బినామీలకు పరిహారం!
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:59 AM
ఫార్మాసిటీ భూసేకరణలో బినామీ పేర్లతో పరిహారం, ప్లాటు పొందిన వారి నుంచి రికవరీ చేయడానికి టీజీఐఐసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అక్రమంగా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

‘ఫార్మా సిటీ’ భూసేకరణలో వెలుగులోకి అక్రమాలు
భూ పరిహారం లబ్ధిదారుల్లో పలువురు బినామీలే!
గత ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి చేసి బినామీలకు పరిహారం ఇప్పించిన నేతలు
సమాచారం సేకరిస్తున్న అధికారులు పరిహారంతో పాటు ప్లాట్ల రికవరీకి చర్యలు
యాచారం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఫార్మాసిటీ భూసేకరణలో బినామీ పేర్లతో పరిహారం, ప్లాటు పొందిన వారి నుంచి రికవరీ చేయడానికి టీజీఐఐసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అక్రమంగా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఫార్మాసిటీకి భూసేకరణ సమయంలో ఆందోళనలు చేస్తూనే గుట్టుగా బినామీలు పరిహారం కింద పొందిన డబ్బు, ప్లాట్‌ను తిరిగి రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో ఫార్మాసిటీ కోసం 19,333 ఎకరాల భూములు సేకరించాల్సి ఉండగా.. యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఇప్పటికే ప్రభుత్వ, అసైన్డ్ భూములు 4000 ఎకరాలను సేకరించారు. పట్టా భూములు 6000 ఎకరాలకు గాను 4000ఎకరాలు సేకరించారు. మరో 2వేల ఎకరాలపై కోర్టు కేసులు నడుస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టా భూమికి ఎకరాకు రూ.12.50 లక్షలు, అసైన్డ్ భూమికి రూ.8లక్షల చొ ప్పున పరిహారం పొందారు. దీంతోపాటు ఎకరం భూమి ఇచ్చిన రైతులకు 121గజాల ప్లాట్లనూ ఇ చ్చారు. ప్లాట్లను పొందినవారిలో ఎక్కువగా బినామీ లే ఉన్నారని మండలంలో ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి..
మేడిపల్లిలో 1,601 మంది, నానక్‌నగర్‌లో 359, తాటిపర్తిలో 545, కుర్మిద్దలో 1240 మంది రైతులకు ప్లాట్లను కేటాయిస్తూ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆయా గ్రామాలకు, అసలు మండలానికే సంబంధం లేని వ్యక్తులు భూపరిహారంతోపాటు ప్లాట్‌ను పొందినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. గ్రామాల్లో అసైన్డ్ భూమి సెంటు కూడా లేని వ్యక్తులకూ పరిహారం అందిందన్న ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్ భూములను వారే అనుభవిస్తున్నారంటూ అప్పట్లో బీఆర్‌ఎస్ నేతలు తమ అనుచరులు, బినామీల పేర్లు రాయించారని స్థానికులు చెబుతున్నారు. ఫార్మా సిటీ కోసం వారి భూమిని సేకరించిందంటూ అప్పట్లో అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి చేసి, పరిహారం సొమ్ము, ప్లాట్ ఇప్పించినట్లు సమాచారం. ఇలా పరిహారం పొందిన బినామీలకు 121 గజాల ప్లాట్ కూడా ఇచ్చారు. ఆ ప్లాట్లను కూడా చాలా మంది అమ్మేసి, సొమ్ము చేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాంటి బినామీలకు గతంలో అధికారులు పరిహారం ఎలా ఇచ్చారు? ప్లాట్ ఎలా కేటాయించారు? అని టీజీఐఐసీ అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. బినామీల విషయమై ఇంటెలిజెన్స్ శాఖ కూడా విచారణ చేసి ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు తెలిసింది. పరిహారం, ప్లాట్ల తతంగంపై రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సెంటు భూమి కూడా లేని బినామీలకు పరిహారం, ప్లాట్ ఇచ్చారంటూ గతంలోనే కాంగ్రెస్ నాయకులు నాటి కలెక్టర్, ఉన్నతాధికారుల కు ఫిర్యాదు చేశారు. అయినా అప్పట్లో అధికారులు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో బినామీల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బినామీల బాగోతాన్ని ఉన్నతాధికారులకు వివరించి, రికవరీ చేయించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News