంగాణ కోటా కింద 131.75 టీఎంసీలు ఉన్నాయని బోర్డు తేల్చింది.

Updated Date - Feb 21 , 2025 | 04:10 AM