Share News

Saraswati Pushkaram: పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - May 17 , 2025 | 04:05 AM

సరస్వతీ పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం త్రివేణి సంగమానికి వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Saraswati Pushkaram: పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

త్రివేణి సంగమానికి రెండో రోజు 50 వేల మంది రాక.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క దంపతుల పుణ్యస్నానం

  • ఇతర రాష్ట్రాల నుంచీ భక్తుల హాజరు

  • బస్సుల సంఖ్య 300కు పెంపు

  • నేడు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం

  • పుష్కరాల్లో పాల్గొనడం అదృష్టం: భట్టి

భూపాలపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): సరస్వతీ పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం త్రివేణి సంగమానికి వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పుష్కరాలు ప్రారంభమైన గురువారం 20 వేల మంది భక్తులు వచ్చినట్టు అంచనా వేయగా.. రెండో రోజైన శుక్రవారం 50 వేల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా వేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క దంపతులు కాళేశ్వరాన్ని సందర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు వారికి ఘన స్వాగతం పలకగా.. భట్టి దంపతులు తొలుత సరస్వతీ మాతను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం నదిలో పుణ్యస్నానం ఆచరించి సరస్వతీమాతకు చీర, సారె సమర్పించారు. అంతకుముందు శ్రీ పీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద, జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా తదితరులు పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా, ఈ పుష్కరాలకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. శని, ఆదివారాల్లో భక్తుల రాక మరింత పెరుగుతుందని, సోమవారం రాజరాజేశ్వరస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో.. భక్తులు భారీగా తరలి వస్తారని అధికారులు చెబుతున్నారు.


కిటకిటలాడిన బస్సులు..

పుష్కరాలకు శుక్రవారం ఉదయం 6గంటల నుంచే భక్తుల రాక పెరగడంతో బస్సులన్నీ కిటకిటలాడాయి. నిన్నటివరకు 60 బస్సులను మాత్రమే నడిపిన అధికారులు శుక్రవారం ఆ సంఖ్యను 300కు పెంచారు. ఇవే కాకుండా 3వేలకు పైగా ప్రైవేటు వాహనాల్లోనూ భక్తులు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక బస్టాండ్‌ నుంచి జ్ఞాన సరస్వతీ పుష్కరఘాట్‌ వరకు రోడ్లన్నీ భక్తులతో సందడిగా మారాయి. ఇటు కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంలోనూ భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. అయితే పదే పదే వీవీఐపీల బ్రేక్‌ దర్శనాల కోసం సాధారణ భక్తులను నిలిపివేయడంతో చాలామంది భక్తులు ఇబ్బందులు పడ్డారు. అసహనంతో దేవాదాయ శాఖ అధికారులతో, పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. మరోవైపు భక్తుల రద్దీకి తగ్గట్టుగా దేవాదాయ శాఖ 40 వేలకు పైగా లడ్డూలు, పులిహోర ప్రసాదాలను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం ఉదయం నుంచి వాతావరణం కాస్త చల్లగా ఉన్నా.. మధ్యాహ్నం ఒక్కసారిగా భానుడు ప్రతాపం చూపడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.


సరస్వతీ పుష్కరం మహా అద్భుతం: భట్టి

కాళేశ్వరం: సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. మొదటిసారిగా కాళేశ్వరంలో సరస్వతీ ఫుష్కరాలతో పాటు టెంట్‌ సిటీ ఏర్పాటు చేసి వేల మంది విడిది చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పుష్కర మహోత్సవాల్లో ప్రతీ రోజు ఒక పీఠాధిపతితో పాటు తామంతా వస్తున్నామని తెలిపారు. జీవితంలో చేసిన పొరపాట్లన్ని పుష్కర స్నానంతో పరిసమాప్తం అవుతాయన్నారు. పుష్కర కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును అభినందించారు. అనంతరం టెంట్‌సిటీకి వెళ్లిన భట్టి.. శుక్రవారం రాత్రి అక్కడే బస చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 04:05 AM