Indiramma Amrutham: కిశోర బాలికలకు ‘ఇందిరమ్మ అమృతం’!
ABN , Publish Date - May 29 , 2025 | 04:45 AM
కౌమార బాలికలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ అమృతం’ పథకాన్ని అమలు చేయనుంది. 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన కిశోర బాలికల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు వయస్సుకు తగిన బరువు పెరిగేలా చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త పథకాన్ని రూపొందించింది.
పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాల్లో అమలు
బాలికలకు పల్లీ, చిరుధాన్యాల పట్టీలు
నేడు కొత్తగూడెంలో ప్రారంభోత్సవం
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): కౌమార బాలికలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ అమృతం’ పథకాన్ని అమలు చేయనుంది. 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన కిశోర బాలికల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు వయస్సుకు తగిన బరువు పెరిగేలా చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త పథకాన్ని రూపొందించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 50,269 మందికి పల్లి, చిరుధాన్యాలతో తయారైన పట్టీలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కౌమార బాలికలకు ఉచితంగా పంపిణీ చేయనుంది. పల్లీలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అరికెలు, వరిగెలు, సామలు వంటి చిరుధాన్యాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలుండటంతో వాటితో తయారు చేసిన పట్టీలను వారికి నెలకు 30 చొప్పున అందజేస్తారు.
వీటి తయారీ, నిల్వలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పరిశీలనకు కమిటీ కూడా ఏర్పాటైంది. ఈ ప్రాజెక్టు ద్వారా పొందిన అనుభవాల ఆధారంగా పథకాన్ని ఇతర జిల్లాలకూ విస్తరింపజేస్తారు. కొత్తగూడెంలో ఈ పథకాన్ని గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించనున్నారు. కౌమార బాలికలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగం కావాలని సీతక్క కోరారు. కాగా, ఈ పథకంలో భాగంగా ఆరోగ్యశాఖ ద్వారా అవసరమైన బాలికలకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందిస్తారు. సెర్ఫ్ సహకారంతో బాలికల జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడతారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వీరి కోసం పోషకాహార చైతన్యం, బాల్య వివాహాలు, లింగ వివక్ష, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, బాలికల చట్టాలపై అవగాహన కల్పిస్తారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తారు.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..