Telangana Panchayat Elections: పంచాయితీ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ ఘన విజయం..
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:29 PM
ట్రాన్స్ జెండర్ అంటే.. గృహప్రవేశాలు, శుభకార్యాలలో, రోడ్లపై వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తారని అంతా భావిస్తారు. కానీ, తాము ప్రజా సేవలోనూ ముందుంటామని నిరూపిస్తున్నారు ఈ ట్రాన్స్‌జెండర్. అవును..
నాగర్ కర్నూల్, డిసెంబర్ 18: ట్రాన్స్ జెండర్ అంటే.. గృహప్రవేశాలు, శుభకార్యాలలో, రోడ్లపై వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తారని అంతా భావిస్తారు. కానీ, తాము ప్రజా సేవలోనూ ముందుంటామని నిరూపిస్తున్నారు ఈ ట్రాన్స్‌జెండర్. అవును.. ఈ మేరకు ఎన్నికల్లో నిలవడమే కాకుండా.. జయకేతనం ఎగురవేశారు. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఎవరు విజయం సాధించారు.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా చారకొండ గ్రామపంచాయతీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్ జెండర్ నందిని ఎన్నికయ్యారు. ఈ పంచాయతీలో 12 వార్డులకు గాను 11వ వార్డుకు ఎస్సీ జర్నరల్ కేటాయించారు. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ మద్దతుతో నందిని, బీఆర్ఎస్ నుంచి పెద్దాపూర్ వెంకటయ్య, బీఎస్పీ నుంచి మల్లేష్ పోటీ పడ్డారు.
ఈ వార్డులో మొత్తం 372 ఓటర్లు ఉన్నారు. బుధవారం వెళ్లడైన ఫలితాలలో నందిని.. బీఆర్ఎస్ అభ్యర్థిపై 64 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె గెలుపుపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నందిని.. ట్రాన్స్‌జెండర్ మహిళలు ఓన్లీ నూతన గృహప్రవేశాలప్పుడు, శుభకార్యాలలో డబ్బులు వసూలు చేస్తారనే భావన ప్రజల్లో ఉంటుంది. కానీ, డబ్బులు వసూళ్లకే పరిమితం కాకుండా అన్నిట్లో మేమున్నామని చాటిచెప్పాలనే తన లక్ష్యమన్నారు. తనను ఆదర్శంగా తీసుకొని ట్రాన్స్‌జెండర్ మహిళలు అన్నింట్లోనూ ముందుండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నా సేవలు గుర్తించి అవకాశం కల్పించిందని.. తనను గెలిపించిన గ్రామ ప్రజలకు నందిని కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన గ్రామ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ.. గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతానన్నారు.
Also Read:
విద్యార్థుల మృతి కేసులో నకిలీ పోలీసుల విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజాదర్బార్‌లో మంత్రి కొండపల్లి