TGSRTC: ఇక అద్దెకు ఆర్టీసీ ఈవీ బస్సులు..
ABN , Publish Date - Sep 03 , 2025 | 08:49 AM
ఐటీ కారిడార్‌లో ఎలక్ర్టిక్, మెట్రో డీలక్స్ బస్సులను ప్రముఖ ఐటీ సంస్థలకు అద్దెకిచ్చే దిశగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో వేలసంఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి తిరిగి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు వినియోగిస్తే ఐటీకారిడార్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించే అవకాశం ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది.
- ఐటీ కంపెనీలకు ఇచ్చేందుకు ఆర్టీసీ చర్యలు
హైదరాబాద్ సిటీ: ఐటీ కారిడార్‌లో ఎలక్ర్టిక్, మెట్రో డీలక్స్ బస్సులను ప్రముఖ ఐటీ సంస్థలకు అద్దెకిచ్చే దిశగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో వేలసంఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి తిరిగి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు వినియోగిస్తే ఐటీకారిడార్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించే అవకాశం ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. ఐటీ కారిడార్ కేంద్రంగా ఆర్టీసీ 200 ఎలక్ర్టిక్ ఏసీ, నాన్‌ఏసీ బస్సులతో పాటు మరో 250 మెట్రో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, ఆర్డినరీ బస్సులను నడుపుతోంది. సీబీఎస్, బాచుపల్లి, శంషాబాద్, ఈఎస్‌ఐ, రిసాల్‌బజార్,
ఉప్పల్, సికింద్రాబాద్, కోఠి, మియాపూర్(Secunderabad, Kothi, Miyapur)తో పాటు గ్రేటర్ పరిధిలోని 13 ప్రాంతాల నుంచి 450 బస్సులను ఐటీ కారిడార్ మీదుగా నడుపుతోంది. ఐటీకారిడార్‌లో ప్రజా రవాణా సేవలు మరింత విస్తరించడంతో పాటు ఐటీ కంపెనీలకు వచ్చే ఉద్యోగులు ఆర్టీసీ సేవలు వినియోగించుకునేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఐటీ సంస్థలు ప్రజారవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని, ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వామ్యమయ్యే ఉద్యోగులకు ప్రోత్సహకాలు ఇచ్చే అంశాలను ఆర్టీసీ పరిశీలిస్తోంది.

మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు ఉద్యోగులు వచ్చి, వెళ్లేందుకు బస్సులు అద్దెకివ్వాలని ఆర్టీసీ భావిస్తోంది. అక్టోబరులో గ్రేటర్‌జోన్‌కు 275 ఎలక్ర్టిక్ బస్సులు వస్తున్నాయని ఈ బస్సులను ఐటీ కంపెనీల ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా అద్దెకిచ్చి, ఇతర సమయంలో నగరంలో తిప్పేలా ప్రణాళికలు సిధ్దం చేస్తోంది. ఆర్టీసీ అందిస్తున్న సేవలను ఉన్నతాధికారులు ఐటీ కంపెనీల ప్రతినిధులకు వివరించారు.
ఐటీ సంస్థల ప్రతినిధులతో ఎండీ సమావేశం
ఐటీకారిడార్‌లో ఆర్టీసీ సేవలను విస్తరించడంలో భాగంగా సుమారు 70 ఐటీ సంస్థల ప్రతినిధులతో ఆర్టీసీ ఎండీ, గ్రేటర్‌జోన్ ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సేవల విస్తరణకు ఐటీ సంస్థల ప్రతినిధులిచ్చే సలహాలు, సూచనలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.
త్వరలో 275 ఈవీ బస్సులు
ఐటీకారిడార్‌లో ప్రజా రవాణా సేవలను విస్తరించడంలో భాగంగా త్వరలో 275 ఎలక్ర్టిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఎలక్ర్టిక్ బస్సులతోపాటు మెట్రో డీలక్స్ బస్సులను అద్దెకిస్తాం. ఐటీ సంస్థలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఈవీ బస్సుల వాడకంతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
- వీసీ సజ్జనార్, టీజీఎస్ ఆర్టీసీఎండీ
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు
Read Latest Telangana News and National News