TGRTC Miyapur Workshop: మియాపూర్ బస్ బాడీ వర్క్‌షాప్‌కు మంగళం!
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:57 AM
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో లాభాల బాటలో పయనిస్తున్న టీజీఎ్‌సఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైనా దృష్టిసారిస్తోంది.
ఉప్పల్‌కు తరలించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం
ఆ స్థలాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే యోచన
హైదరాబాద్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో లాభాల బాటలో పయనిస్తున్న టీజీఎ్‌సఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైనా దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న బస్ బాడీ బిల్డింగ్ వర్క్‌షా్‌పను ఎత్తివేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనిని ఉప్పల్‌కు తరలించి ఆ స్థలాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ కమిటీ గత నెల 19న బస్‌భవన్‌లో సమావేశమై పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. మియాపూర్ వర్క్‌షా్‌పను ఉప్పల్‌కు తరలించే ప్రతిపాదనలపై ఆయా విభాగాల అధికారులు చర్చించారు. కమిటీ సభ్యులు శనివారంలోగా నివేదిక సమర్పించాలని గడువు విధించారు. సుమారు 20 ఏళ్ల నుంచి కొనసాగుతున్న మియాపూర్ వర్క్‌షాప్ ఆర్టీసీ బస్సుల బాడీకి సంబంధించిన నిర్మాణ పనుల్ని చేపడుతుంది. బస్ బాడీల తయారీ, మరమ్మతులు వంటివి ఇక్కడ చేస్తుంటారు. కీలకమైన ఈ వర్క్‌షా్‌పను పూర్తిగా ఉప్పల్‌కు తరలించి ఈ స్థలాన్ని సంస్థకు ఆదాయ వనరుగా మార్చుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. ఉప్పల్, కరీంనగర్ యూనిట్లలో ప్రస్తుతం కొనసాగుతున్న పనుల్లో అవసరంమేరకు మార్పులు, చేర్పులు చేయనున్నారు. మానవ వనరుల సద్వినియోగం, తయారీ యూనిట్లను కేంద్రీకరించడంలో భాగంగా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే.. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాంకాలం నాటి గౌలిగూడ బస్టాండ్ స్థలాన్ని రూ.400 కోట్లకు తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారన్న అంశం తీవ్ర దుమారం రేపింది. ఈ విషయాన్ని యాజమాన్యం ఖండించలేదు. తాకట్టు పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు మియాపూర్ వర్క్‌షాప్ స్థలం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ఆదాయ వనరుగా మార్చుకునేందుకు పావులు కదుపుతుండటం సంస్థలో చర్చనీయాంశంగా మారింది. ఆదాయం కోసం ఇప్పటికే హైదరాబాద్, ఇతర జిల్లాల్లోని కొన్ని ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. మరికొన్ని స్థలాలనూ లీజుకిచ్చే ప్రయత్నాల్లో యాజమాన్యం ఉంది. కాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో ఆక్యుపెన్సీ రేషియో 100ు ఉందని చెబుతున్న యాజమాన్యం.. ఆదాయం కోసం ఆస్తులను లీజుకివ్వాలనుకోవడం సరికాదని కార్మికులు వాపోతున్నారు. సాధారణంగా 70ు ఆక్యుపెన్సీ రేషియో ఉంటేనే సంస్థ నిర్వహణకు సరిపడ నిధులు ఉంటాయని, ఇప్పుడు 100ు ఆక్యుపెన్సీ ఉండి, మహాలక్ష్మి పథకంతో రూ.800 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించినా ఇంకా కార్మికులకు బకాయిలు ఉండటం, ఆస్తుల లీజు నిర్ణయాలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
Read Latest TG News and National News