Share News

Tummala : ఉచితాలు తగ్గించాలి

ABN , Publish Date - May 06 , 2025 | 03:52 AM

నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ.. పెద్దాయనకు కోపం రాదంటే.. ఉచితాలు తగ్గించాలి. నిరుపేదలైన అర్హులకే ఉచితాలు అందాలి. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డులు అందరి దగ్గరి ఉండటం వల్ల ఉచితాలు అనర్హులకు అందుతున్నాయి.

Tummala : ఉచితాలు తగ్గించాలి

  • అర్హు లకే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వాలి

  • కిలో రూ.3 ఉన్న బియ్యాన్ని రూ.2కే ఇస్తే నాడు ఎన్టీఆర్‌ను దేవుడని అన్నారు

  • ఇప్పుడు కిలో బియ్యం రూ. 60 ఉండగా.. ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదు

  • రాష్ట్రంలో కోటి పది లక్షల కుటుంబాలుంటే కోటి పాతిక లక్షల రేషన్‌ కార్డులున్నాయి

  • తినడానికి లేనివారికే బియ్యం ఇవ్వాలి

  • ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చెప్పకూడదు

  • మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

ధారూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ.. పెద్దాయనకు కోపం రాదంటే.. ఉచితాలు తగ్గించాలి. నిరుపేదలైన అర్హులకే ఉచితాలు అందాలి. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డులు అందరి దగ్గరి ఉండటం వల్ల ఉచితాలు అనర్హులకు అందుతున్నాయి. తినడానికి తిండి లేని వారికి బియ్యం ఇవ్వాలి.. అమ్ముకునే వారికి ఇవ్వొద్దు. కిలో బియ్యం రూ.3 ఉన్నప్పుడు 2 రూపాయలకే అందించిన ఎన్టీ రామారావును దేవుడన్నారు. కానీ ఇప్పుడు కిలో బియ్యం రూ.60గా ఉన్నప్పటికీ ఉచితంగా ఇస్తారా? ఇది పద్ధతి కాదు కదా.. తెలంగాణలో కుటుంబాలను మించి రేషన్‌ కార్డులు ఉన్నాయి. కోటి పది లక్షల కుటుంబాలు ఉంటే.. కోటి పాతిక లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. అంటే పక్క రాష్ట్రాల వారికి కూడా ఇక్కడ కార్డులు ఉన్నాయనేది స్పష్టమవుతోంది. మీ ఊళ్లో రేషన్‌ కార్డులు లేనోళ్లను పది, ఇరవై మందిని తీసుకు రండి.. అంటే అందరూ పేదోళ్లేనా?’’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌ జిల్లా ధారూరులోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైౖతు భరోసా భూమి ఆసామికే వెళుతుంది కానీ.. పంట పండించిన వారికి అందడం లేదన్నారు. రైతు భరోసా ఎలా ఇద్దామన్నదానిపై మీ సలహాలు కూడా ఇవ్వాలని ఆయన రైతులను, ప్రజలను కోరారు.


పెద్దాయన చెప్పినట్లుగా కౌలు రైతులకు బోనస్‌ వచ్చిందని, మీరందరూ ఒప్పుకుంటే ఇంకా కొన్ని మార్పులు చేస్తామని చెప్పారు. అన్నదాతను కాపాడుకునే అవకాశం వస్తుందని, రైతులకు ప్రభుత్వం సాయం చేసేది కొంతైనా.. మీరు కష్టపడేది ఎక్కువ అని, కష్టానికి తగ్గ ఫలితం ఉండాలంటే మనం నూతన పద్ధతులను అవలంబించాలని, ప్రపంచంతో పోటీ పడుతూ పంటలు పండించాలని ఆయన అన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుతో మంచి లాభాలు ఉంటాయని, వికారాబాద్‌ జిల్లాలో ఈ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. ఆయిల్‌పామ్‌ పంట మూడేళ్లలో కోతకు వస్తుందని, దీనికి కోతులు, పశువుల బెడద ఉండదన్నారు. ఈ పంట సాగుతో పాటు అంతర పంటలు సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఆయిల్‌పామ్‌ పంటను కంపెనీ వాళ్లతో కొనుగోలు చేయించి, డబ్బులను రైతుల ఖాతాల్లో వేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎకరాకు రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. రైతులకు పంట నష్టం పరిహారం అందే విధంగా పంటల బీమా అమలుకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. వికారాబాద్‌ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మలను కోరారు. శాస్త్రవేత్తలు రైతులకు మేలైన వంగడాలను అందించాలని, శాస్త్రీయ వ్యసాయం పద్ధతులను రైతులు అనుసరించి పంటల సాగు దిగుబడిని పెంచుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి వల్ల చాలామంది రైతులు భూముల హక్కులను కోల్పోయారన్నారు. భూ భారతి చట్టం ద్వారా రైతులు తమ భూముల సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 03:52 AM