Share News

TG-Agros: ఆగ్రోస్‌లో గ‘లీజు’ దందా!

ABN , Publish Date - Jan 07 , 2025 | 03:52 AM

రాజుల సొమ్ము... రాళ్ల పాలు అన్నట్లుగా తయారైంది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీజీ- ఆగ్రోస్‌) ఆస్తుల పరిస్థితి.

TG-Agros: ఆగ్రోస్‌లో గ‘లీజు’ దందా!

  • భూమి లీజుకిచ్చి చోద్యం చూస్తున్న సంస్థ

  • ఏడాదికి రావాల్సిన ఆదాయం 3 కోట్లపైనే

  • కోటి కూడా వసూలు చేయని పరిస్థితి

  • నోటీసులు ఇచ్చి.. చేతులు దులుపుకొంటున్న ఆగ్రోస్‌

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాజుల సొమ్ము... రాళ్ల పాలు అన్నట్లుగా తయారైంది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీజీ- ఆగ్రోస్‌) ఆస్తుల పరిస్థితి. కోట్లాది రూపాయల విలువైన ఆగ్రోస్‌ భూముల్లో పెట్రోలు బంకులు, ఇతర వ్యాపార సంస్థలు నడుపుకొంటున్న లీజు దారులు... నెల నెలా అద్దె చెల్లించడానికి మాత్రం మొహం చాటేస్తున్నారు. నెలకు రూ.25 లక్షల చొప్పున... ఏడాదికి కనీసం రూ.3 కోట్ల అద్దె రావాల్సి ఉండగా... రూ.కోటి కూడా వసూలు కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. తెలంగాణ ఆగ్రో్‌సకు హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భూములు, ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని చింతల్‌లో సర్వే నంబర్లు- 221, 222లో 10 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఆగ్రోస్‌ బ్రాంచ్‌ కార్యాలయంతోపాటు డిస్‌ప్లే సెంటర్‌, అంతర్గత రహదారులు కలిపి 2 ఎకరాల 11 గుంటల విస్తీర్ణంలో ఉన్నాయి. ఆగ్రోస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కర్షక్‌ పెట్రోల్‌ పంపు 12గుంటల స్థలంలో ఉండగా.. ఓ బీఆర్‌ఎస్‌ నాయకుడు దీన్ని నిర్వహిస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 54శాతం లాభం లీజుదారుడు తీసుకొని, 46 శాతం లాభాన్ని ఆగ్రో్‌సకు చెల్లించాలన్నది ఒప్పందం. ఈ స్థలానికి అద్దెను సైతం లీజుదారుడే చెల్లించాలి. అడపాదడపా 46 శాతం వాటా చెల్లిస్తున్న లీజుదారుడు.. 12 గుంటల స్థలానికి మాత్రం నయాపైసా అద్దె కూడా చెల్లించడం లేదు.


అసలు.. ఈ లీజుకు సంబంధించిన ఒప్పంద పత్రాలేవీ ఆగ్రోస్‌ వద్ద లేకపోవడం గమనార్హం. ఈ స్థలానికి తక్కువలో తక్కువగా రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు అద్దె వచ్చే అవకాశం ఉన్నా.. ఆగ్రోస్‌ పట్టించుకోవడం లేదు. మరో 5 ఎకరాల స్థలాన్ని ఒక పెద్ద వ్యాపారికి ఇచ్చి, రూ.7.50 లక్షలు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ వ్యాపారి ఇప్పటిదాకా రూపాయి సైతం చెల్లించలేదు. ఆ ఒక్క వ్యాపారి అద్దె బకాయిలే రూ.కోటిపైగా ఉన్నాయి. అద్దె చెల్లించకపోతే స్థలం ఖాళీ చేయాలన్న నిబంధన ఉన్నా.. అధికారులు ఎలాంటి ఒత్తిడీ చేయడం లేదు. ఇక, అదే ప్రాంతంలో ఎకరం భూమిని చిన్న వ్యాపారాలు నడుపుకొనే వారికి లీజుకు ఇవ్వగా, చాలా మంది అద్దె చెల్లించడం లేదు. ఇటీవల 27 మందికి ఆగ్రోస్‌ సంస్థ నోటీసులు జారీ చేయగా.. ఒక లీజుదారుడు ఆగ్రోస్‌ కార్యాలయానికి వెళ్లి అధికారులపైనే దౌర్జన్యానికి దిగాడు. ఇక, నల్లగొండలో పెట్రోలు పంపు ఏర్పాటు చేసిన స్థలానికి నెల వారీ అద్దె కేవలం రూ.36 వేలుగా నిర్ణయించారు. ఇది చాలా రద్దీ ప్రాంతమైనా.. తక్కువ అద్దెను నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని సైతం లీజుదారుడు సక్రమంగా చెల్లించడం లేదు. ఇది కాకుండా వనపర్తిలో ఎకరం స్థలాన్ని రూ.1.50 లక్షలు, రాజేంద్రనగర్‌లో ఉన్న స్థలాన్ని రూ.70వేల చొప్పున లీజుకు ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో కలిపి నెలకు రూ.25లక్షల చొప్పున ఏడాదికి రూ.3కోట్లు అద్దె రూపంలో ఆగ్రో్‌సకు ఆదాయం రావాల్సి ఉండగా.. రూ.కోటి కూడా రావడం లేదు. రెన్యువల్‌ చేసుకుంటే ఎక్కడ కిరాయి పెరుగుతుందేమోనని చాలా మంది లీజుదారులు ముందుకు రావడం లేదు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న అద్దెలను సైతం సక్రమంగా చెల్లించడం లేదు.


నోటీసులు ఇచ్చాం.. వసూలు చేస్తాం

కొందరు లీజుదారులు అద్దె చెల్లించకుండా ఆగ్రోస్‌ ఆదాయానికి గండి కొడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ అంశంపై అధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహించాం. అద్దె బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేశాం. అద్దె చెల్లిస్తే ఆగ్రోస్‌ స్థలంలో ఎప్పటి మాదిరిగానే వ్యాపారం చేసుకోవచ్చని, లేకపోతే ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్పష్టంగా పేర్కొన్నాం. కొందరు గడువు పూర్తయినా రెన్యువల్‌ చేసుకోవడంలేదు. లీజుదారుల నుంచి అగ్రిమెంటు ప్రకారం అద్దెలతోపాటు బకాయిలు వసూలు చేస్తాం.

- కాసుల బాలరాజు, తెలంగాణ ఆగ్రోస్‌ ఛైర్మన్‌

Updated Date - Jan 07 , 2025 | 03:52 AM