Agriculture Supply: ధర కాసింత.. చల్లుడు కొండంత!
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:54 AM
దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోవడానికి తోడు.. విదేశాల నుంచి దిగుమతులూ తగ్గడంతో యూరియాకు కొరత ఏర్పడిన మాట వాస్తవమే. అయితే రైతుల తీరూ ఈ కొరతకు కారణమే అనిపిస్తోంది.
అవసరానికి మించి యూరియా వినియోగం
డీఏపీ, కాంప్లెక్స్ ధరలతో పోలిస్తే చవక
నిరుటికన్నా బాగా పెరిగిన అమ్మకాలు
అదును దాటాక చల్లినా దండగే!
యూరియా దొరక్క రైతుల్లో నిర్వేదం
ఆగ్రహంతో ఆందోళనలు.. రాస్తారోకోలు
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోవడానికి తోడు.. విదేశాల నుంచి దిగుమతులూ తగ్గడంతో యూరియాకు కొరత ఏర్పడిన మాట వాస్తవమే. అయితే రైతుల తీరూ ఈ కొరతకు కారణమే అనిపిస్తోంది. వేసిన పంటలకు మోతాదుకు మించి ఇష్టారీతిన చల్లటం, భవిష్యత్తు అవసరాల కోసం బస్తాలకు బస్తాలు నిల్వ చేసి పెట్టుకోవడం, డీఏపీ, కాంప్లెక్ ఎరువుల ధరతో పోలిస్తే తక్కువ ధరకే లభ్యమవుతున్న కారణంగా అన్నదాతలు యూరియావైపే మొగ్గుచూపుతుండటంతో అది బంగారమవుతోంది. పైగా వ్యవసాయేతర అవసరాలకూ యూరియాను మళ్లించడం, సరుకును వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించడంతోనూ సాగు అవసరాల కోసం యూరియాకు తీవ్ర కొరత ఏర్పడింది. ఆశ్చర్యం ఏమిటంటే.. వచ్చే యాసంగి సీజన్‌లో సాగుచేసే పంటలకోసం కూడా కొందరు రైతులు యూరియా బస్తాలు కొనుగోలుచేసి నిల్వచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇందుకే యూరియా వైపు మొగ్గు
45 కిలోల యూరియా బస్తా వాస్తవ ధర రూ.2,234. కేంద్ర ప్రభుత్వం 1,967 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. అంటే.. రైతులకు ఒక్కో బస్తా రూ.266 మాత్రమే పడుతోంది. దీనితో పోల్చితే కాంప్లెక్స్ ఎరువుల ధరలు భిన్నం. సబ్సిడీ పోనూ డీఏపీ బస్తా ధర రూ.1,360 పడుతోంది. అలాగే.. ఎంవోపీ, 14-35-14, 28-28-0 బస్తాలు రూ.1,800 చొప్పున ఇస్తున్నారు. 20-20-0-13 బస్తా ధర రూ. 1,500 ఉండగా, ఎస్‌ఎ్‌సపీ ధర రూ.650గా ఉంది. వీటిలో ఏ కాంప్లెక్స్ ఎరువుల ధరలు చూసినా యూరియా కన్నా ఎక్కువే. వాస్తవానికి ఒక ఫార్ములాతో తయరుచేసిన ఎరువుకు మరొక ఫార్ములాతో తయారుచేసిన ఎరువు ప్రత్యామ్నాయం కానే కాదు. రైతులు మాత్రం ఎక్కువ ధరకు దొరికే కాంప్లెక్స్ ఎరువులకు బదులుగా తక్కువ ధరకు లభ్యమయ్యే యూరియాను కొని పంటలకు గుప్పుతున్నారు. సబ్సిడీ ఎక్కువగా ఉండటంతో రైతులు ఎగబడి యూరియా కొంటున్నారు. ఫలితంగానే యూరియా వాడకం గణనీయంగా పెరిగింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సిఫారసు మేరకు... ఎకరం వరికి 45 కిలోల బస్తాలు 2 వేస్తే చాలు. రైతులు మాత్రం ఎకరం వరి పొలానికి 3 నుంచి 4 బస్తాలు వేస్తున్నారు. పత్తికి ఎకరానికి 2 నుంచి 3 బస్తాలు సరిపోతాయి. కానీ నాలుగైదు బస్తాలు గుప్పుతున్నారు. మొక్కజొన్నకు 3 నుంచి 4 బస్తాలు వేస్తే అదే ఎక్కువ... కానీ 8 బస్తాల నుంచి 10 బస్తాల వరకు వేస్తున్నారు. ఈ క్రమంలో మొక్కజొన్న విస్తీర్ణం పెరగటంమూ యూరియా కొరతకు ప్రధాన కారణం అవవుతోంది. అవసరానికి మించి యూరియా గుప్పుతుండటంతో ఎంత సరఫరాచేసినా కొరత ఏర్పడుతోంది.
నిరుటి కన్నా ఎక్కువ సరఫరా
ఈ వానాకాలం పంటలకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అని వ్యవసాయశాఖ ప్రణాళికలో పేర్కొంది. ఇప్పటివరకు (సెప్టెంబరు 8వ తేదీ నాటికి) 8.23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. నిరుడు ఇదే సమయానికి 8.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకం జరిగింది. నిరుటితో పోలిస్తే ఎక్కువ సరఫరా చేసినప్పటికీ ఇంకా క్షేత్రస్థాయిలో యూరియా కొరత ఉంది. 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. ఒక్క సెప్టెంబరు మొదటివారంలోనే 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చింది. ప్రతిరోజు 10 వేల టన్నుల చొప్పున 2 లక్షల టన్నుల యూరియా వస్తోందని మంత్రి తుమ్మల చెబుతున్నారు. సీఎం, తుమ్మల కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కావటంలేదు. నిరుడు బఫర్ స్టాక్ 3.52 లక్షల టన్నులు ఉండగా ఈసారి కేవలం 25 వేల టన్నులే ఉండటం కూడా సమస్యగా పరిణమించింది. పంట సీజన్ ప్రారంభంలోనే గతంలో 4-5 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ పెట్టేవారు. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభ నిల్వ కేవలం 1.92 లక్షల మెట్రిక్ టన్నులే ఉండటంతో సరఫరాలో తేడా వచ్చింది. దీనికితోడు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 2.11 లక్షల టన్నుల యూరియా కేంద్రం నుంచి రాష్ట్రానికి రాలేదు.
బ్లాక్‌తో మరింత సమస్య
యూరియా కొరతకు కొంత కారణం రైతులైతే... డీలర్లు, వ్యాపారులు, వ్యవసాయశాఖ అధికారులు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యాపారులు, అధికారులు మిలాఖత్ అయిపోయి... యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్లాక్ మార్కెట్‌కు తరలించిన యూరియాను పట్టుకోవటంలో విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు విఫలమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాక్షాత్తూ మంత్రి తుమ్మల ఆదేశాలు జారీచేసినా ఇంతవరకు బ్లాక్ మార్కెట్‌కు తరలించిన యూరియా నిల్వలను సీజ్ చేయలేదు. రాష్ట్రానికి వచ్చే యూరియా రేక్‌లో 60 శాతం ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాలకు, 40 శాతం ప్రైవేటు డీలర్లకు కేటాయిస్తున్నారు. యూరియాను సక్రమంగా పంపిణీ చేయటంలో పీఏసీఎస్ సిబ్బంది పలు చోట్ల విఫలమవుతుండా, ప్రైవేటు డీలర్లు మాత్రం అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో యూరియా అమ్ముకుంటున్నారు.
రసాయన పరిశ్రమల్లో వాడకం
వ్యవసాయరంగంలోనే కాకుండా పరిశ్రమ, వైద్య, ఇంధన, రసాయనరంగాల్లోనూ యూరియాను విరివిగా వినియోగిస్తున్నారు. రసాయన పరిశ్రమల్లో... ఫ్లాస్టిక్స్, ఫార్మాల్డిహైడ్ రెసిన్, ఎక్స్‌ప్లోసివ్స్ తయారీలో యూరియా వాడుతున్నారు. టెక్స్‌టైల్ పరిశ్రమలో బట్టల రంగులు బాగా పట్టుబడేందుకు ఉపయోగిస్తున్నారు. ఫార్మారంగంలో క్రీములు, చర్మానికి సంబంధించిన ఉత్పత్తుల్లో యూరియా వాడుతున్నారు. కొన్ని మందుల తయారీలో కూడా వాడుతున్నారు. పెట్రోకెమికల్స్‌లో డీజిల్ వాహనాల్లో వాడే ‘ఆడ్ బ్లూ’ తయారీలో యూరియా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల అధికారులను అప్రమత్తం చేశారు. పరిశ్రమలను తనిఖీచేయాలని, యూరియా నిల్వలు ఎక్కడైనా ఉంటే సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎరువుల ధరల పట్టిక (రూ.లలో)
ఎరువు పేరు అసలు ధర సబ్సిడీ అమ్మకపు ధర
యూరియా 2,234 1,967 266.50
డీఏపీ 2,740 1,390 1,350
14.35.14 2,881 1,081 1,800
20.20.0.13 2,383 883 1,500
28.28.0 3,013 1,033 1,800
ఎంవోపీ 1,871 71.40 1,800
ఎస్‌ఎ్‌సపీ 1,013 363 650
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి