Intermediate Education: ఏఐతో ‘స్మార్ట్’గా ఇంటర్ విద్య!
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:26 AM
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ యుగం మొదలైన నేపథ్యంలో.. ఇంటర్మీడియట్ విద్యలో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
చాట్‌జీపీటీ, జెమిని, కోపైలట్ వంటి కృత్రిమ మేధ యాప్స్‌తో బోధన
ప్రత్యేకంగా పాఠ్యాంశాల రూపకల్పన
వీటిపై అవగాహన ఉన్న లెక్చరర్లతో ‘ఏఐ చాంపియన్స్’
అన్ని ప్రభుత్వ కాలేజీల్లో స్మార్ట్ బోర్డులు
విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు
రేపటి నుంచే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలు
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ యుగం మొదలైన నేపథ్యంలో.. ఇంటర్మీడియట్ విద్యలో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు నిర్ణయించింది. విద్యలో నాణ్యత పెంపు, విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి, సరికొత్త సాంకేతికతల పరిచయం కోసం ఏఐని వినియోగించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీల్లో కృత్రిమ మేధ సాంకేతికతపై పట్టున్న బోధనా సిబ్బందిని గుర్తించిన ఇంటర్ బోర్డు.. వారిని ‘ఏఐ చాంపియన్స్’ ఎంపిక చేసింది. ఈ ఏఐ చాంపియన్స్‌తోపాటు జిల్లా విద్యా పర్యవేక్షణ అధికారులందరికీ గురువారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏఐ వినియోగంపై ఒకరోజు రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరం నిర్వహించింది. ప్రభుత్వ కాలేజీల్లో ఏఐ పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య దిశానిర్దేశం చేశారు.
రేపటినుంచి ఏఐ ఆధారిత హాజరు..
ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల హాజరును రిజిస్టర్‌లో నమోదు చేస్తుండగా.. శనివారం (ఈ నెల 23) నుంచి ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం - ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరును అమల్లోకి తెస్తున్నారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సాంకేతిక సహకారంతో.. ‘టీజీబీఐఈ-ఎ్‌ఫఆర్‌ఎస్’ యాప్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం కాలేజీ సిబ్బంది తమ ఫోన్లతో విద్యార్థుల హాజరును నమోదుచేస్తారు. ఇప్పటికే కాలేజీల్లో చేరిన విద్యార్థుల ముఖ హాజరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను శుక్రవారం చేపట్టనున్నారు. విద్యార్థి హాజరుకాకుంటే.. వారి తల్లిదండ్రుల ఫోన్‌కు సందేశం వెళ్తుంది. ప్రతిరోజు విద్యార్థుల హాజరును జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు. సాధారణంగా తరగతులకు గైర్హాజరవడమే ఇంటర్ పరీక్షల్లో ఎక్కువ మంది ఫెయిలవడానికి కారణమని, ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరుతో విద్యార్థులపై పర్యవేక్షణ సులభం అవుతుందని అధికారులు తెలిపారు. తరచూ గైర్హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రిన్సిపాళ్లు ప్రతినెలా మాట్లాడనున్నారు. అలాంటి విద్యార్థులకు అదనపు తరగతులు చెప్పే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిసింది.
కృత్రిమ మేధతో బోధన
పుస్తకాల్లో ఉన్న పాఠాలు చదువుకుంటూ పోవడం కాకుండా.. విద్యార్థులకు బాగా అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా బోధించడంపై అధికారులు దృష్టి సారించారు. దీనిపై గురువారం శిక్షణలో జిల్లా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. జిల్లా ప్రతినిధులు అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు శిక్షణ ఇస్తారు. చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి ఏఐ యాప్స్ సహాయంతో ‘స్మార్ట్’ బోధన చేపట్టనున్నారు. ఇందుకోసం పాఠ్యాంశాల వారీగా పీడీఎఫ్, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఫైళ్లను రూపొందిస్తున్నారు. వీటితో బోధనకు వీలుగా తరగతి గదుల్లో స్మార్ట్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మరో ఆరు వారాల్లో అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో స్మార్ట్ బోర్డులు ఏర్పాటు చేస్తామని ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఏఐ పరిజ్ఞానంతో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News