Share News

Uttam Kumar Reddy: కేసీఆర్‌పై చర్యలు చేపట్టేందుకు సర్కారుకు స్వేచ్ఛ ఉంది

ABN , Publish Date - Sep 01 , 2025 | 03:45 AM

గత ప్రభుత్వంలో బాధ్యతా రహితంగా నిర్మించిన కాళేశ్వరం తప్పిదాలకు నాటి సీఎం కేసీఆరే బాధ్యులని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Uttam Kumar Reddy: కేసీఆర్‌పై చర్యలు  చేపట్టేందుకు సర్కారుకు స్వేచ్ఛ ఉంది

  • కాళేశ్వరం అతిపెద్ద మానవ తప్పిదం

  • లక్ష ఎకరాలకూ నీళ్లివ్వలేదు: ఉత్తమ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో బాధ్యతా రహితంగా నిర్మించిన కాళేశ్వరం తప్పిదాలకు నాటి సీఎం కేసీఆరే బాధ్యులని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సూచనలను పట్టించుకోకుండా అక్రమంగా, అసంబద్ధంగా కాళేశ్వరం కట్టారని పీసీ ఘోష్‌ కమిషన్‌ తేల్చిందని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంతో రాష్ట్రానికి భారీగా ఆర్థిక నష్టం జరిగిందని, అక్రమాలకు పూర్తిబాధ్యత కేసీఆర్‌దేనని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సూచించిందని తెలిపారు. కేసీఆర్‌పై చట్టప్రకారం తగిన చర్యలు చేపట్టే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ఆదివారం శాసనసభలో ఆయన మాట్లాడారు. ‘‘సీడబ్ల్యుసీ అనుమతి లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టినట్లు నివేదికలో ఉంది. కేసీఆర్‌ చెప్పినట్లే చేశామని అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్టర్లకు మేలు చేయడానికే పనులు అప్పగించారు. అప్పటి నేతలతోపాటు అధికారులు, ఇంజనీర్లు ఎవరెవరు బాధ్యులో కూడా కమిషన్‌ స్పష్టం చేసింది. 666 పేజీల కమిషన్‌ నివేదికను అసెంబ్లీ ముందుంచాం. సభ్యుల అభిప్రాయాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సీఎం రేవంత్‌ ప్రకటిస్తారు’’ అని ఉత్తమ్‌ తెలిపారు.


కాళేశ్వరం అతిపెద్ద మానవతప్పిదం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ తప్పిదమని ఉత్తమ్‌ విమర్శించారు. కాళేశ్వరానికి గుండెకాయలాంటి మేడిగడ్డ కూలడంతో రూ.21 వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని ఆరోపించారు. 20 నెలలుగా అన్నారం సుందిళ్ల, మేడిగడ్డ నిరుపయోగంగా మారాయన్నారు. ప్రాణహిత-చేవెళ్లను 2013లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిందని.. 2014నాటికి రూ.11 వేలకోట్లు ఖర్చుపెట్టారని ఉత్తమ్‌ గుర్తు చేశారు. రూ.38,500కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్లను అకారణంగా మార్చి కాళేశ్వరం చేపట్టారని తెలిపారు. ఏడాదికి 195 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పి.. ఐదేళ్లలో 125 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారన్నారు. లక్ష కోట్లు ఖర్చుచేసినా ఐదేళ్లలో వాడుకున్న నీళ్లు 101 టీఎంసీలేనని, స్వతంత్ర దేశంలో ఇదో పెద్ద ఆర్థిక నష్టమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నిర్వహణ పెనుభారంగా మారిందని, విద్యుత్‌ శాఖకు రూ.9,735కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు. బీఆర్‌ఎస్‌ కట్టిన ప్రాజెక్టు వారి హయాంలోనే కూలడంతో.. ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తప్పు చేసిన వారెవరైనా సిగ్గుపడతారని, కానీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దబాయిస్తున్నారని విమర్శించారు.


ఇవి కూడా చదవండి

లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌‌మీట్

మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..

Updated Date - Sep 01 , 2025 | 03:45 AM