Tummala: తెలంగాణ రైతుల ఉసురు తీసింది మీరు కాదా?
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:46 AM
తెలంగాణ రైతుల ఉసురు తీసింది మీరు కాదా? అని బీఆర్‌ఎస్ నేతలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.
వరి తప్ప ఇతర పంటల మద్దతు ధరపై ఆలోచించారా?.. బీఆర్‌ఎ్‌సను ప్రశ్నించిన తుమ్మల
ఎరువులు సరఫరా చేయండన్నా రాజకీయమేనా?.. పేరెత్తకుండానే బీజేపీపై పరోక్ష విసుర్లు
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతుల ఉసురు తీసింది మీరు కాదా? అని బీఆర్‌ఎస్ నేతలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. వరి తప్ప ఏనాడైనా ఇతర పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలన్న సంగతి ఆలోచించారా? అని ప్రతిపక్ష పార్టీ నేతలను నిలదీశారు. ఒకసారి వరి, మరొకసారి మొక్కజొన్న, ఇంకొకసారి పత్తి సాగు వద్దని.. ఏది పడితే అది చెప్పి అన్నదాతలను గందరగోళంలో పడేశారన్న తుమ్మల.. గత పా లకుల మాట విని సాగు చేసిన పంటలకు మార్కెట్ లేక విలవిల్లాడిన రైతుల గోస ఏనాడైనా వినిపించుకున్నారా? అని బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. హుజారాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసం రాష్ట్ర దళితులందరికి దళిత బంధు ఇస్తామని ప్రచారం చేసి.. ఎన్నిక పూర్తి కాగానే చేతులెత్తేసిన సర్కారు బీఆర్‌ఎ్‌సదని తుమ్మల శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక వేళ.. ఆ నియోజకవర్గ రైతుల ఖాతాల్లో రూ.50 వేలు జమ చేసి గెలుపొందాలని ఆలోచించిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదన్నారు.
నాడు రూ.లక్ష రుణ మాఫీని నాలుగు దఫాల్లో అమలు చేయాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడిందో వారికే తెలియాలని వ్యాఖ్యానించారు. రెండోసారి ఎన్నికల్లో గెలవడానికి సగం మంది రైతులకే రుణ మాఫీ చేశారని ఆరోపించారు. కానీ, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం.. ఎన్నికల లబ్ధి కోసం నిధులు విడుదల చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించడం వారి విజ్ఞతకే అద్దం పడుతుందని పేర్కొన్నారు. వరి వేస్తే ఉరి అని మీరు చెబితే.. తమ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్‌పై రూ.500 బోనస్ ఇచ్చి, ఎకరానికి రూ.10,000- 15,000 చొప్పున అన్నదాతకు లబ్ధి చేకూరుస్తోందని ఆయన అన్నారు.
ఎరువులు ఇవ్వండన్నా రాజకీయమేనా?
రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు సకాలంలో ఇవ్వాలని అడిగితే, దాన్ని కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారని తుమ్మల విమర్శించారు. ఎరువుల గురించి లెక్కలతో సహా రాస్తున్న లేఖలను చూడకుండా ఏ రాజకీయ ప్రయోజనం కోసం వారు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి
Read Latest Telangana News And Telugu News