Unseasonal Rain: అకాల వర్షం.. తీరని నష్టం
ABN , Publish Date - May 05 , 2025 | 04:17 AM
రాష్ట్రంలో విభన్న వాతావరణం కొనసాగుతోంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొట్టగా.. కొన్ని జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత వర్షం బీభత్సం సృష్టించింది.
పలు జిల్లాల్లో వాన, ఈదురుగాలుల బీభత్సం
కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం
కూలిన చెట్లు, స్తంభాలు.. నేలరాలిన మామిడి
సిద్దిపేటలో టోల్‌ప్లాజా పైకప్పు రేకులు కూలి కౌంటర్లు ధ్వంసం.. గంటపైగా ట్రాఫిక్ జామ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలో విభన్న వాతావరణం కొనసాగుతోంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొట్టగా.. కొన్ని జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. పలు జిల్లాల్లో పంట నష్టం వాటిల్లగా రహదారులపైన, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల తదితర జిల్లాల రైతులను అకాల వర్షం దెబ్బ తీసింది. సిద్దిపేట జిల్లాలో ఆదివారం సాయంత్రం గంటన్నరకు పైగా కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులోని ధాన్యం నీళ్లలో కొట్టుకుపోయింది. జిల్లాలోని చిన్నకోడూర్ మండలంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు మరణించాయి. అలాగే, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ శివారులో ఉన్న టోల్‌ప్లాజా పైకప్పు రేకులు ఈదురుగాలుల దెబ్బకు కూలి నాలుగు కౌంటర్లు ధ్వంసమయ్యాయి.
దీంతో దాదాపు గంటసేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. మెదక్ జిల్లాలోని చేగుం ట, నిజాంపేట, రామాయం పేట, అల్లాదుర్గం మండలాల్లో మామిడి కాయలు నేలరాలగా, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచింది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి దోమకొండ, బీబీపేట, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్, భిక్కనూర్, రాజంపేటలోని కల్లాల్లోని ధాన్యం తడిచిపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద ఆరబోసిన ధాన్యం నీళ్లపాలైంది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండ లం తుజాల్‌పూర్‌లో పిడుగుపడి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాన బీభత్సానికి కరీంనగర్ జిల్లా ఇందుర్తిలో ఇల్లు కూలిపోగా, గునుకులపల్లిలో మామిడి చెట్లు విరిగిపడ్డాయి. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలో కురిసిన వడగండ్ల వాన దెబ్బకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోగా, పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. మరోపక్క, నిజామాబాద్ జిల్లా వేంపల్లిలో ఆదివారం 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 44.7, నిర్మల్ జిల్లాలో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వడదెబ్బ వల్ల మహబూబాబాద్ జిల్లా అప్పరాజుపల్లికి చెందిన మండల సర్వయ్య(55) అనే ఉపాధి కూలి, ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామానికి చెందిన పాపయ్య(70) ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 4 రోజులతో పోలిస్తే ఆదివారం వాతావరణం కాస్త చల్లబడింది. హైదరాబాద్‌లో ఆదివారం 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వగా.. రాబోయే 3 రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..
AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..