Share News

Medak Tragedy: ఇద్దరు పిల్లలతో కోర్టు భవనంపై నుంచి దూకి..

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:40 AM

మెదక్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు భవనం వద్ద విషాద ఘటన జరిగింది. పేషీకి హాజరైన భార్యాభర్తలు క్షణికావేశంలో తమ ఇద్దరు పిల్లలతో కలిసి కోర్టు భవనంపై నుంచి కిందకు దూకారు.

Medak Tragedy: ఇద్దరు పిల్లలతో కోర్టు భవనంపై నుంచి దూకి..

  • గొడవల కారణంగా దంపతుల దుశ్చర్య

  • భార్య మృతి.. ముగ్గురికి గాయాలు

  • 6నెలల నుంచి భార్యాభర్తల మధ్య తగాదాలు

మెదక్‌ అర్బన్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు భవనం వద్ద విషాద ఘటన జరిగింది. పేషీకి హాజరైన భార్యాభర్తలు క్షణికావేశంలో తమ ఇద్దరు పిల్లలతో కలిసి కోర్టు భవనంపై నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్త, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ గ్రామానికి చెందిన నవీన్‌గౌడ్‌, రమ్య (28) భార్యాభర్తలు. వీరికి యశ్విక(5), రుత్విక(2) కూతుళ్లు. ఆరు నెలల కిత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పిల్లలు నల్లగా ఉన్నారంటూ భార్యతో నవీన్‌ గొడవపడేవాడని తెలిసింది. భర్త వేఽధింపులు తాళలేక రమ్య తన పుట్టిల్లు అయిన రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌కు వెళ్లింది. కొన్నాళ్లకు.. భార్యను పంపడం లేదంటూ నవీన్‌ లక్ష్మాపూర్‌కు వెళ్లి.. అత్తగారి ఇంటిపై సుత్లి బాంబులు వేశాడు. ఈ ఘటనతో అతడిపై రామాయంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.


రెండు నెలలు జైల్లో ఉన్నాడు. ఈ కేసు విషయంలో శనివారం కోర్టు విచారణకు దంపతులు హాజరయ్యారు. అక్కడ ఇద్దరి నడుమ మళ్లీ గొడవ తల్తెతింది. కొద్దిసేపటికి రమ్య, నవీన్‌ పిల్లలను వెంటబెట్టుకొని కోర్టు భవనంపైకి వెళ్లి అక్కడ నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో రమ్య మృతిచెందింది. భర్త నవీన్‌గౌడ్‌ కాళ్లు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. పిల్లలిద్దరి చేతులకు దెబ్బలు తగిలాయి. మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌ ఘటన స్థలానికి చేరుకొని రమ్య మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో చిన్నారులను నిలోఫర్‌కు, నవీన్‌ను గాంధీకి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదైంది.


ఇవి కూడా చదవండి

పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..

మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్

Updated Date - Jun 29 , 2025 | 04:40 AM