Tuesday: ఆ ఆలయంలో.. మంగళవారం మాంసంతో భోజనం!
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:28 PM
గ్రామదేవతలకు బోనాలు చేసి, యాటను బలివ్వడం... ఆ తర్వాత కుటుంబం, సన్నిహితులతో కలిసి వేడుక జరుపుకోవడం మామూలే. అక్కడ మాత్రం అమ్మవారి ఆలయంలో ప్రతీ మంగళవారం మాంసంతో భోజనం పెడతారు. అమ్మవారి ప్రసాదంగా భావించి భక్తులు క్యూ కడతారు.
హైదరాబాద్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట(Siddipet) పట్టణం ఉంది. అక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని చింతల్ చెరువు వద్ద వెలసిన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. అక్కడ ప్రతీ మంగళవారం మాంసంతో భక్తులకు భోజనం పెడతారు.
పట్టణానికి చెందిన అందే కృష్ణారెడ్డి పూర్వీకులు రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారు పసుపులో వెలిసిందని చెబుతూ... తమకు చెందిన 6 ఎకరాల 12 గుంటల స్థలాన్ని ఆలయం కోసం కేటాయించారు. ఆ తల్లినే వారు ఇలవేల్పుగా కొలిచేవారట. ఆ స్థలంలోనే చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు. అయితే తరాలు మారుతున్న కొద్దీ వ్యక్తిగత అవసరాల కోసం ఆలయ ప్రాంతం మినహా మిగతా స్థలాన్ని ఇతరులకు అమ్మేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం కృష్ణారెడ్డి కుటుంబంలోని ఒక మహిళకు అమ్మవారు కలలో ప్రత్యక్షమై, ఆ స్థలంలో దేవాలయాన్ని నిర్మించాలని సూచన చేసిందట. దాంతో అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆ స్థలంలో రూ. 25 లక్షల సొంత డబ్బుతో ఆలయాన్ని పునర్నిర్మించారు. అప్పటి నుంచి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి భక్తుల రాకపోకలు ఊపందుకున్నాయి.

ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాక...
చింతల్ చెరువు రేణుక ఎల్లమ్మ స్వయంభూ పేరిట అమ్మవారిని భక్తులు కొలుస్తుండటంతో... సిద్దిపేట జిల్లాతో పాటు నిజామాబాద్, భోదన్, భైంసా, మహారాష్ట్ర, పెద్దపల్లి, ముస్తాబాద్, మంచిర్యాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ప్రతీ రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఆలయంలో కృష్ణారెడ్డి కుటుంబసభ్యులతో పాటు, సిద్దిపేటకు చెందిన ఒక కుటుంబం అమ్మవారికి నిత్య సేవలు చేస్తున్నారు. ప్రతీ ఏడాది మే 18న ఆలయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
మాంసాహారం ఎందుకు?
రేణుక ఎల్లమ్మ స్వయంభూ ఆలయం పునఃనిర్మాణం జరిగి, అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన నాటి నుంచి భక్తులకు ఆలయ నిర్వహకులు అన్నదాన కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదట్లో ఆలయంలో శాకాహార భోజనం మాత్రమే ఉండేది. అయితే అమ్మవారి భక్తులు తాము కోరుకున్న కోరికలు తీరగానే, మంగళవారం అమ్మవారికి బోనాలతో ఊరేగింపుగా వచ్చి మేకలను బలివ్వడం మొదలెట్టారు. దాంతో ఆలయ ప్రాంగణంలో మిగతా రోజుల్లో శాకాహార భోజనం పెడుతున్నప్పటికీ, గత మూడేళ్లుగా ప్రతీ మంగళవారం మాంసాహార భోజనం వడ్డించడం ఆనవాయితీగా మారింది.

అమ్మవారి ప్రసాదంగా భావించి, మాంసం భోజనాన్ని తినేందుకు ప్రతీ మంగళవారం 300 నుంచి 400 మందికి పైగా భక్తులు ఆలయానికి వస్తుంటారు. చాలామంది మొక్కులు తీరడంతో, మేకను బలిచ్చి భోజనాలు పెడుతుండగా... దాతలు ఎవరూ లేకుంటే ఆలయ నిర్వాహకులే మంగళవారం నాడు మాంసాహారాన్ని అందిస్తున్నారు. భక్తులు కూడా ప్రసాదంగా భావించి, వరుసక్రమంలో మటన్ భోజనం చేస్తుంటారు.
‘‘గ్రామ దేవతగా భావించే చింతల్ చెరువు ఎల్లమ్మ తల్లి దీవెనలతో ఆలయానికి వస్తున్న భక్తులకు శాకాహారంతో పాటు మంసాహార భోజనాన్ని అందిస్తున్నాం. భక్తుల కోర్కెలు తీరడంతో... మొక్కుల చెల్లింపులో భాగంగా అందిస్తున్న మేకలు, బియ్యంతో ఇక్కడే వంట చేసి భక్తులకు ప్రతీ మంగళవారం కడుపునిండా భోజనం పెడుతున్నాం. భక్తులు, దాతలు ముందుకు రాకుంటే మేమే సొంత డబ్బులు వెచ్చించి మరీ మటన్ భోజనం అందిస్తున్నాం’’ అని ఆలయ నిర్వాహకుడు అందే కృష్ణారెడ్డి తెలిపారు.

మొత్తానికి ఈ ఆలయంలో ప్రతీ మంగళవారం పండగ వాతవరణమే కనిపిస్తుంది. గత పదేళ్లుగా ఆలయంలో బోనాలు నిర్వహిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. సాధారణంగా ఏదైనా పండుగ వస్తే ఇంట్లో బోనాలు తీయడం, మేకను బలివ్వడం, బంధువులతో కలిసి సరదాగా గడుపుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆలయానికి వచ్చే వారంతా కుటుంబసభ్యుల్లా కలిసిపోయి, అందరితో కలిసి భోజనం చేస్తుంటారు. అమ్మవారి అనుగ్రహం దక్కిందని సంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఎల్లమ్మ తల్లిని ‘కోరిన కోరికలు తీర్చితే, తాము కూడా యాటతో భోజనం పెడతామ’ని మొక్కుకుంటారు.
- బిమిటి అశోక్, సిద్దిపేట
ఫొటోలు: బాబురావు
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
Read Latest Telangana News and National News